రణవీర్ సింగ్‌పై ఫెడరేషన్ ఆగ్రహం... మూడేళ్ళ నిషేధం...
ABN, Publish Date - May 26 , 2026 | 01:16 PM
రణవీర్ సింగ్ పై సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ విధించిన నిషేధాంశం చినికి చినికి గాలివానగా మారబోతోంది. ఈ వ్యవహారం ఫెడరేషన్ పరిధిలోకి రాదని రణవీర్ భావిస్తుండగా, దర్శక నిర్మాతలు రూ. 45 కోట్ల నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసులు జారీ చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌కు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. 'ధురంధర్' రెండు భాగాలు ఒకదానిని మించి మరొకటి విజయం సాధించడంతో ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఆ విజయాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించకుండా... నిషేధం పేరుతో ఏర్పడిన కొత్త చిక్కులు రణవీర్ సింగ్‌ను చికాకు పెడుతున్నాయి. ఫర్హాన్ అక్తర్ తాను రూపొందించాలని భావించిన 'డాన్ 3'లో హీరోగా రణవీర్ సింగ్‌ను 2023లో ఎంపిక చేశాడు. ఆ సందర్భంగా ఓ ప్రోమోను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల్లో మొదలు కానుండగా ఆ ప్రాజెక్ట్ నుంచి రణవీర్ సింగ్ వైదొలగుతున్నట్టు ప్రకటించాడు.
ఫర్హాన్ అక్తర్ క్రియేట్ చేసిన డాన్ పాత్ర రణవీర్ సింగ్‌ను పూర్తి స్థాయిలో మెప్పించకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. రణవీర్ చెప్పిన మార్పులు, చేర్పులు చేయడానికి ఫర్హాన్ అక్తర్ అంగీకరించలేదని అంటున్నారు. రణవీర్ సింగ్ యూ టర్న్ తీసుకోవడంపై ఆగ్రహించిన చిత్ర నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్స్ రరూ. 45 కోట్లకు నష్టపరిహారం కోరుతూ అతనికి లీగల్ నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌ను చల్లబర్చడానికి రణవీర్ సింగ్ తన తదుపరి చిత్రం 'ప్రళయ్'లో ఫర్హాన్ అక్తర్‌కు పది కోట్ల విలువ చేసే వాటాను ఆఫర్ చేశాడని అంటున్నారు. దీనిని దర్శకుడు ఫర్హాన్ తిరస్కరించాడట.
దాంతో ఫర్హాన్, నిర్మాణ భాగస్వామి రితేష్ సిధ్వానీ ఇద్దరూ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (ఎఫ్.డబ్ల్యు.ఐ.సీ.ఈ.) లో రణవీర్ సింగ్‌పై ఫిర్యాదు చేశారు. షూటింగ్‌కు సరిగ్గా మూడు వారాల ముందు రణవీర్ సింగ్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో తమకు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అందులో పేర్కొన్నారు. దీన్ని టేకప్ చేసిన ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు బి.ఎన్. తివారి, అశోక్ దుబే 'డాన్ 3' దర్శక నిర్మాతల వర్షన్ విన్న తర్వాత రణవీర్ సింగ్‌ను సైతం ఈ సమస్య పరష్కారం కోసం రమ్మని కోరారు. అయితే ఈ వ్యవహారంతో ఫెడరేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల తాను విచారణకు హాజరు కానని రణవీర్ చెప్పినట్టు... ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సోమవారం మీడియాకు తెలిపారు. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా... చట్టాన్ని గౌరవించాల్సిందేనని, తమ యూనియన్ చట్ట బద్ధంగా సాగుతుందని, నిర్మాతలకు నష్టాన్ని కలిగించే ఏ విషయాన్ని తాము వదిలి పెట్టమని ఆయన అన్నారు. అంతేకాదు... తమ అస్తిత్వాన్నే ప్రశ్నించిన రణవీర్ సింగ్ పై మూడు సంవత్సరాల నిషేధాన్ని విధించారు. తమ కార్మికులు ఎవరూ ఆయనతో కలిసి పనిచేయరని తెలిపారు. రణవీర్ సింగ్ తప్పు తెలుసుకుని, తమను కలిసి పరిష్కారానికి అంగీకరించే వరకూ తాము ఈ విషయంలో రాజీ పడమని స్పష్టం చేశారు.
రణవీర్ సింగ్ బృందం స్పందన
'డాన్ 3' ప్రాజెక్ట్ నుంచి వైదొలగడం, తదనంతర పరిణామాలపై రణవీర్ సింగ్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడు. అయితే సోమవారం అతనిపై ఫెడరేషన్ మూడేళ్ళ నిషేధం విధించిన తర్వాత ఆయన టీమ్ దీనిపై స్పందించింది. ఈ వ్యవహారం ఎఫ్.డబ్ల్యు.ఐ.సీ.ఈ. పరిధిలోకి రాదని, రణవీర్ సింగ్‌ను విచారణకు హాజరు కావాలని కోరే అధికారం వారికి లేదని, అందుకే వారిని కలవాలని ఆయన అనుకోలేదని తెలిపింది. సినిమా రంగం పట్ల, 'డాన్ 3' దర్శక నిర్మాతల పట్ల రణవీర్ సింగ్‌కు అపరిమితమైన గౌరవం ఉందని, ఈ వ్యవహారం మరింత పెద్దది కాకుండా ఉండటం కోసమే ఆయన ఉద్దేశ్యపూర్వకంగా మౌనంగా ఉన్నారని చెప్పింది. వృత్తిపరమైన చర్చలు.. పరస్పర సహకారం, అవగాహనతో జరగాలని రణవీర్ సింగ్ నమ్ముతాడని, ఈ విషయమైన మీడియాలో వచ్చే కథనాలు, ఊహాగానాలపై ఆయన వివరణ ఇవ్వదల్చుకోలేదని టీమ్ తెలిపింది. మరి ఈ వ్యవహారానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
ముగిసిన సమావేశం.. ఎగ్జిబిటర్స్ సమస్యలు విని చిరంజీవి ఆశ్చర్యం!
10 కోట్ల బడ్జెట్.. 1000 కోట్ల కలెక్షన్స్?.. ఇది కదా సక్సెస్ అంటే?