బాలయ్య 112వ సినిమాకు జీవీ ప్రకాశ్ మ్యూజిక్.. కొరటాల శివ కీలక నిర్ణయం!
ABN , Publish Date - Oct 27 , 2026 | 02:51 PM
బాలకృష్ణ 112వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనుండగా, సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. అనిరుధ్ రవిచందర్ బిజీగా ఉండటంతో ఈ మార్పు జరిగినట్లు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి హిందీ సినిమా 'ది జంటిల్ మేన్'కు ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. కింగ్ నాగార్జున తమిళ చిత్రం 'రచ్చగన్'కూ ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఈ రెండు చిత్రాలకంటే ముందు విక్టరీ వెంకటేశ్ 'సూపర్ పోలీస్'కు రెహమాన్ మ్యూజిక్ చేశారు. కానీ ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా అలరించలేదు. ఇదే సమయంలో సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణకు 'నిప్పురవ్వ'కు ఎ. ఆర్. రెహమాన్ నేపథ్య సంగీతం అందించారు. అలానే అదే రోజు జనం ముందుకు వచ్చిన 'బంగారు బుల్లోడు' సినిమాకు రాజ్-కోటి సంగీతం అందించగా, రెహమాన్ అసోసియేట్ గా పనిచేశారు. విశేషం ఏమంటే ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. కానీ ఇంతవరకూ బాలకృష్ణ చిత్రాలకు పూర్తి స్థాయిలో సంగీతాన్ని అందించే అవకాశం మాత్రం ఎ. ఆర్. రెహమాన్ కు దక్కలేదు. అయితే మేనమామకు దక్కని ఆ అదృష్టం మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్కు దక్కబోతోంది.
బాలకృష్ణతో తొలిసారి సినిమా తెరకెక్కిస్తోన్న కొరటాల శివ వైపు టాలీవుడ్ జనం ఇప్పుడు ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య తన 111వ చిత్రం 'దాదా' షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలో తన పార్ట్ పూర్తి కాగానే 112వ చిత్రం కోసం డేట్స్ కేటాయించారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి తొలుత అనిరుధ్ రవిచందర్ ను సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు. ఈ సినిమాకు ముందు కొరటాల శివ తెరకెక్కించిన 'దేవర' చిత్రానికి కూడా అనిరుధ్ బాణీలు కట్టారు. అందువల్లే బాలయ్య సినిమాకు కూడా అనిరుధ్ ను సంగీత దర్శకునిగా భావించారు. అయితే మరో రెండేళ్ళ వరకు అనిరుధ్ డైరీ ఖాళీ లేదట. ఆ విషయాన్ని అనిరుధ్ తెలుపగానే ఇప్పటిదాకా బాలయ్య సినిమాకు పనిచేయని ఎవరైనా కొత్త సంగీత దర్శకుడయితే బాగుంటుందని కొరటాల శివ భావించారు. దాంతో అనిరుధ్ స్థానంలో ఇప్పుడు జీవీ ప్రకాశ్ కుమార్ ను సంగీత దర్శకునిగా ఎంచుకున్నట్టు సమాచారం. జీవీ ప్రకాశ్ కుమార్ ఓ వైపు నటునిగా సాగుతూనే మరోవైపు సంగీత దర్శకునిగా అలరిస్తున్నారు.. ఈ మధ్య కాలంలో తెలుగు చిత్రాలకూ మరపురాని సంగీతం అందించి ఆకట్టుకున్నారు జీవీ ప్రకాశ్ కుమార్. అందువల్ల బాలయ్య కూడా ఓకే చెప్పడంతో జీవీ ప్రకాశ్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా నిర్ణయించినట్టు సమాచారం.
బాలకృష్ణ సినిమా అనగానే ఈ మధ్య కాలంలో తమన్ మ్యూజిక్ తప్పని సరి అనే మాట వినిపిస్తోంది. 'అఖండ' మొదలు 'వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహరాజ్, అఖండ-2 చిత్రాలకు, ప్రస్తుతం తెరకెక్కుతోన్న 'దాదా' సినిమాకు కూడా వరుసగా తమన్ బాణీలతోనే సాగారు బాలయ్య. అయితే వరుసగా బాలయ్య- తమన్ కాంబో కంటే తన సినిమాకు వేరే మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుందని కొరటాల శివ భావించారు. అందుకే తన 'దేవర' చిత్రానికి పనిచేసిన అనిరుధ్ రవిచందర్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు. ఇప్పుడు అనిరుధ్ బిజీ కారణంగా జీవీ ప్రకాశ్ కుమార్ ను అనుకున్నారు. కొరటాల శివ కూడా ఆరంభంలో వరుసగా నాలుగు చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనతోనే సాగారు. ఐదో సినిమా 'ఆచార్య'కు మణిశర్మతోనూ, ఆరో చిత్రం 'దేవర'కు అనిరుధ్ తోనూ పనిచేశారు శివ. ఇప్పుడు ఆయన కూడా తొలిసారి జీవీ ప్రకాశ్ కుమార్ తో కలసి బాలయ్య సినిమా కోసం సాగడానికి నిర్ణయించడం విశేషం.
జీవీ ప్రకాశ్ కుమార్ తమిళనాట హీరోగానూ అలరిస్తున్నారు. అదే సమయంలో తన దరికి చేరిన చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అనిరుధ్ బాణీల్లో రూపొందిన తెలుగు చిత్రాల్లో 'లక్కీ భాస్కర్, విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరుముడి' వంటివి జనాన్ని ఆకట్టుకున్నాయి. జీవీ స్వరకల్పనలో రూపొందిన కొన్ని తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా, వాటిలోని సంగీతం అలరించింది. ఈ నేపథ్యంలో తొలిసారి బాలయ్య, కొరటాల శివతో కలసి పనిచేయనున్న జీవీ ప్రకాశ్ కుమార్ కు లక్కీ ఛాన్స్ దక్కినట్టే. ఈ సినిమాలో బాలయ్య ఇమేజ్ కు తగ్గ బాణీలు కట్టారంటే టాలీవుడ్ టాప్ స్టార్స్ మరికొందరు జీవీ మ్యూజిక్ కోసం పరుగులు తీసే ఛాన్స్ ఉంటుంది. మరి అంది వచ్చిన అవకాశాన్ని జీవీ ఏ తీరున సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
Alias Rukmini: రుక్కు రుక్కు రుక్మిణి.. కిట్టయ్యకి నువ్వే అలివేణి
Scene: సిగరెట్లు తాగితే మగతనం తగ్గిపోతుందిరోయ్..
బాత్రూమ్లో జారి పడి.. పైకి లేవ లేని స్థితిలో ఒంటరిగా షావుకారు జానకి కుమార్తె!