Mahesh Babu: గేమింగ్ రంగంలోకి మహేశ్ బాబు.. షార్ట్ గన్ గేమ్స్‌లో పెట్టుబడి!

ABN , Publish Date - Nov 03 , 2026 | 08:40 AM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గేమింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ముంబైకి చెందిన షార్ట్ గన్ గేమ్స్‌లో వ్యూహాత్మక పెట్టుబడిదారుగా చేరారు.

mahesh babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన.. తాజాగా గేమింగ్ రంగంలోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. ముంబైకి చెందిన ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ షార్ట్ గన్ గేమ్స్‌లో వ్యూహాత్మక పెట్టుబడిదారుగా చేరారు. దీంతో మహేశ్ బాబు వ్యాపార ప్రయాణంలో మరో ఆసక్తికరమైన అధ్యాయం మొదలైంది.

ఈ భాగస్వామ్యంలో భాగంగా షార్ట్ గన్ గేమ్స్ 'టేక్‌డౌన్: జెనెసిస్' (Takedown: Genesis) పేరుతో ఓ యాక్షన్ అడ్వెంచర్ గేమ్‌ను అభివృద్ధి చేయనుంది. ఈ గేమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, విడుదల తేదీ వంటి అంశాలు ఇంకా వెల్లడించలేదు. అలాగే మహేశ్ బాబు ఈ సంస్థలో ఎంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారనే విషయాన్ని కూడా సంస్థ అధికారికంగా ప్రకటించలేదు.

సినిమాలతో పాటు ఇతర వ్యాపార రంగాలపై ఆసక్తి చూపిస్తున్న మహేశ్ బాబు.. ఇప్పుడు గేమింగ్ పరిశ్రమలోకి రావడం ఆసక్తికరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న గేమింగ్ మార్కెట్‌లో ఈ భాగస్వామ్యం ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి. ముఖ్యంగా 'టేక్‌డౌన్: జెనెసిస్' గేమ్‌కు మహేశ్ బాబు భాగస్వామ్యం ఎంతవరకు గుర్తింపును తీసుకొస్తుందనేది ఆసక్తిగా మారింది.

Updated Date - Nov 03 , 2026 | 09:09 AM