అండర్‌వరల్డ్ డాన్ సల్మాన్.. అండర్‌కవర్ కాప్ నయన్.. ‘మాన్‌స్టర్’ కథ ఇదేనా?
ABN , Publish Date - Nov 20 , 2026 | 10:06 AM
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘మాన్‌స్టర్’. ఈ మూవీ కథకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan), లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘మాన్‌స్టర్’ (Monster). టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన కథాంశం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో, ఇందులో సల్మాన్, నయనతార పోషిస్తున్న పాత్రలు ఇవేనంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ రెండు భిన్న కోణాలున్న అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. సల్మాన్ ఇందులో బయటి ప్రపంచానికి, తన కుటుంబానికి ఒక బాధ్యతాయుతమైన భర్తగా, ప్రేమగల తండ్రిగా కనిపిస్తూనే.. మరోవైపు ఎవరికీ అంతుచిక్కని ఒక మిస్టీరియస్ అండర్‌వరల్డ్ డాన్‌గా నటించనున్నారట. ఈ డాన్ అసలు రూపం ఎలా ఉంటుందో ఇంతవరకు ఎవరూ చూడలేదని, కేవలం అతని పేరు మాత్రమే ప్రజలకు, ప్రభుత్వానికి తెలుసని సమాచారం.
ఇక ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. సల్మాన్ ఖాన్ భార్యగా నటిస్తున్న నయనతార, ఇందులో ఒక పవర్‌ఫుల్ అండర్‌కవర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఆ అంతుచిక్కని అండర్‌వరల్డ్ డాన్‌ను పట్టుకుని, అతని సామ్రాజ్యాన్ని కూల్చే బాధ్యతను అండర్‌కవర్ కాప్ అయిన నయనతారకు అప్పగిస్తారట. తన కళ్లముందే ప్రేమగల భర్తగా ఉంటున్న వ్యక్తే, తాను వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అని తెలిసినప్పుడు జరిగే మైండ్ గేమ్, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్. ఈ సన్నివేశాలను దర్శకుడు వంశీ పైడిపల్లి అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లుగా టాక్ లీకైంది.
భార్యభర్తల మధ్య సాగే ఈ ఉత్కంఠభరితమైన ‘క్యాట్ అండ్ మౌస్’ డ్రామా తెరపై అద్భుతమైన వినోదాన్ని పంచడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ స్వాగ్, నయనతార ఇంటెన్స్ యాక్షన్ తోడైతే బాక్సాఫీస్ వద్ద ‘మాన్‌స్టర్’ సృష్టించే ప్రభంజనం మామూలుగా ఉండదని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి.. కథ ఇదేనో లేదంటే వంశీ ఇంకా ఏమైనా వెరైటీగా ప్లాన్ చేశారో..
ఇవి కూడా చదవండి:
RAPO23: ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్ ప్రీ-లుక్.. అర్థమేంటో తెలుసా?
‘వృషకర్మ’ నుంచి ‘ఛలో పదవే’ సాంగ్.. మెలోడీ అదిరింది
‘సలార్-2’ కంటే ముందే ‘డ్రాగన్-2’.. నీల్ ప్లాన్ ఇదేనా?