Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం రివ్యూ

ABN , Publish Date - Jul 30 , 2026 | 02:01 PM

సూపర్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు సోదరుడి కుమారుడు జై కృష్ణ హీరోగా పరిచయమైన 'శ్రీనివాస మంగాపురం' గురువారం విడుదలైంది.

Srinivasa Mangapuram Review

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు సోదరుడి కుమారుడు జైకృష్ణ హీరోగా పరిచయమైన సినిమా 'శ్రీనివాస మంగాపురం'. ఈ సినిమాతోనే రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ సైతం తెలుగు తెరకు పరిచయం అయ్యింది. సీనియర్ నిర్మాత అశ్వనీదత్‌ సమర్పణలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమాకు అజయ్‌ భూపతి దర్శకుడు. మరి ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న 'శ్రీనివాస మంగాపురం' ఎలా ఉందో చూద్దాం.

తమ పాపాలను తొలగించుకోవడానికి అందరూ తిరుపతికి వస్తుంటారు. కానీ చిత్రంగా తిరుపతిలోనే కొందరు పాపాత్ములుంటారు. అలాంటి వాడే పెద్దిరెడ్డి (కిక్ శ్యామ్‌). అతని కూతురు మంగ (రాషా తడాని). కాలేజీలో జరిగిన గొడవలతో ఊరు వదిలి తిరుపతి వచ్చేసిన శ్రీను (జైకృష్ణ) తొలి చూపులోనే మంగతో ప్రేమలో పడతాడు. ఆమెలోని చిన్నపాటి లోటును తొలగించి, ఆమెకు దగ్గర అవుతాడు. తన మనసులోని ప్రేమను మంగకు చెప్పేంతలో ఆమె తన ఎంగేజ్మెంట్‌ కార్డును శ్రీనుకు ఇస్తుంది. ఊహించని ఆ పరిణామానికి శ్రీను నివ్వెరపోతాడు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. 'ఆరు నూరైనా మంగ నాది' అని శ్రీను గట్టిగా చెబుతాడు. ఎలాగైనా ఆమెను తనదానిగా చేసుకుంటానని శపథం చేస్తాడు. శ్రీను ధీమాకు కారణం ఏమిటీ? అసలు అతను తిరుపతి ఎందుకు వచ్చాడు? తనను చంపాలనుకున్న పెద్దిరెడ్డి తమ్ముడి ప్రాణాలను శ్రీను ఎందుకు కాపాడాడు? శ్రీను వెనకున్న అసలు వ్యక్తులు ఎవరు? నిశ్చితార్థం జరుపుకున్న మంగను శ్రీను వివాహం చేసుకోగలిగాడా? లేదా? అనేది మిగతా కథ.


గతాన్ని మర్చిపోయిన హీరోయిన్ల కథలు తెలుగులో చాలానే వచ్చాయి. తమ ప్రేమను మర్చిపోయిన ఆమెకు గతాన్ని గుర్తు చేసి హీరో తన దానిని చేసుకోవడం ఎన్నో సినిమాల్లో చూశాం. సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇదీ అదే కథ. కాకపోతే... దర్శకుడు అజయ్ భూపతి కాస్తంత భిన్నమైన స్క్రీన్ ప్లేలో ప్రెజెంట్‌ చేశాడు. కానీ ప్రతి సన్నివేశం గతంలో మనం ఏదో ఒక సినిమాలో చూసిన భావనే కలుగుతుంది. హీరో, హీరోయిన్ ను సేవ్ చేసే సన్నివేశం 'పోకిరి'లోని గోల్కొండ పోర్ట్ యాక్షన్ సీన్ ను గుర్తు చేస్తుంది. హీరో ఇంట్రడక్షన్ సీన్‌ ఆసక్తికరంగా ఉంది. అలానే హీరోయిన్ మనసు దోచుకునే క్రమంలో హీరో పడే తపన కూడా బాగానే ఉంది కాకపోతే... ద్వితీయార్థంలో హీరోయిన్ గతాన్ని రివీల్ చేసిన విధానం, హీరో నేపథ్యం అవన్నీ పరమ రొటీన్ గా ఉన్నాయి. అయినా... ఎక్కడా బోర్ కొట్టకుండా కథను చకచకా నడిపేశాడు దర్శకుడు. అయితే... ద్వితీయార్థంలో ఎంటరయ్యే పాత్రలకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. మోహన్ బాబుది ఇందులో చాలా కీలకమైన పాత్ర అనే భావన ప్రచార సమయంలో కల్పించారు. తీరా చూస్తే... ఆయన హీరో తాతయ్యగా కాస్తంత పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశారు అంతే! మోహన్ బాబు పోషించిన వెంకటప్ప నాయుడు పాత్రకు అతని తమ్ముళ్ళ కొడుకుల మధ్య వైరానికి బలమైన కారణమే చూపలేదు. దాంతో ఆ పాత్రలు, వాటి మధ్య పగప్రతీకారాలు మరీ తెచ్చిపెట్టినట్టుగా ఉండిపోయాయి. దాని బదులు తమిళనాడు నుంచి తిరుపతి వచ్చి స్థిరపడిన నారాయణప్ప (వడ్లమాని శ్రీనివాస్) పాత్రను బాగా రాసుకుని ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. బలమైన విలనీ లేకపోవడం ఈ సినిమాకు మెయిన్ మైనస్.


నటీనటుల విషయానికి వస్తే... తొలి చిత్రమే అయినా జైకృష్ణ ఫర్వాలేదనిపిస్తాడు. మరో రెండు మూడు సినిమాలు చేస్తే కాస్త రాటు దేలే అవకాశం ఉంది. డాన్సులు పెద్దంతగా చేయలేదు కానీ ఫైట్స్ మాత్రం బాగానే చేశాడు. డైలాగ్ డెలివరీ ఓకే. కళ్ళు చిన్నగా ఉండటమే కాస్తంత మైనస్. జైకృష్ణ సరసన రాషా తడాని బాగానే ఉంది. వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. మోహన్ బాబు తన పాత్ర పరిధి మేరకు చేశారు. నరేశ్‌, బ్రహ్మాజీ లతో అక్కడక్కడా కామెడీ డైలాగ్స్ చెప్పించారు కానీ అవేవీ వర్కౌట్‌ కాలేదు. కిక్ శ్యామ్‌, వాసుకీ, శ్రీతేజ్, వడ్లమాని శ్రీనివాస్, అజయ్‌ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

సీనియర్ నిర్మాతలు కావడంతో అశ్వనీదత్, కిరణ్‌ ఎక్కడా నిర్మాణ పరంగా రాజీ పడలేదు. జీవీ ప్రకాశ్‌ సమకూర్చిన బాణీలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. జయకృష్ణ ఫోటోగ్రఫీ చక్కగా ఉంది. రియల్ సతీశ్‌ ఫైట్స్ అలరించేలా ఉన్నాయి. తొలి చిత్రంతోనే జైకృష్ణను యాక్షన్ హీరోగా ఎస్టాబ్లీష్‌ చేసే ప్రయత్నం దర్శకుడు అజయ్‌ భూపతి చేశాడు. అందులో కొంతమేరకు సఫలీకృతుడయ్యాడు. కథ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. హిందీ సినిమా 'ఇష్క్‌జాదే' ఛాయలు ఇందులో బాగానే కనిపించాయి. కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కాబ్టటి ఒకసారి చూద్దామని వెళితే ఓకే కానీ భారీ అంచనాలు పెట్టుకుని వెళితే నిరాశకు గురికాక తప్పదు.

రేటింగ్‌ : 2.5/5

ట్యాగ్‌లైన్: మరో మతిమరుపు ప్రేమకథ!

Updated Date - Jul 30 , 2026 | 02:01 PM

Srinivasa Mangapuram Trailer: కృష్ణ మ‌నవ‌డు.. అద‌ర‌గొట్టాడుగా

Srinivasa Mangapuram: కొత్తగా తిరుపతికొచ్చిన కుర్రోళ్ళని బతకనివ్వరా..?

Srinivasa Mangapuram: శ్రీనివాస మంగాపురం.. ర‌షా ఫ‌స్ట్‌ లుక్ అదిరింది.

Srinivasa Mangapuram: మోహన్ బాబుకు ఏమైంది..

Srinivasa Mangapuram: గుండె పేలిపోయేలా.. ఎంత బావుంది సాంగ్