Kangana Ranaut: లేడీ క్వీన్ టు.. జీరో కలెక్షన్స్! కంగనా పరిస్థితి.. ఇలా అయిందేంటి?
ABN, Publish Date - Jun 15 , 2026 | 11:16 AM
ఒకప్పుడు బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్లిన కంగనా రనౌత్, ఇటీవల బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నారు.
ఒకప్పుడు బాలీవుడ్ (Bollywood)ను శాసించిన లేడీ క్వీన్.. 'తను వెడ్స్ మను, క్వీన్' లాంటి సినిమాలతో వంద కోట్ల క్లబ్‌ను అవలీలగా దాటేసిన స్టార్ హీరోయిన్.. కంగనా రనౌత్ (Kangana Ranaut) సినిమా వస్తుందంటే చాలు, థియేటర్లలో కాసుల వర్షం కురవాల్సిందే. ఆమె సినిమా కథలలో దమ్ముంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఉండేది. కానీ.. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటే చర్చ నడుస్తోంది.. కంగనా రనౌత్ సినీ కెరీర్ దాదాపు ముగిసిపోయినట్లేనా? అసలు ఆమెకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అని!
కంగనా రనౌత్ నటన గురించి ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ సినిమాల కన్నా ఆమె చుట్టూ ఉండే వివాదాలే ఎక్కువై పోయాయి. బాలీవుడ్ స్టార్స్ మీద, నెపోటిజం మీద ఆమె వరుసగా ఇచ్చే లెక్చరర్లు, సోషల్ మీడియా వేదికగా చేసే కామెంట్లు ఆమె ఇమేజ్‌ను డ్యామేజ్ చేశాయి. వీటికి తోడు ఆమె ఇప్పుడు బీజేపీ నుంచి పార్లమెంట్ కు ఎన్నిక కావడంతో ఆమెపై పాజిటివిటీ కంటే నెగిటివిటీ దారుణంగా పెరిగిపోయింది. ఈ పొలిటికల్ ఎంట్రీ, వివాదాల ప్రభావం నేరుగా ఆమె సినిమాలపై పడుతోంది. ఆ మధ్య ఎన్నో అంచనాలు, మరెన్నో వివాదాల మధ్య వచ్చిన 'ఎమర్జన్సీ' చిత్రానికి విమర్శకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది.
ఇక తాజాగా థియేటర్లలోకి వచ్చిన 'భారత్ భాగ్య విధాత' (Bharatha Bhagya Vidhatha) పరిస్థితి అయితే వర్ణనాతీతం. ఈ సినిమాకు కూడా రివ్యూస్, టాక్ పరంగా పరవాలేదనే రెస్పాన్స్ వచ్చింది. కానీ, థియేటర్లలో సినిమాను చూసే నాథుడే కరువయ్యాడు. థియేటర్లన్నీ జనాలు లేక వెలవెలబోవడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. టాక్ బాగున్నా జనాలు థియేటర్లకు రావడం లేదంటే.. కంగనాపై ఆడియెన్స్‌లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.
కంగనా కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి మరో ప్రధాన కారణం.. ఆమె ఎంచుకుంటున్న కథలు. రూటు మార్చకుండా కేవలం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకే ఆమె పరిమితం కావడం ప్రేక్షకుల్లో తీవ్రమైన విసుగును, మొనాటమీని తెచ్చిపెట్టింది. ప్రతి సినిమాలో తనే సర్వస్వం అన్నట్లుగా ఉండే కథల వల్ల ఆడియెన్స్ కొత్తదనాన్ని ఆశించలేకపోతున్నారు.
ఈ కమర్షియల్ ఫార్ములా మిస్ అవ్వడం ఆమె కెరీర్‌కు మరింత మైనస్‌గా మారింది. ఒకపక్క ఎంపీగా రాజకీయ బాధ్యతలు.. ఇంకోపక్క బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలు! ఇవన్నీ చూస్తుంటే ఇండస్ట్రీ వర్గాల్లో కంగనా పని అయిపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో కంగనా తన తప్పులను తెలుసుకుని, సినిమాల పరంగా రూటు మార్చి కొత్త పంథాను ఎంచుకుంటుందా..? లేక రాజకీయాలకే పరిమితమై వెండితెరకు గుడ్ బై చెబుతుందా..? అనేది కాలమే నిర్ణయించాలి.