Telugu Cinema: కథలు మనవే... విదేశాల్లో చిత్రీకరణ...
ABN, Publish Date - Jun 28 , 2025 | 04:44 PM
అచ్చంగా మన కథలే. కానీ, వాటికి కూడా విదేశాల్లో చిత్రీకరణ అవసరమంటున్నారు సినీజనం. ఎందుకలాగా? వరైటీ కోసం అనుకుంటాం - కానీ, అబ్రాడ్ షూటింగ్స్ వెనకాల బోలెడు విషయాలు దాగున్నాయి. అవేంటో చూద్దాం.
తాజాగా జనం ముందు నిలచిన 'కన్నప్ప' (Kannappa) గుడ్ టాక్ తో సాగుతోంది. ఈ కథ తెలుగు వారందరికీ సుపరిచితమైన తిన్నడి కథ. మన తెలుగునేలపై రాయలసీమలో కొలువైన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో తిన్నడు భక్త కన్నప్పగా ఈ నాటికీ పూజలు అందుకుంటున్నాడు. ఈ కథతోనే గతంలో 'కాళహస్తి మహాత్మ్యం, భక్త కన్నప్ప' (Bhaktha Kannappa) చిత్రాలు జనం ముందు నిలచి వారి మనసులు గెలిచాయి. ఇప్పుడు మూడోసారి కూడా కన్నప్ప కథ ఆకట్టుకుంటోందనే వినిపిస్తోంది. ఇది ఫక్తు మన తెలుగు కథ. అందునా పురాణాలతో మిళితమైన అంశం ఉంది. అయితే 'కన్నప్ప' షూటింగ్ న్యూజీలాండ్ లోని క్రైస్ట్ చర్చ్, ఆక్లాండ్ వంటి ప్రదేశాల్లో జరిగింది. న్యూజీలాండ్ పచ్చదనం నడుమ రూపొందిన 'కన్నప్ప' తెరపై కనువిందు చేస్తోంది.
అప్పుడు కూడా...
సోషల్ టాపిక్స్ తో రూపొందే సినిమాలు ఎక్కడ షూటింగ్ జరుపుకున్నా తేడా ఉండదు. కానీ, మన పురాణాలు, చారిత్రకాల కోసం కూడా విదేశాలకు వెళ్తూ ఉండడమే విచిత్రంగా ఉంటుంది. గతంలో బాలకృష్ణ 100వ చిత్రంగా వచ్చిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' తొలి తెలుగు చక్రవర్తి కథతో రూపొందింది. అయితే ఈ సినిమా షూటింగ్ లో కొంత భాగం జార్జియాలో జరిగింది. ఈ చిత్రం సాధించిన విజయం చూశాక, రాయలసీమ పాలెగాడు 'నరసింహారెడ్డి' కథతో రూపొందిన 'సైరా.' కూడా జార్జియా బాట పట్టడం గమనార్హం! మన సంస్కృతిని చాటింది అంటూ కొన్నేళ్ళ క్రితం 'అఖండ' సినిమాకు జనం బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ గా వస్తోన్న 'అఖండ-2'లో కూడా కొంత భాగం జార్జియాలోని కజ్ బేగీలో చిత్రీకరించడం విశేషం! భారత స్వరాజ్య పోరాట నేపథ్యంలో రూపొందిన రాజమౌళి 'ట్రిపుల్ ఆర్' కూడా ఉక్రెయిన్ లోని మారిన్ స్కీ ప్యాలెస్ లో కొంత చిత్రీకరణ జరుపుకుంది. అయితే ఆ నాటి బ్రిటీష్ పాలన లుక్ కోసమే 'ట్రిపుల్ ఆర్' యూనిట్ అంత దూరం వెళ్ళినట్టు తెలుస్తోంది.
కథలు మనవే - పురాణాల్లోనివో, చరిత్ర ఆధారంగా రూపొందేవో ఏవైనా సరే - నేపథ్యం మన దేశానికి చెందినది. అయినా విదేశాల్లో చిత్రీకరించడానికి తెలుగు సినీజనం ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారు?. అందుకు తగ్గ సమాధానాలు సినీజనం వద్ద ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం మన తెలుగు సినిమాలు ఎల్లలు దాటి దేశవిదేశాల్లో ప్రదర్శితమవుతున్నాయి. అందువల్ల అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పాత కథల్లోని సహజత్వం కోసం విదేశాల్లోని పచ్చదనం దగ్గరకు వెళ్ళవలసిందే. మన దేశంలోనూ అలాంటి ప్రదేశాలు లేవా అంటే ఉన్నాయి. అయితే విదేశాల్లో అయితే మనం ఎన్నుకున్న ప్రదేశాల్లోనే చిత్రీకరణకు అనువైన ఇన్ ఫ్రాస్ట్రక్టర్ కూడా లభ్యమవుతూ ఉంటుంది. దాంతో మేకర్స్ కు పని సులభమవుతుంది. మైథలాజికల్స్, పీరియాడికల్స్ కు అటవీ ప్రాంతాలు కావలసి ఉంటుంది. మన దేశంలో అలాంటి చోట్లకు పోతే షూటింగ్స్ కు అంతరాయం కలుగుతుంది. అంతే కాదు కొన్ని దేశాలు తమ పర్యాటక ప్రదేశాలను ప్రమోట్ చేసుకొనేందుకు సినిమా తీసేవారికే కొన్ని రాయితీలు కల్పిస్తున్నాయి. ఈ అంశం కూడా కొందరిని ఆకర్షిస్తోంది. హాలీవుడ్ మూవీస్ తెరకెక్కే ప్రాంతాల్లోనే మన సినిమాలు కూడా రూపొందితే అంతర్జాతీయ మార్కెట్ లో ఓ విలువ ఉంటుందనీ కొందరి అభిప్రాయం. ఇన్ని సదుపాయాలు అందుతూ ఉండడం వల్లే విదేశాల్లో మన కథలు తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది. పురాణాలు, చారిత్రక నేపథ్యాల పరిస్థితే ఇలా ఉంటే సోషల్ మూవీస్ అబ్రాడ్ షూటింగ్స్ గురించి వేరే చెప్పాలా?. రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ ఇంకా ఎలా సాగుతుందో చూద్దాం.
Also Read: Shrasti Verma: మాస్టర్ జీ.. మీ పాఠాల వలనే ఎదిగాను
Also Read: The Paradise: రూమర్స్ కు చెక్.. చెప్పిన టైమ్ కే వస్తున్న నాని