'జై సంతోషి మాతా' నుంచి 'హనుమాన్ అంశ్' వరకూ!
ABN, Publish Date - Sep 15 , 2026 | 09:59 AM
కేవలం రెండు కోట్ల రూపాయల వ్యయం. రాబడి మాత్రం రెండువందల కోట్లకు పైమాటే ! అంటే వంద రెట్లకుపైగా వసూలు చేసిందన్న మాట. అదే 'హనుమాన్ అంశ్'. ఇప్పుడీ సినిమా తెలుగులోనూ రాబోతోంది.
కేవలం రెండు కోట్ల రూపాయల వ్యయం. రాబడి మాత్రం రెండువందల కోట్లకు పైమాటే ! అంటే వంద రెట్లకుపైగా వసూలు చేసిందన్న మాట. ఇంతటి ఘనవిజయం స్టార్ హీరోస్ కు కూడా అసాధ్యమే. ఓ సాధారణ హిందీ భక్తి చిత్రం ఆ రికార్డ్ ను సాధించింది. అదే 'హనుమాన్ అంశ్'. త్వరలో తెలుగులోనూ రాబోతోందీ చిత్రం. ఆ మూవీ కోసం తెలుగువారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పౌరాణికాలను, భక్తి రస చిత్రాలను తెరకెక్కించడంలో తెలుగువారు మేటి అనిపించుకున్నారు. అయితే హిందీలో డివోషనల్ మూవీస్ ఉత్తరాదిన ఉర్రూతలూగించి, తెలుగులోనూ భళా అనిపించాయి. ఇప్పుడు 'హనుమాన్ అంశ్' కూడా అలా తెలుగువారిని ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ మూవీని ప్రముఖ దర్శకరచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో అనువదిస్తూ ఉండడం విశేషం. దాంతో 'హనుమాన్ అంశ్'పై మరింత ఆసక్తి చోటు చేసుకుంది. సెప్టెంబర్ 18వ తేదీన 'హనుమాన్ అంశ్' తెలుగు పలుకులతో మనవాళ్ళను పలుకరించనుంది. ఈ సినిమా హనుమాన్ భక్తుడైన నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా తెరకెక్కింది. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో 'హనుమాన్ అంశ్' రూపొందింది. విశాల్ చతుర్వేది రాసిన 'డివైన్ డిటార్: దట్ చేంజ్డ్ మై లైఫ్' ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఇందులో నీమ్ కరోలీ బాబా పాత్రలో శోభినవ్ సత్యా నటించారు.
తెలుగులో ఘనవిజయం సాధించిన పలు పౌరాణిక చిత్రాలు హిందీ, బెంగాలీ భాషల్లోకి అనువాదమై అక్కడ కూడా విజయం సాధించాయి. అదే తీరున ఉత్తరాదిలో అనూహ్య విజయం సొంతం చేసుకున్న భక్తిరస చిత్రాలు, పౌరాణికాలు తెలుగులో డబ్బింగ్ రూపాన సక్సెస్ అందుకున్నాయి. యన్టీఆర్ తమిళంలో నటించిన 'సంపూర్ణ రామాయణం' తెలుగు, హిందీలోనూ అనువాద రూపంలో అలరించింది. అయినా 1961లో హిందీలో బాబూబాయ్ మిస్త్రీ తెరకెక్కించిన 'సంపూర్ణ రామాయణం' చిత్రం తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని మూటకట్టుకుంది. 1965 లో ప్రదీప్ కుమార్, దారాసింగ్ నటించిన 'మహాభారత్' కూడా అనువాద రూపంలో ఆకట్టుకుంది. 1975లో అనూహ్య విజయం సాధించిన 'జై సంతోషీ మా' సినిమా తెలుగులో 'జై సంతోషీ మాతా'గా డబ్ అయింది. తెలుగునేలపైనా విశేషాదరణ చూరగొంది. తెలుగువారు సంతోషీ మాతను ఆరాధించడం ఈ సినిమాతో మరింత అధికమయింది. అలాగే ఈ చిత్రంతో "16 శుక్రవారాల మహాత్యం" కూడా తెలుగునేలపై ప్రాచుర్యం పొందింది.
'జై సంతోషీ మాతా' ఘనవిజయంతో అంతకు ముందు తెరకెక్కిన 'హర హర మహాదేవ్' సినిమా తెలుగులో 'సంపూర్ణ శివ పురాణం' పేరుతో అనువాదమై అలరించింది. ఇందులో దారా సింగ్ శివుని పాత్రలో కనిపించారు. తరువాత 'షిర్డీ కే సాయిబాబా' కూడా 'సాయిబాబా'గా తెలుగువారిని పలకరించింది. ఇలా ఉత్తరాదిన ఘనవిజయం సాధించిన కొన్ని భక్తిరస, పౌరాణిక చిత్రాలు తెలుగులో అనువాదమై ఆకట్టుకున్నాయి. వాటి చెంతన సెప్టెంబర్ 18న రాబోయే 'హనుమాన్ అంశ్' కూడా చేరుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. నవతరం సైతం భక్తి చిత్రాలను ఆదరిస్తోందని 'అఖండ' 'ఇరుముడి' వంటి చిత్రాలు నిరూపించాయి. 'హనుమాన్ అంశ్'ను ఉత్తరాదిన ఆదరించారు. తెలుగు యువజనం కూడా 'హనుమాన్ అంశ్'తో ఆనందిస్తారని అంటున్నారు. మరి 'హనుమాన్ అంశ్' తెలుగునాట ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి!
చిన్ని ప్రాణానికి ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. సమంత సీమంతం పోస్ట్ వైరల్
పావలా శ్యామల కూతురికి 'మా' చేదోడు!
36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ ఏందయ్యా ఈ స్పీడ్!