Don't Trouble The Trouble Review: రాజమౌళి.. డోంట్‌ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ

ABN , Publish Date - Oct 02 , 2026 | 10:00 AM

దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించిన డోంట్‌ ట్రబుల్ ద ట్రబుల్ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చింది.

Don't Trouble The Trouble Review

డోంట్‌ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ

ఓపెనింగ్స్ కోసమని సినిమాలకు ఓవర్ హైప్ క్రియేట్‌ చేస్తే అవి అసలుకే ఎసరు పెట్టే ఆస్కారం ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూసే ప్రేక్షకుడికి, భారీ అంచనాలతో థియేటర్ కు వెళ్ళే వారికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. సినిమా ఏ మాత్రం అటూ ఇటూ ఉన్నా.. అంచనాలతో వెళ్ళే వారు పెదవి విరవడం ఖాయం. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి (S. S. Rajamouli) సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ (S. S. Karthikeya) నిర్మించిన డోంట్‌ ట్రబుల్ ద ట్రబుల్‌ (Don't Trouble The Trouble) విషయంలో అదే జరిగిందేమో అనిపిస్తోంది. ఈ సినిమా గురించి టాలీవుడ్‌ స్టార్స్ పాజిటివ్‌ రివ్యూస్ ఇవ్వడంతో అంచనాలు అంబరాన్ని తాకాయి. మరి ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రధారిగా నూతన దర్శకుడు శశాంక్‌ ఏలేటి (Shashank Yeleti) తెరకెక్కించిన 'డోంట్‌ ట్రబుల్‌ ద ట్రబుల్‌' మూవీ ఆ అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం.

సూరి (ఫహాద్‌ ఫాజిల్‌)కు డబ్బంటే పిచ్చి. ఎలాగైనా డబ్బు సంపాదించి జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలని అనుకుంటాడు. ఎదుటి వారి ఎమోషన్స్ తో అతనికి సంబంధమే ఉండదు. అనాథ అయిన సూరికి మెజీషియన్‌ మల్లేష్‌ (వెంకటేశ్‌ కాకుమాను) ఒక్కడే ఫ్రెండ్‌. అడ్డదారుల్లో డబ్బు సంపాదించే క్రమంలో ఓల్డ్ సిటీలోని ఎమ్మెల్యే, అండర్ వరల్డ్ డాన్‌ అస్లామ్‌భాయ్‌ (మహేశ్‌ మంజ్రేకర్‌)ను సూరి మోసం చేస్తాడు. ఆ విషయం బయటపడటంతో అస్లామ్‌భాయ్‌ రెండు రోజుల్లో పాతిక లక్షలు తనకు ఇవ్వకపోతే... సూరిని, మల్లేష్‌ను చంపేస్తానని బెదిరిస్తాడు. ఎవరైనా పిల్లలను కిడ్నాప్‌ చేసి, డబ్బులు సంపాదించి అస్లామ్‌ భాయ్‌కి ఇవ్వాలని సూరి పథక రచన చేస్తాడు. అలా దివ్య (సారా పాలేకర్) అనే చిన్నారిని కిడ్నాప్‌ చేస్తాడు. తన తల్లిదండ్రులను పొరపాటున తాను మయాం చేశానని, ఏలాగైనా మ్యాజిక్‌ చేసి వారిని తిరిగి తెప్పించమని ఆ పాప... సూరిని బ్రతిమిలాడుతుంది. నిజానికి సూరి కిడ్నాప్ చేసింది ఓ దెయ్యం పిల్లను. ఆ పిల్ల నుంచి తనను తాను ఎలా కాపాడుకున్నాడు? తన కష్టాల నుంచి ఎలా బయటపట్టాడు? తల్లిదండ్రులు తన కారణంగానే మాయమైపోయారని భావిస్తున్న ఆ చిన్నారి పేరెంట్స్ ను ఎలా సూరి రక్షించాడు? అనేది మిగతా కథ.

ఇలాంటి కథలు హాలీవుడ్ తో పాటు తెలుగులోనూ చాలానే వచ్చాయి. ఆత్మలు తమ వారిని కాపాడటం కోసం హీరో సాయం తీసుకునే చిత్రాలు ఎన్నో గతంలో చూశాం. అయితే ఇందులో ఆత్మ అని తెలియక హీరో కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత నిజం తెలిసి భయపడటం, కాస్తంత స్థిమితపడి, ఆ ఆత్మకు సాయం చేయడం జరుగుతుంది. ఇదే కాదు... కొన్ని పెంపుడు కుక్కలు సైతం ఆపదలో ఉన్న తమ వారిని ఆదుకునేందుకు హీరోల సాయం పొందిన సినిమాలూ వివిధ భాషల్లో వచ్చాయి. ఇందులో కుక్క కూడా ప్రధాన పాత్రను పోషించడం వల్ల అలాంటి సినిమాలు కూడా దీనిని చూస్తుంటే మదిలో మెదులుతాయి. కథాంశంలో కొత్తదనం లేకపోవడం, కథనంలో వేగం లేకపోవడం ఈ సినిమాకు సంబంధించిన ప్రధానమైన లోటు. హీరో తాను కిడ్నాప్ చేసింది ఓ పిల్ల దెయ్యాన్ని అని తెలిసి భయపడినప్పుడు థియేటర్ లో నవ్వుల జల్లలు కరుస్తాయి. ఓ ఊహించని వైబ్ క్రియేట్‌ అయ్యింది. కానీ దానికి ముందు లేదా తర్వాత అలాంటి స్పందన కనిపించలేదు. ముఖ్యంగా ఎమోషన్స్ ను పండించడంలో దర్శకుడు శశాంక్‌ విఫలమయ్యాడు.

భిన్నమైన పాత్రలు చేయడంలో ఫహాద్‌ ఫాజిల్‌ ఎప్పుడూ ముందుంటాడు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా మనసుకు నచ్చాలే కానీ ఏ పాత్ర అయినా చేసేస్తాడు. కానీ అతని స్థాయికి తగ్గట్టుగా ఈ కథను రాసుకోలేదు. అతని పాత్ర చిత్రీకరణ కూడా ఏమంత బలంగా లేదు. అలానే చిన్నారికి తల్లితండ్రులతో ఉన్న అనుబంధాన్ని మరింత బలంగా చూపించాల్సింది. అవసరమైన సన్నివేశాలను వదిలిపెట్టేసి... దర్శకుడు ఎటెటో వెళ్ళిపోయాడు. చిన్నారిగా సారా పాలేకర్‌ బాగా చేసింది. అయితే చిన్న పిల్లల కథాంశం అనగానే మనకు ఇటీవల వచ్చిన 'ఇరుముడి' సినిమా మదిలో మెదులుతుంది. దానితో పోలిక ఎంత లేదన్నా వస్తుంది. ఈ రెండు సినిమాల్లోనూ చిన్నారులు చనిపోతారు. కానీ కథను ముందుకు తీసుకెళతారు. ఆ సినిమాలో మణెమ్మ పాత్రతో ఇందులోని దివ్య పాత్రను పోల్చలేం. కానీ అక్కడ నక్షత్ర చేసినంత బాగా ఇక్కడ సారా చేయలేదని పిస్తుంది. ఇక ఇతర ప్రధాన పాత్రలను శశాంక్‌, మహేశ్‌ మంజ్రేకర్‌, సౌరభ్‌ సచ్‌దేవా, సుబ్బరాజు తదితరులు పోషించారు. బ్రాడ్‌ ఫ్రాన్సిస్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సీజే వర్క్ కూడా భేషుగ్గా ఉంది. కాలభైరవ తన సంగీతంతో సన్నివేశాలను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఫహాద్‌ ఫాజిల్‌ తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడంతో కాస్తంత పట్టి పట్టి మాట్లాడినట్టు అనిపిస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ వంతు ప్రయత్నాన్ని సిన్సియర్‌ గా చేసినా... కథ, కథనాలలో దమ్ములేకపోవడంతో ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని నిరాశకు గురిచేస్తుంది.

షోయింగ్‌ బిజినెస్‌, ఆర్కా మీడియా వర్క్స్‌ నిర్మాణం విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాకు ప్రెజెంటర్‌. ఆయన కొడుకు కార్తికేయ నిర్మాతల్లో ఒకరు. సో... సహజంగానే సినిమా కాస్తంత భిన్నంగా ఉంటుందని, అన్ని వర్గాలను అలరిస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఆ అంచనాలే వారిని నిరాశకు గురి చేయవచ్చు. చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా కాబట్టి పేరెంట్స్ కిడ్స్ తో కలిసి థియేటర్స్ కు వెళితే, కొంతలో కొంత ఫలితం దక్కొచ్చు!

రేటింగ్‌ : 2.5/ 5

ట్యాగ్‌ లైన్‌: కాస్తంత ఇబ్బందే!

Updated Date - Oct 02 , 2026 | 10:04 AM