Shah Rukh : అండగా ఉంటానని షారూఖ్‌కు మాటిచ్చా
ABN , First Publish Date - 2023-01-23T03:53:48+05:30 IST
త్వరలో విడుదలవనున్న ‘పఠాన్’ చిత్ర ప్రదర్శనకు వ్యతిరేకంగా అసోంలో జరుగుతున్న ఆందోళనలపై షారూఖ్ ఖాన్ ఫోన్లో తనతో మాట్లాడారని...
అసోం సీఎం హిమంత బిశ్వశర్మ
త్వరలో విడుదలవనున్న ‘పఠాన్’ చిత్ర ప్రదర్శనకు వ్యతిరేకంగా అసోంలో జరుగుతున్న ఆందోళనలపై షారూఖ్ ఖాన్ ఫోన్లో తనతో మాట్లాడారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. శాంతి భద్రతల రక్షణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, ఇప్పటికే కేసు నమోదు చేశాం, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని షారూఖ్‌కు హమీ ఇచ్చినట్లు ఆదివారం ట్విట్టర్లో తెలిపారు. ‘శనివారం అర్థరాత్రి దాటాక షారూఖ్ ఖాన్ ఫోన్ చేశారు. ‘పఠాన్’ చిత్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన లను నా దృష్టికి తెచ్చారు’ అని పేర్కొన్నారు. అయితే అంతకు ముందు జరిగిన మీడియా సమావేశంలో షారూఖ్ ఖాన్ ఎవరో తనకు తెలియదని హిమంత బిశ్వ శర్మ అన్నారు.
మీడియా ప్రతినిథుల ప్రశ్నలకు బదులిస్తూ ‘‘షారూఖ్ ఖాన్ ఎవరు? ఆయన గురించీ, ‘పఠాన్’ సినిమా గురించి నాకు తెలియదు. రాష్ట్ర ప్రజలు అస్సామీ చిత్రాలను గురించి మాత్రమే ఆలోచించాలి, బాలీవుడ్ గురించి మనకెందుకు’’ అని స్పందించారు. షారూఖ్ ఖాన్ బాలీవుడ్ సూపర్‌స్టార్ అని విలేకరులు చెప్పగా, ‘బాలీవుడ్ నుంచి నాకు చాలామంది ఫోన్ చేస్తారు. కానీ షారూఖ్ ఖాన్ నన్ను సంప్రదించలేదు. నాకు ఫోన్ చేస్తే అప్పుడు ఆ సమస్య గురించి ఆలోచిస్తాను’ అన్నారు. ఇది జరిగిన మరుసటి రోజే షారూఖ్ స్వయంగా సీఎంకు ఫోన్‌చేశారు.
షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం ఈ నెల 25న దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రంలోని ఓ పాటలో కథానాయిక దీపికా పదుకొనే కాషాయరంగు బికినీ ధరించి అర్ధనగ్న ప్రదర్శనకు దిగడం వివాదాస్పదమైంది. దీనిపై విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ సహా పలు హిందూ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. ‘పఠాన్’ సినిమాను నిషేధించాలనీ, థియేటర్లలో ఆడనివ్వబోమని హెచ్చరించాయి. గువహటిలో ‘పఠాన్’ సినిమాను ప్రదర్శించే థియేటర్ వద్ద శనివారం పలు హిందూ సంఘాల కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆ చిత్రం పోస్టర్లను తగులబెట్టారు.
చరణ్ తీసుకెళ్తే వస్తాను
ఈ సినిమా విడుదల సందర్భంగా షారూఖ్ ఖాన్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ‘‘పఠాన్’ సినిమా విడుదలైన రోజు మీరు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా థియేటర్‌కి వస్తారా?’ అని ఓ అభిమాని షారూఖ్‌ని అడిగారు. రామ్‌చరణ్ తీసుకెళ్తే తప్పకుండా వస్తాను అని ఆయన బదులిచ్చారు. దీనిపై చరణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.