Bhogi Movie Review: నరబలిని ప్రశ్నించిన ‘భోగి’
ABN, Publish Date - Nov 27 , 2026 | 01:31 PM
శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోగి’ సినిమా ఎలా ఉంది? నరబలి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో నటీనటుల ప్రదర్శన, కథ, కథనం, సాంకేతిక అంశాలపై సమీక్ష.
కొన్ని సినిమాలు చూడటానికి మంచి మనసుండాలి. కొన్ని సినిమాలు చూడటానికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. కానీ భోగి లాంటి సినిమా చూడటానికి గుండె దిటవు ఉండాలి. ఎందుకంటే నరబలి అనేది ఎంత అమానవీయమో చెప్పడానికి దర్శకుడు సంపత్ నంది చాలామంది తలలను బలి తీసుకున్నారు. శర్వానంద్ హీరోగా కెకె రాధామోహన్ నిర్మించి 'భోగి' సినిమా శుక్రవారం విడుదలైంది. విడుదలకు ముందు దర్శకుడు చెప్పినట్టు ఇది 'భోగి' పండగ సినిమా కాదు... 'బలి'కి సంబంధించిన చిత్రం!
ఇంతకూ కథేమిటంటే... అది 1960 నాటి కాలం. మహారాష్ట్ర - ఆదిలాబాద్ సరిహద్దులోని అటవీ గ్రామం. అక్కడ పటేల్ (శరత్ లోహితాస్య) దే రాజ్యం, ఆయనే దేవుడు, ఆయన చెప్పిందే వేదం. పటేల్ పక్కన ఉండే పూజారి (అవినాశ్) ఊరికి ఏ ఉపద్రవం జరిగినా... దానికి పరిష్కారం చెబుతుంటాడు. గ్రామంలోని పోలీస్ అధికారి (రోహిత్ పాఠక్) సైతం పటేల్ మోచేతి నీళ్ళే తాగుతుంటాడు. ఒకసారి దగ్గరలోని ఆనకట్ట తెగిపోయి బొగ్గులగుట్ట గ్రామం బొందలగడ్డగా మారిపోతుంది. పూజారి చెప్పిన పరిష్కారంతో గండం గట్టెక్కుతుంది. అదే గండం మరోసారి అనారోగ్యం రూపంలో గ్రామంలోకి ప్రవేశిస్తుంది. ఈ సారి అదే పూజకు సిద్థమౌతారు. ఇంతకూ ఆ పరిష్కారం ఏమంటే... అమాయకమైన గిరిజన ఆడబిడ్డలు బలి ఇవ్వడం. అప్పటికే దాదాపు వంద మందికి పైగా పిల్లలను బలి ఇస్తారు. ఈసారి బలి జరిగేప్పుడు అదే ఊరిలో ఉండే గంగ (శర్వానంద్)కు ఈ విషయం తెలుస్తుంది. నరబలిని నిరశిస్తూ... అతను పటేల్‌కు ఎదురు తిరుగుతాడు. ఆ తిరుగుబాటును తట్టుకోలేని పటేల్... గంగ మీద కక్ష కడతాడు. గ్రామం ప్రజల అండతో గంగ చెల్లెళ్ళను బలి ఇచ్చి... అతన్ని ఒంటరి చేస్తాడు. చనిపోయాడనుకున్న గంగ బతికి, తన చెల్లెళ్ళను, అమాయక గిరిజన ఆడబిడ్డలను హతమార్చిన పటేల్ కు ఎలాంటి బుద్ధి చెప్పాడు? అసలు పటేల్ అలాంటి దారుణమైన నిర్ణయం తీసుకోవడం వెనక పూజరి హస్తం ఏమిటీ? ఏ ప్రయోజనాలు ఆశించి... వారు ఆ పనిచేశారు? అనేది ఈ సినిమా కథ.
గతంలో, ఆ మాటకు వస్తే ఇప్పుటికీ కొన్ని అటవీ ప్రాంతాలలో, మారుమూల గ్రామాలలో నరబలి అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడూ అలాంటి వార్తలను పత్రికల్లో చూసి జనం ఉలిక్కి పడుతుంటారు. ఇది 1960 నాటి కథ కాబట్టి ఆ సమయంలో మరింతగా ఈ అనాగరికచర్య ఉండి ఉండొచ్చు. అలాంటి నరబలిని వ్యతిరేకించిన ఓ యువకుడు తన కుటుంబాన్ని ఎలా కోల్పోవలసి వచ్చిందన్నదే ఈ సినిమాలోని ప్రధానాంశం. నరబలి ఎంత దారుణమో చెప్పడానికి దర్శకుడు రెండున్నర గంటల పాటు వెండితెరపై రక్తాన్ని ఏరుల్లా ప్రవహింపచేశాడు. పదుల సంఖ్యలో తలకాయలను లేపేశాడు. మానవ శరీరాలను నిలువుగా, అడ్డంగా నరికేశాడు. ఇదంతా చూసిన తర్వాత నరబలి కంటే దారుణానికి ఈ దర్శకుడు ఒడిగడుతున్నాడేమిటీ!? అనే భావన థియేటర్లలోని ప్రేక్షకులకు కలుగుతుంది.
సున్నితమైన అంశాన్ని తెర మీద చూపించి, ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పు తీసుకు రావాలనుకున్న దర్శకుడు అంతే సున్నితంగా దానిని చూపించి ఉంటే... అతని ఆశయానికి ఓ ప్రయోజనం చేకూరి ఉండేది. అహింస ఎంత గొప్పదో చెప్పడం కోసం దారుణమైన హింసకు పాల్పడిన చందంగా 'భోగి' సినిమా రూపుదిద్దుకుంది. దాదాపు ఆరేడు దశాబ్దాల నాటి కథను ఇప్పుడు ఈ కాలంలో ఇంత భయంకరంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటికీ అలాంటి సంఘటనలు కొన్ని జరుగుతున్నా... దానిని సున్నితంగా, హృదయాన్ని కదిలించేలా చెబితే బాగుండేది. కానీ రా అండ్ రస్టిగ్ గానే తాను రాసుకున్న కథను చెప్పాలని దర్శకుడు సంపత్ నంది ఫిక్స్ అయిపోయాడు. దాంతో అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్, హీరో ప్రేమాయణం, మందారం చేసే త్యాగం ఇవన్నీ తేలిపోయాయి. చివరకు ఈ ఊచకోతకు ముగింపు ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూసేలా చేసింది.
నటీనటుల విషయానికి వస్తే... గత కొంతకాలంగా శర్వానంద్ మాస్ హీరో ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడు. ఆ దృష్టిలో చేసిన అతని సినిమాలు ఇంతవరకూ ఏవీ విజయాన్ని అందుకోలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా 'భోగి'తో మరో ప్రయత్నం అయితే చేశాడు. నటుడిగా అతనికి మంచి మార్కులే పడ్డా... వృధాప్రయాసే అయ్యింది. అనుపమా పరమేశ్వరన్ తన వరకూ తన పాత్రను బాగానే చేసింది. కానీ వారి ప్రేమను హృదయానికి హత్తుకునేలా చూపలేకపోయారు. హీరో లేదా హీరోయిన్ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చి వారిని ఒడ్డున పడేసే పడుపు వృత్తిచేసే మందారం పాత్ర ఈ సినిమాలో హైలైట్. డింపుల్ హయతీ ఈ పాత్రకు నప్పింది. ఆమె చెప్పే కొన్ని డైలాగ్స్ థియేటర్ లో క్లాప్స్ కొట్టిస్తాయి. ఇతర ప్రధాన పాత్రలను లాల్, శరత్ లోహితాస్య, అవినాశ్, రోహిత్ పాఠక్, సీవీఎల్ నరసింహారావు, కంచరపాలెం కిశోర్, శివకుమార్, కోట జయరాం, ఆడుకాలం నరేన్ తదితరులు చేశారు. అయితే ఈ పాత్రలేవీ పెద్దంత ప్రభావం చూపించేవి కాదు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ఈ సినిమాకు ప్రధాన ఎసెట్ సంభాషణలు. సంపత్ నంది రాసిన మాటలు బాగున్నాయి. భీమ్స్ సినిరోలియో ట్యూన్స్ బాగున్నాయి. చంద్రబోస్ సాహిత్యం హృదయానికి హత్తుకునేలా ఉంది. అయితే నేపథ్య సంగీతం తమన్ ను గుర్తు చేసేలా ఉంది. కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిడివిని కంట్రోల్ చేసే క్రమంలో కొన్ని సన్నివేశాలకు బాగానే వేటుపడిందనేది అర్థమౌతోంది. పోరాట సన్నివేశాలలో గ్రేస్ కంటే... హింసే ఎక్కువ ఉంది. ఈ మధ్యకాలంలో వచ్చిన హింసాత్మక చిత్రాల జాబితాలో 'బలి'... సారీ 'భోగీ' కూడా సందేహం లేకుండా చేరిపోతుంది.
ట్యాగ్ లైన్: భోగి కాదు బలి!
రేటింగ్: 2/5