పాయల్ చెంగప్ప 'మయూఖ' మూవీ రివ్యూ

ABN , Publish Date - Oct 09 , 2026 | 05:46 PM

పాయల్‌ చెంగప్ప నాయికగా శ్రీతేజ్‌ ఎస్.కె. దర్శకత్వంలో రూపొందిన 'మయూఖ' సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. శశిధర్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.

Mayookha Movie

శ్రీకాంత్ కాడ్రేగుల దర్శకత్వం వహించిన డెబ్యూ మూవీ 'మయూఖ'. ఈ సినిమాను ఆయన శ్రీతేజ్‌ ఎస్.కె. పేరుతో రూపొందించారు. పాయల్‌ చెంగప్ప టైటిల్‌ రోల్ ప్లే చేసిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ శుక్రవారం జనం ముందుకొచ్చింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న 'మయూఖ' ను శశిధర్‌ నల్ల ప్రొడ్యూస్ చేశారు. మరి 'మయూఖ' ఎలా ఉందో తెలుసుకుందాం.

మయూఖ (పాయల్‌ చెంగప్ప) ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో పని చేస్తుంటుంది. సింగిల్‌ గా ఓ ఫ్లాట్‌ అద్దెకు ఉంటుంది. రాత్రి పూట తనతో పాటు ప్లాట్‌లో ఎవరో ఉన్నారనే భావన ఆమెను కలిచివేస్తుంటుంది. దానికి తోడు ఓ భయంకరమైన కల ఆమెను నిద్రలో ఉలిక్కిపడేట్టు చేస్తుంది. దాంతో ఫ్లాట్‌ మారాలనే నిర్ణయానికి వస్తుంది. ఒకసారి బ్యాంక్‌లో కుమార్ అనే కస్టమర్‌తో జరిగిన గొడవతో అతను ఆమెను రోడ్డు మీద అటకాయిస్తాడు. ఆ సమయంలో బ్యాంక్‌లోనే పనిచేసే అభిరామ్‌ ఆమెను సేవ్‌ చేస్తాడు. పనిలో పనిగా ఆమెను ఇంటిలో దించడానికి వెళ్ళి అక్కడ అనుకోకుండా హత్యకు గురవుతాడు. దాంతో ఎస్.ఐ. శ్రీధర్‌... అభిరామ్‌ మరణానికి మమూఖనే కారణమని భావిస్తాడు. ఆ తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ లో ఆమె అపరాథి అని తేలుతుంది. అయితే మయూఖకు వచ్చే భయంకరమైన కలకు కారణం ఏమిటీ? నిజంగానే ఆమె ఫ్లాట్‌లో రాత్రి పూట ఎవరైనా సంచరిస్తున్నారా? అదే నిజమైతే ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు మయూఖను అతను అలా నీడలా ఫాలో అవుతున్నాడు? అనేది మిగతా కథ.


విశేషం ఏమంటే... దర్శకుడు శ్రీతేజ్‌ ఎస్.కె. చెప్పాలనుకున్న కథ మయూఖది మాత్రమే కాదు. మరో వ్యక్తిది కూడా! వాసన గుర్తించడం తెలియని ఓ కుర్రాడు కేవలం కాలిన చర్మం వాసన మాత్రమే గుర్తించడం జరిగితే అతను ఎలా సైకోగా మారిపోతాడు? సొంత తండ్రిని, చెల్లిని హత్య చేసిన అతని జీవితం ఎలా మారిపోయింది? కాలిన ఆడవారి చర్మం నుంచి సెంటును తయారు చేసే ఆ సైకో చేతిలో అతి దారుణంగా హింసకు గురైన యువతులు ఎవరు? ఈ మిస్టరీని ఓ పోలీస్‌ ఆఫీసర్ ఎలా ఛేదించాడన్నది 'మయూఖ' అసలు కథ. ప్రథమార్ధంలో మయూఖ చుట్టూ తిరిగే ఈ కథ, ద్వితీయార్ధంకు వచ్చేసరికీ సైకో స్టోరీగా మారిపోతుంది. ఈ ఇద్దరికి ఉన్న అనుబంధంతో సినిమా ముగుస్తుంది. అయితే సైకోతో మయూఖకు గతంలోనే పరిచయం ఉన్న విషయాన్ని పోలీస్‌ ఆఫీసర్‌ ప్రశ్నించడంతో ఈ సినిమా సీక్వెల్‌కు దర్శకుడు శ్రీతేజ్‌ ఎస్.కె. తెర లేపాడు.

హారర్ ధ్రిల్లర్ సినిమాలను ఇవాళ సాధారణ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా తర్వాత ఓటీటీలలో పలు భాషలకు చెందిన వెబ్ సీరిస్ లు చూడటంతో వీటికి జనాలు బాగానే అలవాటు పడ్డారు. గతంలో ఒకే సినిమాలో అన్ని అంశాలను చూడాలని కోరుకున్న తెలుగు ప్రేక్షకులలోనూ మార్పు వచ్చింది. దానికి తగ్గట్టుగా హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీస్ కూడా పెరిగాయి. కాకపోతే... ఈ జానర్ ను సైకోపాత్‌లోకి తీసుకెళ్ళడంలోనే అసలు చిక్కంతా. సైకో కథలలో ప్రతిదీ పరాకాష్టలో ఉంటుంది. ఇందులోనూ పది, పన్నెండేళ్ళ పిల్లాడు చెల్లిని, తండ్రిని చంపేసి కాల్చడాన్ని చూపించారు. తెర మీద ఆ సన్నివేశాలు చాలా జుగుప్సను కలిగించేలా ఉన్నాయి. వాసన ఎరగని కారణంగా ఆ కుర్రాడు అలా సైకోగా తయారయ్యాడనేది ఏ రకంగానూ సమంజసం గా అనిపించదు. దర్శకుడు తన బుర్రకు తట్టిన దానిని తెర మీద చూపించాడు. అలానే కాలిన మహిళల చర్మంతో పెర్ఫ్యూమ్‌ తయారు చేయడాన్ని కూడా విపులంగా చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. దానికి తోడు సన్నివేశాలన్నీ గజిబిజిగా ఉండిపోయి, ప్రతి వారిని అనుమానించేలా చూపించడం కూడా ప్రేక్షకులతో మైండ్‌ గేమ్‌ ఆడటమే!


నటీనటులు కొత్తవాళ్ళు, లేదా ఒకటి రెండు సినిమాలు చేసిన అనుభవం ఉన్నవారు. పాయల్‌ చెంగప్పతో పాటు ఇతర కీలక పాత్రలను అమన్ మసూద్‌, రఘు వాసిరెడ్డి, నానాజీ కర్రి, మురళీధర్‌ గౌడ్‌, మది నస్రీన్‌ తదితరులు చేశారు. వారి నుంచి మంచి నటనే దర్శకుడు రాబట్టుకున్నాడు. సాంకేతిక నిపుణులలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సంగీతం అందించిన శిబి మాథ్య అలెక్స్ గురించి. అలానే సౌండ్‌ మిక్సింగ్‌ కూడా సూపర్ గా ఉంది. కేవలం సౌండ్స్ తోనే థియేటర్ లోని ప్రేక్షకుల వెన్నుల్లో వణుకు పుట్టించాడు. సినిమా పతాక సన్నివేశం ప్రతినాయకుడి మోనోయాక్షన్ ను తట్టుకోవడం కష్టమే. అయితే ఏదో కొత్తగా చెప్పాలనే దర్శకుడి తాపత్రయం ఇందులో కనిపిస్తుంది. ఏదేదో ఊహించుకుని థియేటర్లకు వెళ్ళకుండా... ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయినప్పుడు చూస్తే సరిపోతుంది. అయితే కాస్తంత గుండెధైర్యం ఉన్నవాళ్ళకే ఈ సినిమా! లేకపోతే ఇందులోని అరాచకత్వాన్ని సున్నిత మనస్కులు తట్టుకోలేరు!

రేటింగ్‌: 2/5

ట్యాగ్‌లైన్‌: సైకో స్టోరీ!

ఇవి కూడా చదవండి:

Hanuman Ansh Review: హనుమాన్ అంశ్.. ఎలా ఉందంటే?

సినిమా రివ్యూ: చకోర

Comrade Kalyan Review: శ్రీవిష్ణు 'కామ్రేడ్‌ కల్యాణ్‌' ఎలా ఉందంటే..

Updated Date - Oct 09 , 2026 | 05:52 PM

మణిరత్నం సినిమా కోసం విజయ్ సేతుపతి సంచలన నిర్ణయం

Nithiin: నితిన్‌ ‘అలియాస్‌ రుక్మిణి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.

కోలీవుడ్‌కు మరో టాలీవుడ్ హీరోయిన్ జంప్

Scene Movie: సూర్య, నజ్రియా.. ‘అమ్మో ఇది ఎవర్రా’

Chiranjeevi: 11న కపిలేశ్వరపురానికి.. మెగాస్టార్ చిరంజీవి