Paradha Review: 'పరదా' మెప్పించిందా.. 

ABN , Publish Date - Aug 21 , 2025 | 06:17 PM

పరదా.. టైటిల్‌, ముసుగులతో ఉన్న ఆడవాళ్ళ పోస్టర్స్‌ విడుదలైనప్పటి నుంచి సినిమాపై ఆసక్తి నెలకొంది. అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికగా దర్శన రాజేంద్రన్‌, సంగీత కీలక పాత్రధారులు కావడం, ‘సినిమా బండి’, ‘శుభం’ వంటి భిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్న ప్రవీణ్‌ కాండ్రేగుల దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తించింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించిందా 

Paradha Review

సినిమా రివ్యూ: పరదా (Paradha Review)

విడుదల తేది: 22-8-2025

పరదా.. టైటిల్‌, ముసుగులతో ఉన్న ఆడవాళ్ళ పోస్టర్స్‌ విడుదలైనప్పటి నుంచి సినిమాపై ఆసక్తి నెలకొంది. అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) కథానాయికగా దర్శన రాజేంద్రన్‌, సంగీత కీలక పాత్రధారులు కావడం, ‘సినిమా బండి’, ‘శుభం’ వంటి భిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్న ప్రవీణ్‌ కాండ్రేగుల దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తించింది. ప్రమోషన్స్‌ కూడా వినూత్న రీతిలో చేయడంతో సినిమా జనాల్లోకి బాగా వెళ్లింది. పరదా వెనకున్న కథేంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెంచింది. నూతన నిర్మాతలు విజయ్‌ డొంకాడ, శ్రీనివాసులు పి.వి. మక్కువ ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన పరదా మెప్పించిందా?

కథ: (Paradha Movie Review)

పడతి అనే గ్రామంలో జ్వాలమ్మ గ్రామ దేవత. ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో జరిగిన ఓ ఘటన వల్ల ఆమె శత్రువులను చంపి, ఆత్మహుతికి పాల్పడుతుంది. అప్పటి నుంచి ఆ గ్రామంలో ఈడు వచ్చిన ప్రతి ఆడపిల్ల ముఖానికి పరదా కప్పుకొని బయటకు వెళ్ళే ఆచారం మొదలవుతుంది. పొరపాటు ఆ పరదా తీస్తే జ్వాలమ్మ ముందు ఆత్మహుతి కావలసిందే. అదే గ్రామంలో సుబ్బలక్ష్మీ (అనుపమా పరమేశ్వరన్‌), రాజేశ్‌ (రాగ్‌ మయూర్‌) అనే ప్రేమికులు ఉంటారు. ఇద్దరికీ పెద్దలు పెళ్లి నిశ్చయిస్తారు. అదే సమయంలో సుబ్బు ఫొటో ఒకటి ఇంగ్లిష్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీగా వెలువడుతుంది. దాంతో ఆమె నిశ్చితార్థం ఆపేసి ఆమె ఆత్మాహుతి చేసుకోవాలని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. తన తప్పు లేదని చెప్పినా వినరు. అసలు ఆ ఫొటో ఎవరు తీశారనేది తెలుసుకుని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించకుంటానని ఆ ఫొటోగ్రాఫర్‌ ను వెదికే క్రమంలో ధర్మశాల వెళ్ళాల్సి వస్తుంది. ఆ క్రమంలో రత్న(సంగీత), అమిష్ట(దర్శన రాజేంద్రన్‌) ఎలా సహకరించారు. అసలు వాళ్ళెవ్వరు? సుబ్బు పరదా తీసిందా? పరదా తీస్తే జ్వాలమ్మ శాపానికి గురి కావాల్సిందేనా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!  


Paradha

విశ్లేషణ: (Anupama parameswaran Paradha movie Review)

ఈడు వచ్చిన అమ్మాయిలంతా మరణించే దాకా తన కుటుంబ సభ్యులు, భర్తకు తప్ప ఎవరికీ తమ ముఖాన్ని చూపించకూడదు అన్నది ప్రధానాంశం. దానిని మొదటి పది నిమిషాల్లో తోలు బొమ్మలాటతో చెప్పాడు దర్శకుడు. ఫస్టాఫ్‌ అంతా విలేజ్‌, సుబ్బుకి ఎదురైన, సమస్య, పరిష్కారం ప్రయాణంతో మొదలవుతుంది. సెకెండాఫ్‌లో దర్శన రాజేంద్రన్‌ ఎంట్రీతో కథ కాస్త పరుగులు తీసినా తదుపరి ఇంకేదో మలుపు తిరుగుతుంది అనుకుంటే.. ధర్మశాల ప్రాంతానికి వెళ్ళే మార్గంలో అంతరాయం కలగడం, ఎటూ పోయే దారి లేక అక్కడే బస చేయడం, ట్రెక్‌, అక్కడి అందాలను ఆస్వాదించే క్రమంలో బాహ్య ప్రపంచాన్ని చూసిన సుబ్బు స్వేచ్ఛను కోరుకోవడంతో కథ ట్రాక్‌ తప్పిందనిపిస్తుంది. అక్కడక్కడా తాము వచ్చిన పనిని హింట్‌ ఇచ్చినట్లు దర్శకుడు గుర్తు చేసినా.. ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యేలా లేదు. ఆ ట్రెక్‌ సీన్‌ అంతా సాగదీతలాగా అనిపిస్తుంది. మధ్యలో రాజేంద్రప్రసాద్‌ ఇలా వచ్చి నాలుగు ఇన్‌స్ఫైరింగ్‌ మాటలు చెప్పి వెళ్ళిపోతాడు. ఆ క్యారెక్టర్‌ అవసరం లేదనిపిస్తుంది.

Paradha

నటీనటుల పనితీరు..

ఇప్పటిదాకా అనుపమా పరమేశ్వరన్‌ పక్కింటి అమ్మాయి పాత్రల్లోనే ఎక్కువగా నటించింది. మధ్యలో గ్లామర్‌ బాటా పట్టింది. కానీ ఈ సినిమా ఆమెకు ప్రత్యేకమనే చెప్పాలి. గ్రామీణ యువతి కట్టు బొట్టు నుంచి అన్నింటికి న్యాయం చేసింది. మొదట్లో జెయింట్‌ వీల్‌ ఎక్కడానికి బయపడిన ఆమె.. హిమాలయాల్లో జరిగిన ఘటన తర్వాత ఫియర్‌లెస్‌ ఉమన్‌గా మారడం ఇలా రెండు వేరియేషన్స్‌ చూపించింది. అమిష్ట పాత్రలో దర్శన రాజేంద్రన్‌ చక్కగా అమరింది. తెలుగులో స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకోవడం విశేషం. రత్నగా సంగీత క్యారెక్టర్‌ అలరించింది. ఆమె భర్తగా హర్షవర్థన్‌ కాసేపు నవ్వించారు. రాగ్‌ మయూర్‌, ‘బలగం’ సుధాకర్‌ రెడ్డి.. ఇతర పాత్రధారులంతా పరిధి మేరకు నటించారు. ఫోటోగ్రాఫర్‌ పాత్రలో గౌతమ్‌ మీనన్‌ మెరిశారు. సినిమాలో మాటలు బాగున్నాయి. మృదుల్‌ సుజిత్‌ సేన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె పరిసరాలను, హిమాలయ అందాలను చక్కగా చిత్రీకరించారు. పాటల్లో లిరిక్‌ వినిపించేలా గోపీసుందర్‌ సంగీతం అందించారు, ధరేంద్ర కాకరాల ఎడిటింగ్‌ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉంటే బావుండేది. టెక్నీకల్‌గా సినిమా బావుంది. తన గత చిత్రాలు వేరే జానర్‌లో తీశాడు ప్రవీణ్‌. ఇది మాత్రం కాస్త ప్రత్యేకంగానే ప్లాన్‌ చేసినా సెకండాఫ్‌లో గాడి తప్పకుండా గ్రిప్పింగ్‌గా ఉండుంటే రిజల్ట్‌ ఇంకాస్త బావుండేది.  

ట్యాగ్‌లైన్‌: చెదిరిన ‘పరదా’

రేటింగ్‌: 2.25/5

Updated Date - Aug 21 , 2025 | 07:36 PM