‘మాతృభూమి’ కోసం సల్మాన్, చిత్రాంగద హైదరాబాద్‌లో సందడి
ABN , Publish Date - Nov 20 , 2026 | 07:54 PM
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, అందాల నటి చిత్రాంగద సింగ్ జంటగా నటించిన ప్రతిష్టాత్మక వార్-డ్రామా చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం లీడ్ పెయిర్ హైదరాబాద్‌లో సందడి చేశారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan), అందాల నటి చిత్రాంగద సింగ్ (Chitrangda Singh) జంటగా నటించిన ప్రతిష్టాత్మక వార్-డ్రామా చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ (Maatrubhumi: May War Rest in Peace). సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా, ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కు బాక్సాఫీస్ రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ లభించింది. కేవలం 9 రోజుల్లోనే ఈ ట్రైలర్ ఏకంగా 9 కోట్ల (90 మిలియన్లు) వ్యూస్ రాబట్టి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ భారీ విజయాన్ని తెలుగు ప్రేక్షకులు, మీడియాతో పంచుకోవడానికి, అలాగే ప్రమోషన్లను మరింత వేగవంతం చేయడానికి సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో సందడి చేశారు.
ఈ సమావేశంలో సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ మీడియాతో ఎంతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తమ పాత్రల స్వభావం, ఒక వాస్తవ యుద్ధ నేపథ్య కథకు ప్రాణం పోయడానికి తాము పడిన శారీరక, మానసిక శ్రమ గురించి వారు తెలియజేశారు. షూటింగ్ సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఎదుర్కొన్న కఠినమైన సవాళ్లను గుర్తు చేసుకుంటూ, ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన ఆదరణ తమ కష్టాన్ని మరిపించిందని సంతోషం వ్యక్తం చేశారు. 9 రోజుల్లోనే 9 కోట్ల మంది ట్రైలర్‌ను చూడటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే, ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన సినిమా సౌండ్‌ట్రాక్ గురించి కూడా వారు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని సల్మాన్ ఖాన్ ఈ వేదికపై మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇక్కడి ప్రేక్షకులకు సినిమాల పట్ల ఉన్న పిచ్చి, తన చిత్రాలను హైదరాబాద్ అభిమానులు ఒక పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకునే విధానం తనకెంతో ఇష్టమని ఆయన పేర్కొన్నారు. సల్మాన్, చిత్రాంగద తమ సరదా సంభాషణలతో ఈ సమావేశం ఎంతో సందడిగా మార్చారు. ట్రైలర్, పాటలకు దక్కిన భారీ క్రేజ్‌తో రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతుండటంతో, ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ అనుభవాలలో ఒకటిగా నిలుస్తుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
రజనీకాంత్‌తో ధనుష్ కొడుకు.. ఆ స్టైల్ ఎక్కడికి పోతుంది?
అండర్‌వరల్డ్ డాన్ సల్మాన్.. అండర్‌కవర్ కాప్ నయన్.. ‘మాన్‌స్టర్’ కథ ఇదేనా?
RAPO23: ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్ ప్రీ-లుక్.. అర్థమేంటో తెలుసా?