‘రామాయణ’ నిర్మాత ఆఫీసుల్లో ఐటీ దాడులు.. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం
ABN, Publish Date - Oct 08 , 2026 | 06:29 PM
భారతీయ చిత్ర పరిశ్రమలోనే కనీవినీ ఎరుగని బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న విజువల్ వండర్ ‘రామాయణ’. ఇప్పుడీ సినిమా నిర్మాత ఆఫీసులపై ఐటీ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది.
భారతీయ చిత్ర పరిశ్రమలోనే కనీవినీ ఎరుగని బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న విజువల్ వండర్ ‘రామాయణ’ (Ramayana). నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, రాకింగ్ స్టార్ యశ్, సన్నీ డియోల్ లాంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం చుట్టూ ఇప్పుడు అనూహ్యమైన ఉత్కంఠ నెలకొంది. అయితే ఈసారి చర్చ సినిమా బజ్ గురించో, టీజర్ గురించో కాదు.. ఏకంగా ఈ చిత్ర నిర్మాత కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల గురించి!
‘రామాయణ’ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్’ (Prime Focus) ముంబై ప్రధాన కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. సంస్థకు సంబంధించిన పలు కీలక కార్యాలయాల్లో అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఈ దాడులకు గల ప్రధాన కారణాలపై అందుతున్న సమాచారం ప్రకారం.. కంపెనీకి సంబంధించిన కొన్ని విదేశీ ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ‘రామాయణ’ ప్రాజెక్ట్ కోసం వివిధ విదేశీ సంస్థల ద్వారా భారీ ఎత్తున నిధులు సమకూరాయని, వందల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు ఈ సినిమా నిర్మాణం కోసం దేశంలోకి వచ్చాయనే అంశంపై విచారణ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. సినిమా ప్రారంభమైనప్పటి నుంచే ప్రమోషన్లు, ప్రొడక్షన్ కోసం నిర్మాతలు అసాధారణమైన రీతిలో ఖర్చు చేస్తుండటంతో ఈ లావాదేవీలపై నిఘా పడినట్లు తెలుస్తోంది.
ఐటీ దాడుల వార్త బయటకు రావడమే ఆలస్యం.. స్టాక్ మార్కెట్‌లో ప్రైమ్ ఫోకస్ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం పడింది. ట్రేడింగ్‌లో కంపెనీ షేర్ల విలువ దాదాపు 8 శాతం మేర పడిపోయి ఇన్వెస్టర్లలో కలకలం రేపింది. దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా వస్తున్న ‘రామాయణ’ నిర్మాణంలో ఉండగానే సరిగ్గా ఇలాంటి సమయంలో ఐటీ సోదాలు జరగడం దేశవ్యాప్తంగా సినీ, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ తనిఖీలకు సంబంధించి అటు ఆదాయపు పన్ను శాఖ నుంచి గానీ, ఇటు ప్రైమ్ ఫోకస్ యాజమాన్యం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులకు దారితీస్తుందో అనేలా ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఆ డైరెక్టర్‌కు నో చెప్పిన రామ్ చరణ్.. కారణం అదేనా?
నమ్మలేకపోతున్నాం.. నానా పటేకర్ మృతిపై సెలబ్రిటీలు
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’.. తమిళ సినిమాగా ప్రచారం అందుకేనా?