Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి మెగా బ్లాస్ట్ గ్లింప్స్....
ABN, Publish Date - Aug 21 , 2025 | 07:17 PM
'విశ్వంభర' ఎట్టి పరిస్థితుల్లో రెండు మూడు నెలల్లో రిలీజ్ అవుతుందని మెగాభిమానులంతా అనుకున్నారు. కానీ మరీ ఏడెనిమిది నెలలు ఈ సినిమా కోసం ఇంకా వేచి ఉండాల్సి వస్తుందని ఊహించలేదు. ఇక చిరంజీవి చెప్పినట్టు మెగా బ్లాస్ట్ గ్లింప్స్ సాయంత్రం రానే వచ్చింది. అది ఎలా ఉందంటే...
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మెగా ప్రాజెక్ట్ 'విశ్వంభర' (Viswambhara) ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూస్తుంటే... అది రోజు రోజుకూ వెనక్కి వెళుతోంది. చిరంజీవి బర్త్ డే కానుకగా ఆగస్ట్ 22న ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్న తరుణంలో గురువారం ఉదయమే చిరంజీవి 'విశ్వంభర' మెగా బ్లాస్ట్ గ్లింప్స్ సాయంత్రం వస్తుందంటూనే ఈ మూవీ వచ్చే యేడాది సమ్మర్ కు జనం ముందుకొస్తుందని చెప్పారు. దాంతో మెగాభిమానులు కాస్తంత డీలా పడ్డారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) మూవీ ఎలానూ 2026 సంక్రాంతి కానుకగా వస్తోంది కాబట్టి... 'విశ్వంభర' ఎట్టి పరిస్థితుల్లో రెండు మూడు నెలల్లో రిలీజ్ అవుతుందని వారంతా అనుకున్నారు. కానీ మరీ ఏడెనిమిది నెలలు ఈ సినిమా కోసం ఇంకా వేచి ఉండాల్సి వస్తుందని ఊహించలేదు. ఇక చిరంజీవి చెప్పినట్టు మెగా బ్లాస్ట్ గ్లింప్స్ సాయంత్రం రానే వచ్చింది.
ఈ గ్లింప్స్ ఎలా ఉందంటే... దీని ప్రారంభంలోనే ఓ పెద్దాయన ఏదో చెప్పబోతుంటే... చిన్న పాప 'అర్థం కాలేదు' అని చెబుతుంది. ఆయనేదో గొప్ప, పెద్ద అంశాన్ని గురించి చెబుతున్నాడని తెలుస్తోంది కానీ అదేమిటో ఆ చిన్నారికి అర్థం కాలేదన్నది వాస్తవం. అలానే ఈ గ్లింప్స్ లో కూడా ఈ సినిమా గొప్పగా ఉండబోతోంది, దర్శకుడు వశిష్ఠ ఏదో గొప్పగా చెప్పబోతున్నాడని తెలుస్తోంది. కానీ గ్లింప్స్ మాత్రం అర్థం కాకుండా ఉంది! అయితే ఈ మధ్యలో వచ్చిన చాలా సినిమాల కంటే ఈ గ్లింప్స్ లో వి.ఎఫ్.ఎక్స్. బాగున్నాయి.
గురువారం ఉదయం చిరంజీవి చెప్పినప్పుడు అభిమానులు ఎలాగైతే ఈ సినిమా కోసం ఇంకా చాలా నెలలు ఎదురుచూడాలని భావించారో... అలానే ఈ గ్లింప్స్ లో అదే ఉండటం కాకతాళీయం. 'కొన ఊపిరిలో బతికున్న ఓ సమూహం తాలుకు నమ్మకం... అలసిపోని ఆశయానికి ఊపిరి పోసే వాడొకడొస్తాడని... ఆగని యుద్థాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా ముగిస్తాడని గొప్పగా ఎదురు చూసింది' వంటి గంభీర సంభాషణలతో ఈ గ్లింప్స్ సాగిపోయింది. ఈ కథలోని ఆ సమూహం ఎదురుచూపులు మాదిరే మెగాభిమానులు ఎదురుచూస్తున్నారని అనుకోవాల్సి ఉంటుంది.
దర్శకుడు వశిష్ఠ ఈ మధ్య 'విశ్వంభర' సినిమా కథ గురించి చెప్పిన తాలుకు ఛాయలేవీ ఈ గ్లింప్స్ లో అయితే కనిపించలేదు. 'కేజీఎఫ్' మొదలుకొని మొన్నటి 'కింగ్ డమ్' వరకూ వచ్చిన అనేక చిత్రాల కథల ఛాయలే ఈ గ్లింప్స్ లో కనిపించాయి. అయితే కథ అందుకు పూర్తి భిన్నమైందని చెప్పిన వశిష్ఠ మాటలను నమ్ముకుని ఎదురు చూడాల్సిందే! ఇక గ్లింప్స్ చివరిలో చిరంజీవి చేతిలోని కనుగుడ్డులోని బాల్ అటూ ఇటూ తిరగడం చూస్తే... బిగ్ బాస్ షో లోగో లోని కన్నుగుడ్డు తిరిగినట్టే అనిపించింది. ఏదేమైనా... 'విశ్వంభర' మెగా బ్లాస్ట్ గ్లింప్స్ పై ఫ్యాన్స్ లోనూ మిశ్రమ స్పందన లభిస్తోంది.
Also Read: Coolie: రజనీకాంత్ ఇంకా స్ట్రాంగ్ గానే...
Also Read: Paradha Review: 'పరదా' మెప్పించిందా..