Ramayan: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వినూత్న పాత్ర!

ABN , Publish Date - May 12 , 2026 | 10:07 AM

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో అత్యంత కీలకమైన శూర్పణఖ పాత్రను రకుల్ ప్రీత్ సింగ్‌ పోషిస్తోంది. ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది.

Rakul Preet Singh

రామాయణగాథలో అత్యంత కీలకమైన పాత్రను రకుల్ ప్రీత్‌ ఇప్పుడు పోషిస్తోంది. భారతీయ ఇతిహాసాలలో ఎంతో ప్రముఖమైనది రామాయణం. దానిని రెండు భాగాల సినిమాగా నితీశ్‌ తివారి తెరకెక్కిస్తున్నారు. రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యశ్‌ రావణాసుడిగా నటిస్తున్న ఈ సినిమా మొదటి భాగం ఇదే యేడాది దీపావళికి విడుదల కానుంది. దాంతో శరవేగంగా షూటింగ్‌ను జరుపుతున్నారు. చిత్ర బృందం తెలిపిన వివరాల ప్రకారం ఇందులో శూర్పణఖ పాత్రను ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పోషిస్తోందట. ఆమెకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం కొంతకాలం క్రితం పలువురితో టెస్ట్ షూట్‌ చేసిన నితీశ్‌ తివారి చివరకు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఈ పాత్రకు ఎంపిక చేశారని చెబుతున్నారు.


ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 'యానిమల్‌' తర్వాత రణబీర్ కపూర్‌ నటిస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టీ ఈ సినిమాపై ఉంది. పైగా రామాయణగాథను ప్రభాస్ హీరోగా 'ఆదిపురుష్‌' పేరుతో తెరకెక్కించగా, అది ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోగా విమర్శలు కొనితెచ్చుకుంది. ఈ నేపథ్యంలో జన్ జీ మెచ్చేలా నితీశ్‌ తివారీ 'రామాయణ్‌'ను ఎలా తీస్తారనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 'రామాయణ్‌'లో సన్నీడియోల్‌ హనుమాన్‌గా నటిస్తుండగా, లారా దత్తా కైకేయిగా, ఇందిరా కృష్ణన్ కౌశల్యగా, కాజల్‌ అగర్వాల్ మండోదరిగా నటిస్తున్నారు.

Updated Date - May 12 , 2026 | 10:08 AM