ఇంప్యూర్ మూవీ రివ్యూ
ABN, Publish Date - Oct 02 , 2026 | 05:49 PM
నటి నిశాంతి ఈవని దర్శకత్వం వహించిన చిత్రం 'ఇంప్యూర్'. వారాహి మల్లిపాముల నటించి, నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. నవతరం మహిళల మనోభావాలను నిశాంతి 'ఇంప్యూర్' మూవీతో తెలియచెప్పే ప్రయత్నం చేశారు.
తెలుగు సినిమా హీరోయిన్లు మెగా ఫోన్ పట్టుకోవడం కొత్తేమీ కాదు... భానుమతి, సావిత్రి, విజయనిర్మల, జీవిత ఆ కోవకు చెందిన వాళ్ళే. ఆ జాబితాలోకే చేరింది నటి నిశాంతి. 'ఎల్.బి.డబ్ల్యు' సినిమాలో హీరోయిన్ గా నటించిన నిశాంతి ఈవని కాస్తంత ఆలస్యంగా మెగాఫోన్ పట్టింది. ఆమె తెరకెక్కించిన ఇండీ ఫిల్మ్ 'ఇంప్యూర్' శుక్రవారం జనం ముందుకొచ్చింది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన వారాహి మల్లిపాముల ఈ చిత్రానికి కథను అందించి, నిర్మించడం విశేషం.
సంధ్య (యష్నా ముత్తులూరి)కు గతంలో లవ్ ఎఫైర్ ఉండటం వల్ల పెద్దలు కుదుర్చిన పెళ్ళి చివరి నిమిషంలో ఆగిపోతుంది. ఆమె వర్జిన్ కాదని, అందుకే ఈ సంబంధాన్ని కాన్సిల్ చేసుకున్నామని అబ్బాయి వాళ్ళు ప్రచారం చేస్తారు. అయితే పెళ్ళి కొడుక్కి లేని వర్జినిటీ... పెళ్ళికూతురుకు ఎందుకు అవసరమనే పాయింట్ ను సంధ్య కజిన్ వీరా (వారాహి) లేవనెత్తుతుంది. కుటుంబ సభ్యుల వరకూ ఆ చర్చ ఉంటే బాగానే ఉండేది. కానీ ఎన్.ఆర్.ఐ. అయిన వీరా... తన ఓపీనియన్ ను వీడియోగా చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. దాంతో మొత్తం సొసైటీ ముందు సంధ్య దోషిలా నిలబడాల్సి వస్తుంది. అదే సమయంలో ఆమె ఉద్యోగం కూడా పోతుంది. ఇటు పెళ్ళి కాన్సిల్ కావడం, అటు ఉద్యోగం పోవడంతో సంధ్య తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. ఆ సమయంలో ఆమె జీవితంలోకి అడుగుపెట్టిన నిష్ (అభిజిత్ శ్రీనాథ్) కారణంగా తిరిగి జీవితం ట్రాక్ పైకి ఎక్కుతుంది. కానీ అదే టైమ్ లో ఇంట్లో వాళ్ళు బాల లింగం (కిరీటి దామరాజు) అనే ఎన్.ఆర్.ఐ.తో ఆమె పెళ్ళిని ఫిక్స్ చేస్తారు. మరోసారి జీవితాన్ని తెలియని వ్యక్తి చేతిలో పెట్టడం ఇష్టంలేని సంధ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది? భర్త 'గే' అని తెలిసి, అతనికి దూరంగా ఇండియా వచ్చేసిన వీరా తన అభిరుచికి తగ్గట్టుగా జీవితాన్ని ఎలా మలుచుకుంది? సినిమా హీరో అయిపోవాలని కలలు కన్న వీరిద్దరి స్నేహితుడు ప్రణవ్ (సాయికృష్ణ) చివరకు ఏ దారిని ఎంచుకున్నాడు? అనేది మిగతా కథ.
జీవితంలో తమ కాళ్ళ మీద తాము నిలబడాలనుకునే అమ్మాయిలకు ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. వాటిని పరిష్కరించుకునే క్రమంలో ఎదురయ్యే చేదు అనుభవాలను తట్టుకోవడం కూడా కష్టమే. దానికి తోడు ఇవాళ సోషల్ మీడియా కారణంగా ఎవరు ఏ చిన్న తప్పు చేసినా... అది వైరల్ అయిపోతుంటుంది. దాంతో జీవితం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. సమాజంలోని కట్టుబాట్లు, కుటుంబంలోని పెద్దల ఆలోచనా ధోరణులను దాటుకుని ఏ స్త్రీ అయినా స్వతంత్ర నిర్ణయం తీసుకోవడం మృగ్యం అయిపోతోంది. ఈ సినిమా కథ కూడా అలాంటి ఇద్దరమ్మాయిలకు చెందిందే. విదేశాలలో ఉండి వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవాలతో ఇండియాకు వచ్చిన వీర కథ ఒకటి అయితే... వీర క్షణికావేశం కారణంగా తన జీవితం సమస్యలలో ఇరుక్కుందని భావించే సంధ్య కథ మరొకటి. వీరిద్దరూ తమ లక్ష్యాలను ఎలా చేరుకున్నారనే దానిని దర్శకురాలు నిశాంతి ఈవని చక్కగా చూపించారు. ఈ సినిమా చూస్తుంటే గతంలో వచ్చిన మీరా నాయర్ 'మాన్సూన్ వెడ్డింగ్' గుర్తొస్తుంది. సంభాషణలన్నీ ఇంగ్లీష్, తెలుగులో సాగుతాయి. భారీ తనానికి పోకుండా, పరిమితమైన బడ్జెట్ లో దీనిని వారాహి, శ్రీదేవి మల్లిపాముల నిర్మించారు. నటీనటులంతా దాదాపుగా కుటుంబ సభ్యులేనేమో అనిపిస్తుంది. సినిమాలోని ప్రతి సన్నివేశం గొప్పగా లేకపోయినా... ఎక్కడా బోర్ కొట్టదు. ప్రధాన పాత్రలు పడుతున్న స్ట్రగుల్ ను కూడా వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా కిరీటి పోషించిన పెళ్ళికొడుకు పాత్ర మంచి రిలీఫ్‌ను ఇస్తుంది.
ప్రధాన పాత్రలు పోషించిన యష్నా తన పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చింది. ఎమోషన్స్ ను బాగా పండించింది. వీరా పాత్ర మొదట సాదాసీదాగా సాగినా... క్లయిమాక్స్ లో ఆ క్యారెక్టర్ గ్రాఫ్ అమాతంగా పెరిగిపోతుంది. సాయికృష్ణ, అభిజిత్ శ్రీనాథ్, కిరీటి దామరాజు, ఆర్జే కాజల్, శ్రీవాణి ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. గాయని రాజకుమారి, కరణ్ పాండవ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్జానశేఖర్ వి.ఎస్. డెబ్యూ డైరెక్టర్స్ పాలిటి ఓ వరం. ఆయన మరోసారి తన బాధ్యతను చక్కగా నెరవేర్చారు. దర్శకురాలిగా నిశాంతికి ఇది మొదటి సినిమానే అయినా... దర్శకత్వ శాఖలో ఉన్న అనుభవం కారణంగా సినిమాను రక్తి కట్టించింది. 'ఇంప్యూర్' అని అందరితో అనిపించుకున్న ఓ యువతి, 'ఐ యామ్ ప్యూర్' అని సగర్వంగా చాటడంతో శుభం కార్డు పడటం బాగుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమాను చూస్తే నచ్చుతుంది. కాకపోతే పేరున్న నటీనటులు లేని కారణంగా థియేటర్లలో ఆదరణ లభించడం కష్టమే. ఓటీటీలో స్ట్రీమింగ్ అయినప్పుడైనా ఇలాంటి సినిమాలను చూస్తే... నేటి తరం యువత మనోభావాలు ఎలా ఉన్నాయన్నది అర్థమౌతుంది.
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్: ఇట్స్ ప్యూర్!