Teja Sajja: 'మిరాయ్'లో వైబ్ సాంగ్ ఉండదా...

ABN , Publish Date - Sep 09 , 2025 | 02:09 PM

భారీ సెట్స్ వేసి తీసే పాటలు ఒక్కోసారి థియేటర్లలో కనిపించవు. సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఈ పాట సినిమాలో లేకపోతే అభిమానులు నిరుత్సాహానికి గురి కావడం సహజం. 'మిరాయ్' విషయంలోనే అలాంటిదే జరుగబోతోందట!

Mirai telugu movie

సినిమాలకు సగం విజయం వాటి పాటలకు లభించే ఆదరణ బట్టే ఉంటుందని సినిమా పెద్దలు చెబుతుంటారు. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చేవి కూడా పాటలే. మూవీ (Movie) మీద అంచనాలు పెరగడానికి, తగ్గడానికి కూడా అవి దోహదం చేస్తాయి. గతంలో ఆడియో క్యాసెట్ లేదా సీడీ ఒకేసారి విడుదలయ్యేవి. ఇప్పుడు కాలం మారిపోయింది. ఒక్కో పాట... ఒక్కోసారి ఒక్కో విధంగా విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా యూత్ ను టార్గెట్ చేస్తూ కాలేజీలకు వెళ్ళి అక్కడ పాటలను రిలీజ్ (Song Release) చేయడం అలవాటుగా మారింది. పాటల చిత్రీకరణకే కాకుండా వాటి మేకింగ్ వీడియోస్ కోసం భారీ మొత్తాన్ని కూడా ఖర్చుపెడుతున్నారు. అందువల్ల సినిమాలోని ప్రతి పాటకూ ప్రాచుర్యం లభిస్తోంది. అయితే బాధాకరం ఏమంటే... భారీ ఎత్తున చిత్రీకరణ జరుపుకుని, భారీగా ప్రచారం పొందిన కొన్ని పాటలు... ఫైనల్ గా సినిమాల్లో ఉండటం లేదు. కథాగమనానికి ఆ పాట అడ్డం వస్తోందనో, దానికి తగ్గ సిట్యుయేషన్ దొరకలేదనో, సినిమా నిడివి పెరిగిందనో... ఏదో ఒక కారణంగా కొన్ని సినిమాల్లోంచి పాటలు డెలిట్ అవుతున్నాయి.


ఈ మధ్య వచ్చిన ధనుష్ 'కుబేర' (Kubera) మూవీలో రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) పై చిత్రీకరించిన పాటను చివరి క్షణంలో పక్కన పెట్టేశారు. అలానే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) 'కింగ్ డమ్' (Kingdom) మూవీలోనూ హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన డ్యుయేట్ ను కూడా లాస్ట్ మినిట్ లో తీసేశారు. థియేటర్లలో ఈ పాటను మిస్ అయిన విజయ్ దేవరకొండ అభిమానులు కనీసం ఓటీటీలో అయిన చూడొచ్చు అనుకుంటే అక్కడ కూడా ఈ పాటను యాడ్ చేయలేదు. గత యేడాది 'దేవర' సినిమా విషయంలోనూ అలానే జరిగింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద రెండు డ్యూయెట్స్ చిత్రీకరించారు. ఈ రెండు పాటలను సోషల్ మీడియాలో విడుదల చేసినప్పుడు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ సినిమాలో మాత్రం ఒక్క పాటనే పెట్టారు. పాటలకు స్పందన రాకపోతే సరే... పాటలు చార్ట్ బస్టర్స్ లో చోటు దక్కించుకున్న సందర్భాలలోనూ నిర్దయగా మేకర్స్ వాటిని పక్కన పెట్టేయడం అభిమానులను బాధకు గురిచేస్తుందనేది వాస్తవం.


ఇక విషయానికి వస్తే.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'మిరాయ్' (Mirai) సినిమా విషయంలో ఇదే జరిగినట్టుగా తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ తాజా సమాచారం ప్రకారం ఇందులోని 'వైబ్ ఉంది' పాటను ఫైనల్ ఎడిటింగ్ టైమ్ లో పక్కన పెట్టేశారని రూమర్స్ వినిపిస్తున్నాయి. సూపర్ యోధగా తేజ సజ్జ నటిస్తున్న 'మిరాయ్' మూవీలో రుతిక (Ruthika) హీరోయిన్ గా నటించింది. ఇందులోని 'వైబ్ ఉంది' పాట విడుదలై కాగానే ఇన్ స్టెంట్ హిట్ అయిపోయింది. తేజ, రితికా నాయక్ మధ్య కెమిస్ట్రీ, డాన్స్ మూమెంట్స్ యూత్ కు తెగ నచ్చేశాయి. ట్రెండీ టచ్ తో చిన్న పాటి క్లాసిక్ హింట్స్ తో సాగిన 'వైబ్ ఉంది' సాంగ్ క్లాస్ కి, మాస్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యింది. తెలుగు, ఇంగ్లీష్‌ భాషలను నేచురల్ గా బ్లెండ్ చేస్తూ కృష్ణకాంత్ ఈ పాటను రాశారు. గౌర హరి స్వరాలు సమకూర్చారు. దీన్ని అర్మాన్ మాలిక్ అద్భుతంగా పాడారు. హై బీట్ తో సాగిన ఈ పాట చార్ట్ బస్టర్స్ లో చోటు దక్కించుకోవడంతో ఖచ్చితంగా సినిమాకు ఇది ఒక హైలైట్ గా నిలుస్తుందని అంతా భావించారు. కానీ సినిమా నిడివి దృష్ట్యానో, స్టోరీ ఫ్లో కు ఇబ్బంది కలుగుతుందనో దీన్ని తీసేశారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది ఈ నెల 12న సినిమా విడుదల అయితే కానీ తెలియదు. ఏదేమైనా... కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీసే నిర్మాతలు... ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకుంటారు సో... వారి నిర్ణయాన్ని కూడా గౌరవించాల్సిందే!

Also Read: Krish 4: బాలీవుడ్ సూపర్‌హీరో ఫ్రాంచైజీకి కొత్త అధ్యాయం – క్రిష్ 4

Also Read: Good Bad Ugly: అగ్లీ చర్యపై ఇళయరాజా విజయం

Updated Date - Sep 09 , 2025 | 02:10 PM