3 Idiots: రీ-రిలీజ్ కాదు... సీక్వెల్ మాత్రమే
ABN , Publish Date - Jul 23 , 2026 | 03:35 PM
ఆమీర్ ఖాన్ 'త్రీ ఇడియట్స్' మూవీ రీ-రిలీజ్ ప్రచారాన్ని మేకర్స్ ఖండించారు. అయితే 'త్రీ ఇడియట్స్'కు సీక్వెల్ ఉంటుందని ఆమీర్ ఖాన్ స్పష్టం చేశారు.
ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన 'ఫైవ్ పాయింట్ సమ్ వన్' నవల ఆధారంగా తెరకెక్కిన సినిమా 'త్రీ ఇడియట్స్'. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఆమీర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషీ కీలక పాత్రలు పోషించారు. 2009లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, భారతీయ విద్యావిధానం మీద పెద్ద చర్చకు తెర తీసింది. ఐఐటీ ప్రాంగణాలలో జరుగుతున్న దారుణాలకు ఈ సినిమా తార్కాణంగా నిలిచింది.
లడఖ్‌కు చెందిన పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ నీట్ పేపర్ లీకేజ్ నేపథ్యంలో జంతర్ మంతర్ లో నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆయన్ని ఆ తర్వాత బలవంతంగా హాస్పిటల్‌కు తరలించారు. దాంతో ఈ ఉద్యమాన్ని కాక్రోచ్ జనతా పార్టీ టేకోవర్ చేసింది. వారి నిరాహార దీక్షను భగ్నం చేస్తూ పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా వాడీవేడీ చర్చకు దారి తీసింది. ఇదే సమయంలో విద్యా వ్యవస్థపై రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన 'త్రీ ఇడియట్స్' రీ-రిలీజ్ కాబోతోందనే ప్రచారం జరిగింది. సెప్టెంబర్ 4న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. 'త్రీ ఇడియట్స్'లోని కథాంశాన్ని ఇవాళ్టి రోజులకు కనెక్ట్ చేసి చూసుకోవడం సబబుగా ఉంటుందని, పేపర్ లీకేజ్ తో పాటు ఇవాళ్టి విద్యా వ్యవస్థ కారణంగా యువత ఎంత ఒత్తిడికి లోనవుతుందనేది ఈ తరానికీ తెలియచేయాల్సి ఉందని కొందరు అనుకుంటున్నారు.

అయితే, 'త్రీ ఇడియట్స్' చిత్రం రీ-రిలీజ్ అంశాన్ని మేకర్స్ ఖండించారు. ఈ సినిమా రీ-రిలీజ్‌పై వస్తున్న వార్తల్లో నిజం లేదని ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియచేశారు. ఇదే సమయంలో 'త్రీ ఇడియట్స్'కు సీక్వెల్‌పై ఆమీర్ ఖాన్ స్పష్టమైన ప్రకటన చేశారు. దీని సీక్వెల్ పై దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, స్క్రీన్ రైటర్ అభిజత్ జోషి వర్క్ చేస్తున్నారని, అందమైన కథను వారు రూపొందిస్తున్నారని అన్నారు. మొదటి సినిమాలోని హాస్యం ఇందులోనూ ఉంటుందని, రాజ్ కుమార్ హిరానీ చెప్పిన లైన్ తనకు బాగా నచ్చిందని, దానికి వారు మెరుగులు దిద్దుతున్నారని, మొదటి కథ అయిన తర్వత పదేళ్ళకు ఇది మొదలవుతుంద'ని తెలిపారు. మొత్తం మీద 'త్రీ ఇడియట్స్' థియేటర్లలో రీ-రిలీజ్ కాకపోయినా ఒకటి రెండేళ్లలో దాని సీక్వెల్ ను జనాలు చూడొచ్చు.
ఇవి కూడా చదవండి:
మా అన్నయ్య మెగాస్టార్‌కు.. నేను పవర్ స్టార్‌కు అభిమానులం: కిరణ్ అబ్బవరం
మా రమేష్ మాకు కావాలి సార్.. పవన్, హరీష్ శంకర్‌లకు గబ్బర్ సింగ్ టీమ్ కన్నీటి విన్నపం
నందమూరి హీరోతో పరశురామ్ సినిమా! వర్కౌట్ అయ్యేనా..