Vadde Naveen: మళ్ళీ హీరోగా, నిర్మాతగా.. వడ్డే నవీన్
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:55 PM
హీరో వడ్డే నవీన్ తాజాగా 'వడ్డే క్రియేషన్స్' అనే బ్యానర్ ను స్థాపించి తండ్రి బాటలో ప్రయాణం సాగించబోతున్నాడు. ఈ బ్యానర్ లో రాబోతున్న తొలి చిత్రం 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు'.
ప్రముఖ నిర్మాత, స్వర్గీయ వడ్డే రమేశ్ (Vadde Ramesh) తనయుడు నవీన్ (Naveen). వడ్డే రమేశ్ విజయ మాధవి కంబెన్స్ బ్యానర్ లో 'బొబ్బిలి పులి, లంకేశ్వరుడు, కటకటాల రుద్రయ్య' వంటి సినిమాలే కాదు... అగ్ర కథానాయకులతోనూ అనేక సినిమాలను నిర్మించారు. ఆయన తనయుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన నవీన్ పలు చిత్రాలలో హీరోగా నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు. కానీ కొంత కాలంగా అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు 'వడ్డే క్రియేషన్స్' అనే బ్యానర్ ను స్థాపించి తండ్రి బాటలో ప్రయాణం సాగించబోతున్నాడు. ఈ బ్యానర్ లో రాబోతున్న తొలి చిత్రం 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు'.
వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే నవీన్ నిర్మాతగా 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు కమల్ తేజ నార్ల దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడితో పాటు ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను వడ్డే నవీన్ అందిస్తుండటం విశేషం. ఈ సినిమాలో ఆయనకు జోడీగా రాశీ సింగ్ (Rasi Singh) నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ మే 15న మొదలై నాన్ స్టాప్ గా సాగుతోంది. ఇంతవరకూ ఎనభై శాతం షూటింగ్ పూర్తయ్యింది. తాజాగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. రఘు బాబు, సాయి శ్రీనివాస్, బాబా మాస్టర్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, దేవీ ప్రసాద్, సూర్య కుమార్ భగవదాస్, శివ నారాయణ, ప్రమోదిని, గాయత్రి భార్గవి, జ్వాల కోటి, దేవి మహేష్, ఊహా రెడ్డి, రేఖా నిరోష, గాయత్రి చాగంటి, సాత్విక్ రాజు, అంజలి ప్రియ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి కార్తిక్ సుజాత సాయికుమార్ కెమెరామెన్‌గా, కళ్యాణ్ నాయక్ సంగీత దర్శకుడిగా, విజయ్ ముక్తావరపు ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
Also Read: Ravi Teja: వివాదంలో 'ఓలే ఓలే' సాంగ్
Also Read: Raja Babu: నవ్వుల 'రాజా'... ఈ బాబు...