‘సీఐడీ’, ‘ఆహట్‌’ సృష్టికర్త బీపీ సింగ్‌ కన్నుమూత

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:55 PM

‘సీఐడీ’, ‘ఆహట్‌’ వంటి పాపులర్‌ టీవీ షోలను రూపొందించిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు బీపీ సింగ్‌ 77 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు.

BP Singh

ప్రముఖ టెలివిజన్‌ నిర్మాత, దర్శకుడు బృజేంద్ర పాల్‌ సింగ్‌ (బీపీ సింగ్‌) మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (FTII)లో చదువుకున్న బీపీ సింగ్‌ తన కెరీర్‌ను దూరదర్శన్‌లో న్యూస్‌ కెమెరామన్‌గా ప్రారంభించారు. అనంతరం ‘సిర్ఫ్‌ చార్‌ దిన్‌’ అనే తొలి టీవీ చిత్రాన్ని రూపొందించారు. 1988లో దూరదర్శన్‌ కోసం ‘ఏక్‌ శూన్య శూన్య’ అనే టీవీ షోను నిర్మించారు. బీపీ సింగ్‌ 1994లో ‘ఆహట్‌’ సిరీస్‌ను ప్రారంభించారు. తొలుత సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌లో దాదాపు 40 ఎపిసోడ్‌ల వరకు అదే తరహా కథలను చూపించారు. ఆ తర్వాత అతీంద్రియ శక్తులకు సంబంధించిన అంశంతో ఓ ఎపిసోడ్‌ను రూపొందించారు. ఆ ఎపిసోడ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రావడంతో పాటు, టీఆర్పీ గణనీయంగా పెరిగింది. దీంతో ‘ఆహట్‌’ను అదే తరహాలో కొనసాగించారు.


1998లో బీపీ సింగ్‌ ‘సీఐడీ’ సిరీస్‌ను రూపొందించారు. ఇది భారత టెలివిజన్‌ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రసారమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌గా గుర్తింపు పొందింది. బీపీ సింగ్‌ మరణవార్తను ఆయన స్నేహితుడు, చిత్ర నిర్మాత అశోక్‌ పండిట్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. బుధవారం బీపీ సింగ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అశోక్‌ పండిట్‌ తెలిపారు. ‘ఆయన చేసిన పని ఇప్పటికీ, భవిష్యత్తులోనూ ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఐఎఫ్‌టిడీఏ (IFTDА) అధ్యక్షుడిగా ఆయన ఉన్న సమయంలో ఆయనకు అత్యంత సన్నిహిత సహచరుడిగా ఉండటం నా అదృష్టం. గొప్ప మనసున్న వ్యక్తి, ఆప్త మిత్రుడు. వినోద రంగానికి ఆయన అందించిన సేవలతో ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి' అని అశోక్‌ పండిట్‌ తన పోస్టులో పేర్కొన్నారు.


'సీఐడీ'లో దయా పాత్రతో వీక్షకుల మనసు చూరగొన్న దయానంద్‌ శెట్టి... బీపీ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 'బీపీ సింగ్‌ గారికి కంటెంట్‌ రూపొందించడం తప్ప మరో ప్రపంచం లేదు. పనిపట్ల ఎంతో అంకితభావంతో వ్యవహరించేవారు. మన దగ్గర ఉన్న అత్యుత్తమ కెమెరామన్‌లలో ఆయన కూడా ఒకరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం నిద్రలోనే కన్నుమూశారు' అని దయానంద్‌ శెట్టి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

‘ఆదర్శ కుటుంబం’.. టికెట్ ధరలు పెంపు

బాలయ్య 112వ సినిమాకు జీవీ ప్రకాశ్ మ్యూజిక్.. కొరటాల శివ కీలక నిర్ణయం!

హీరో అజిత్‌కు గుడి.. విగ్రహానికి క్షీరాభిషేకం

Updated Date - Oct 27 , 2026 | 06:06 PM