‘చుట్టమల్లే’ మార్ఫింగ్ వీడియోపై జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
ABN, Publish Date - Oct 04 , 2026 | 08:38 PM
‘దేవర’ చిత్రంలోని చార్ట్‌బస్టర్ సాంగ్ ‘చుట్టమల్లే’లో హీరోయిన్ జాన్వీ కపూర్ విజువల్స్‌ను కొందరు ఏఐ టెక్నాలజీతో అత్యంత అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. ఈ వికృత చేష్టలపై జాన్వీ కపూర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
ఏఐ టెక్నాలజీ కొందరి వికృత చేష్టల వల్ల మహిళల ఆత్మగౌరవానికి పెను ముప్పుగా మారుతోంది. తాజాగా ‘దేవర’ (Devara) చిత్రంలోని చార్ట్‌బస్టర్ సాంగ్ ‘చుట్టమల్లే’ (Chuttamalle)లో హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) విజువల్స్‌ను కొందరు ఏఐ టెక్నాలజీతో అత్యంత అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. ఈ వికృత చేష్టలపై జాన్వీ కపూర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మహిళల ప్రైవసీ, డిజిటల్ భద్రత, సమాజంలో నెలకొన్న దారుణమైన ధోరణులపై తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ అవుతూ ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో..
‘‘మహిళలను కేవలం భోగవస్తువులుగా చూపిస్తూ, వారి అనుమతి లేకుండా ఇలాంటి కాల్పనిక, అసభ్యకరమైన కంటెంట్‌ను ఏఐతో సృష్టించి వ్యాప్తి చేయడం తీవ్రమైన నేరం. ఇది దాదాపు ఒక మహిళపై జరిగే లైంగిక దాడితో సమానం. ఈ ఇండస్ట్రీలోని దాదాపు ప్రతి మహిళ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంది. ప్రతిచోటా మహిళలు ఇలాంటి వేధింపులకు గురవుతున్నారు. ఒక మహిళ శరీరానికి ఇచ్చే గౌరవం, ఆమె ఎంపిక, ఆమె అనుమతి అనేవి మానవత్వంలో అతి మౌళికమైన విషయాలు. కానీ వాటిని కూడా సమాజం ఇంకా అర్థం చేసుకోలేని సంక్లిష్టమైన విషయాలుగా చూడటం అత్యంత విచారకరం.
ఒక మహిళ వరుసగా ఐదు రోజులు ‘సరే’ అని చెప్పి, ఆరో రోజు ‘నో’ అని చెప్పినా.. ఆ తిరస్కారాన్ని గౌరవించాలనే ప్రాథమిక స్పృహ కొందరికి ఇంకా అర్థం కాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఒక మహిళ పొట్టి దుస్తులు ధరించినంత మాత్రాన.. ఆమెను అసభ్యకరమైన కోణాల్లో చిత్రీకరించడానికో, ఆమె శరీరాన్ని లైంగిక వస్తువుగా మార్చడానికో ఎవరికీ అనుమతి దక్కదు. ఆమె దేనితో సౌకర్యంగా ఉంది? ఆమె గీసుకునే హద్దులేంటి? తన శరీరంపై ఎవరికి ఎంతవరకు అనుమతి ఉంది? అనే నిర్ణయం కేవలం ఆ మహిళ వ్యక్తిగత హక్కు మాత్రమే.
భారతీయ సమాజంలో ఒక మహిళగా జీవించడం వెనుక ఉన్న భయం, చూసే చూపులు, వేసే జడ్జిమెంట్లు, భద్రత కోసం నిత్యం పడే తాపత్రయం ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి కూడా విస్తరించాయి. సమాజంలో నిజమైన భౌతిక భయాలనే మనం ఇంకా పరిష్కరించలేకపోతున్నాం. ఇలాంటి సమస్యలకు ‘మీ ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి’ అనేది పరిష్కారం కాజాలదు. ఎదుటి వ్యక్తి వ్యక్తిగత హద్దులను ఉల్లంఘించే అధికారం తమకు ఉందనుకునే వికృత ఆలోచనా విధానాన్ని మొదట తుంగలో తొక్కాలి. ఏది తప్పో, ఏది ఒప్పో ధైర్యంగా నిలదీసే నైతిక విలువలున్న మగాళ్లు ముందుకు వచ్చినప్పుడే ఈ మార్పు సాధ్యమవుతుంది.
ఈ అన్యాయంపై ఎంతో బలంగా గళమెత్తి, ఖండించినందుకు ఎన్టీఆర్ (NTR) సార్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కోట్లాది మంది ఆరాధించే మీలాంటి స్టార్.. నేరుగా తనతో సంబంధం లేని ఒక మహిళా సమస్యపై ఇంత గట్టిగా మాట్లాడటం వల్ల, ఇలాంటి వేధింపులను ఎదుర్కొంటున్న ప్రతి మహిళకు ఎంతో ధైర్యం లభిస్తుంది. అలాగే ఈ అనైతిక చర్యలను, ఈ వికృత మనస్తత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ స్పందించిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సార్‌కు, విజయ్ (Vijay) గారికి, ఖుష్బూ (Kushboo) మేడమ్‌కు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఘటనలైనా మహిళలను వేధించే వారిలో కాస్తంత ఆత్మపరిశీలన కలిగిస్తుందని ఆశిస్తున్నాను. ఒక మహిళ తనను ఒక మనిషిగా గుర్తించమని, ఒక మనిషిలా గౌరవించమని అడగడం అత్యాశ అవుతుందా? ఆమె శరీరం.. ఆమె గౌరవం.. ఆమె హద్దులు.. ఆమె ఎంపిక!’’ అంటూ జాన్వీ కపూర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం యావత్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సినీ ప్రేమికులు, నెటిజన్లు జాన్వీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ.. టెక్నాలజీ ముసుగులో మహిళల గౌరవానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పాత్రకు జీవం పోసేందుకు.. నటీనటుల్లో తరగని నటనాభిలాష!
బాలయ్య వర్సెస్ చిరంజీవి.. మరో ఆసక్తికర ఫైట్‌కు అంతా సిద్ధం
మోక్షజ్ఞ సినిమాలో ఆ సీనియర్ హీరోయిన్లు?