Comrade Kalyan Review: శ్రీవిష్ణు 'కామ్రేడ్ కల్యాణ్' ఎలా ఉందంటే..
ABN , Publish Date - Oct 09 , 2026 | 06:01 AM
నవ్వులు పూయించే సినిమాలకు కేరాఫ్ అడ్రస్ శ్రీవిష్ణు. అతను ఏ జానర్ కథ ఎంచుకున్నా.. కామెడీ మాత్రం కామన్. ఆయన సినిమా వస్తోంది అంటే నవ్వులు గ్యారెంట్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. తాజాగా నక్సల్స్ నేపథ్యంలో శ్రీవిష్ణు నటించిన 'కామ్రేడ్ కల్యాణ్ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
సినిమా రివ్యూ: కామ్రేడ్ కల్యాణ్
విడుదల తేది: 9–10–2026
నవ్వులు పూయించే సినిమాలకు కేరాఫ్ అడ్రస్ శ్రీవిష్ణు. అతను ఏ జానర్ కథ ఎంచుకున్నా.. కామెడీ మాత్రం కామన్. ఆయన సినిమా వస్తోంది అంటే నవ్వులు గ్యారెంట్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. తాజాగా నక్సల్స్ నేపథ్యంలో శ్రీవిష్ణు నటించిన చిత్రం 'కామ్రేడ్ కల్యాణ్’. మహిమా నంబియార్ కథానాయిక. రాధిక, షైన్ టామ్ చాకో, మురళీధర్ గౌడ్, ఉపేంద్ర లిమాయే, శత్రు తదితరులు కీలక పాత్రధారులు. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహించారు. కోన వెంకట్ సమర్పణలో వెంకట్ కర్నాలి, సీత కర్నాలి నిర్మించారు. ట్రైలర్‌తో సినిమాపై ఓ నమ్మకం కలిగించారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో శ్రీవిష్ణు ఇచ్చిన స్టేట్‌మెంట్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ వారం విడుదల అనుకున్న పెద్ద సినిమా 'ఆదర్శ కుటుంబం’ వాయిదా పడటంతో 'కామ్రేడ్ కల్యాణ్’ పోటీ లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి కామ్రేడ్ కల్యాణ్‌గా శ్రీవిష్ణు మెప్పించాడా? అన్నది చూద్దాం.
కథ:
1990ల ప్రాంతంలో ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో సాగే చిత్రమిది. అక్కడ మాడుగుల గ్రామంలో టి.కల్యాణ్ (శ్రీవిష్ణు) ఓ మధ్య తరగతి కుర్రాడు. ఆ ఊళ్లో అలంకార్ టాకీస్‌ను లీజుకు తీసుకుని సినిమాలు ఆడిస్తూ.. జీవితం సాగిస్తుంటాడు. తల్లి సరస్వతమ్మ(రాధిక) అంటే అతనికి ప్రాణం. ఆమెకు హీరో బాలకృష్ణ అన్నా, ఆయన సినిమాలన్నా పిచ్చి.. అతని సినిమా విడుదలైన ప్రతిసారీ ఎవరో ఒకరితో గొడవపెట్టుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటుంది. అలా ఓసారి పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకుని వస్తుండగా అనారోగ్యం పాలవ్వడంతో దారిలో ఒరియా అమ్మాయి సితార(మహిమా) ప్రాణాలు కాపాడుతుంది. తొలిచూపులోనే ఆ అమ్మాయిపై మనసు పారేసుకున్న కల్యాణ్ ఆమెనే పెళ్లాడాలనుకుంటాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే ప్రాంతలో నక్సల్‌ను ఏరిపారేయడానికి ఐపీఎస్ అధికారి జార్ట్ కుట్టి (షైన్ టామ్ చాకో) అపాయింట్ అవుతాడు. అక్కడ మాస్టర్ సాయిచంద్ దళానికి పోలీసులకు మధ్య పోరాటం జరుగుతుంటుంది. మరోపక్క సితారకు తన ప్రేమను వ్యక్తం చేయాలనుకునేలోపు హీరోయిన్ కుటుంబం ఓ ఇబ్బందిలో ఉందనే విషయం బయటపడుతుంది. దాని నుంచి గట్టెక్కాలంటే రూ.5 లక్షలు కావాలి. స్నేహితుడి సలహాతో కల్యాణ్ ఓ సాహసం చేస్తాడు. అదేంటి? కల్యాణ్‌గా ఉన్న వ్యక్తి కామ్రేడ్‌గా ఎలా మారాడు? అడవిలో అడుగుపెట్టిన తర్వాత కల్యాణ్ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు? అసలు సితారకు వచ్చిన కష్టమేంటి? అన్నది కథ.
విశ్లేషణ:
శ్రీవిష్ణు సినిమాలో కాస్త కామెడీ ఉంటే చాలు ఆటోమేటిక్‌గా సినిమా పాసైపోతుంది. కామ్రేడ్ కల్యాణ్ టైటిల్ ప్రకటించినప్పటి నుంచే సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. నక్సల్స్ నేపథ్యమున్న సినిమా అని ట్రైలర్‌లో చెప్పినా శ్రీవిష్ణు మార్కు కామెడీ ఉంటుందని నమ్మకం పెంచుకున్నారు ఆడియన్స్. సాధారణంగా అన్నల సినిమాలంటే సీరియస్‌గా సాగుతుంటాయి. అయితే ఇది అందుకు భిన్నం. పూర్తిగా వినోదాత్మకంగా సాగే సినిమా ఇది. ఫస్టాఫ్ అంతా హీరో, అతని సినిమా థియేటర్, తల్లి సరస్వతమ్మ చేసే అల్లరి, అమ్మాయిని ప్రేమలో పడేయడానికి చేసే ప్రయత్నాలు, దుబాయ్ బాలుగా సత్య చేసే హంగామా, అతను రాసే ఇంగ్లిష్ లవ్‌లెటర్‌తో సరదాగా సాగిపోతుంది. బిస్వాస్‌గా ఉపేంద్ర ఎంటీ నవ్వుల్ని రెట్టింపు చేస్తుంది. నక్సల్స్ అంతు చూడాలనుకునే పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ, ఇంటర్‌వెల్‌కు ముందు పది నిమిషాల సన్నివేశాలు, ఊహించని ఓ ఘటనతో సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుంది. విరామం తర్వాత సినిమా అడివికి షిఫ్ట్ అవుతుంది. ఫస్టాఫ్ అంతా సరదాగా సాగితే సెకెండాఫ్‌లో అదే కొరవడింది. కథ అన్నల నేపథ్యంలోకి వెళ్లడంతో పెద్దగా కామెడీ పండించడానికి ఆస్కారం లేకుండా పోయింది. తదుపరి మంత్రి (శ్రీకాంత్ అయ్యంగార్) కిడ్నాప్‌తో మళ్లీ కథ కామెడీ ట్రాక్‌లో పడుతుంది. ఈ సన్నివేశాల్లో వెన్నెల కిశోర్‌తో కాస్త నవ్వులు పండించే ప్రయత్నం చేశారు. సెకెండాఫ్‌లో అడవిలో అన్నలు, తుపాకుల కాల్పులు ఉన్నా.. అందులోనూ వినోదాన్ని పండించే ప్రయత్నం చేశారు. అడవి సన్నివేశాలు సినిమా స్పీడ్‌ను కాస్త తగ్గించిన భావన కలిగింది. అందులోనూ సత్య కనిపించిన ప్రతిసారీ కామెడీ బాంబు వేసే వెళ్తాడు. క్లైమాక్స్ మాత్రం తేలిపోయినట్టుంది. పోలీసుల్ని, దళాల్ని ఒక దగ్గరకు తీసుకొచ్చి... అక్కడి పోరాటంలో ఎదురైన ఘటనతో రెండు మూడు సందేశాలిచ్చే సీన్లతో కాస్త తేల్చేసినట్లయింది. కొన్ని చోట్ల లాజిక్కులు మిస్ అయినా కామెడీ జానర్ సినిమా కాబట్టి పట్టించుకోవాలనే ఆలోచన రాకుండా రైటర్స్ జాగ్రత్త పడ్డారు. కొన్ని సన్నివేశాలను మాత్రం దర్శకుడు చక్కగా డీల్ చేశాడు. ఆచార్య దళం, ప్యారడైజ్ కాకి వంటి డైలాగ్‌లు నవ్వులు పూయించాయి. గతంలో వచ్చిన నక్సల్ సినిమాల రిఫరెన్స్‌లు ఆకట్టుకుంటాయి.
నటీనటులు–సాంకేతిక నిపుణుల పనితీరు..
కామ్రేడ్ కల్యాణ్‌గా శ్రీవిష్ణు ఒదిగిపోయారు. పాత్ర ఎలాంటిది అయినా అందులో లీనమైపోవడం, టైమింగ్, సింపుల్ ఎక్స్‌ప్రెషన్స్ ఆయన బలం. ఆయన బలాలు అన్నింటిని ఇందులో ఫుల్‌గా వర్కవుట్ చేశాడు. ఎత్తర ఎత్తు పాటలో ఆర్ నారాయణమూర్తిని ఇమిటేట్ చేయడం బావుంది. మహిమా నంబియార్‌కు తెలుగులో తొలి సినిమా ఇది. సితార పాత్రకు ఉన్నంతలో న్యాయం చేసింది. నిడివి పరంగా చూస్తే తక్కువే. నటనకు కూడా స్కోప్ ఇవ్వలేదు. ఈ మధ్యకాలంలో సత్య నటించిన ఏ సినిమాలో అయిన అతనిదే పైచేయి అవుతుంది. ఇందులో దుబాయ్ బాలుగా నవ్వించాడు. అయితే అతని నుంచి పూర్తిస్థాయి కామెడీ రాబట్టుకోలేకపోయారు. సుదర్శన్ ఓకే అనిపించాడు. తల్లిగా, బాలయ్య ఫ్యాన్‌గా రాధిక చేసిన హంగామా ఫస్టాఫ్‌లో ఆకట్టుకుంటుంది. సెకెండాఫ్‌లో చల్లబడిపోయింది. పోలీస్ అధికారిగా పవర్‌ఫుల్‌గా కనిపించిన షైన్ టామ్ చాకో పాత్ర కైమాక్స్‌కి వచ్చేసరికి డల్ అయిపోయింది. ఉపేంద్ర లిమాయే ఎంట్రీ బాగానే ఉన్నా.. సెకెండాఫ్‌లో మాత్రం బోర్ కొట్టించాడు. అన్నలుగా నటించిన సాయిచంద్, శత్రు, సరయు, ముక్కు అవినాష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మురళీధర్ గౌడ్‌కు అంత ఆస్కారం దొరకలేదు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ బావుంది. విజయ్ బుల్గానిన్ పాటలు బావున్నాయి నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపించింది. సెకెండాఫ్ ఎడిటింగ్ కాస్త క్రిస్ప్‌గా ఉండే బావుండేది. మాటల విషయంలో రచయితలు జాగత్త్ర తీసుకున్నారు. అదే జాగ్రత్త ఇంకాస్త కథపై పెట్టుంటే బావుండేది. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాల్లో తన సత్తా చాటిన దర్శకుడు సెకెండాఫ్‌లో కాస్త పట్టు విడిచినట్లు అనిపించింది. కామెడీకి కేరాఫ్ అయిన శ్రీవిష్ణు సినిమా కాబట్టి సినిమా క్లైమాక్స్ మరోలా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. కామెడీ సినిమాకు లాజిక్కులతో పని ఉండదు కాబట్టి.. నవ్వులు కావాలనుకునేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈవారం పెద్ద చిత్రాలేమీ లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం.
ట్యాగ్‌లైన్: కామెడీ కామ్రేడ్
రేటింగ్: 2.5/5