Ravi Teja: వివాదంలో 'ఓలే ఓలే' సాంగ్
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:20 PM
ఏ విషయానికైనా ఓ లిమిట్ ఉంటుంది. అది దాటితే ఆ విషయంతో సంబంధం లేని వాళ్ళకు కూడా కోపం వస్తుంది. ఇటీవల టాలీవుడ్ మేకర్స్ అలాంటి కోపాన్ని తెప్పిస్తున్నారు ఆడియన్స్ కి. అతి చేష్టలతో విమర్శల పాలవుతున్నారు.
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు కొత్తదనం పేరుతో చేస్తున్న ప్రయోగాలు ఇటీవల వివాదాలకు కారణమవుతున్నాయి. మరి ముఖ్యంగా సాహిత్య పరంగా చేస్తున్న తప్పులు తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నాయి. కామన్ గా ఫోక్ సాంగ్స్ తో సామాన్య ప్రజలు ఎప్పుడూ కనెక్ట్ అవుతుంటారు. కానీ అవి హద్దులు దాటితే అభ్యంతరకరంగా మారతాయి. తాజాగా మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తున్న సినిమా 'మాస్ జాతర' (Mass Jathara) లోని 'ఓలే ఓలే' (Ole Ole) పాట ఇప్పుడు అలాంటి విమర్శలను ఎదుర్కొంటోంది.
'ఓలే ఓలే' పాటలోని 'నీ అమ్మ, నీ అయ్య, నీ అక్క, నీ చెల్లి..., గుంట, నీ ఒళ్లోకొచ్చి పంట, సిగ్గు లేదు, షేరము లేదు, లాగు లేదు' వంటి పదాలు చాలా మందికి అసభ్యంగా అనిపించాయి. ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు. భాస్కర్ యాదవ్ దాసరి (Bhaskar Yadav Dasari) సాహిత్యం అందించారు. నెటిజన్లు ఈ పాటను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ, జానపద స్టైల్ పేరుతో పాటలను పాడు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. జానపద పాటలను ప్రోత్సహించాలి కానీ కొన్ని పరిమితులు ఉండాలని వారు అంటున్నారు.
గతంలో రవితేజ, భీమ్స్ కాంబోలో వచ్చిన 'ధమాకా'లోని 'దండకడియాల్' (Dandakadiyal), 'జింతక్' (Jinthaak) వంటి పాటలు హిట్ అయ్యాయి. కానీ ఈసారి ఉత్తరాంధ్ర స్టైల్‌లో తీసిన 'ఓలే ఓలే' పాట వివాదంలో చిక్కుకుంది. శ్రీలీల, రవితేజ ఎనర్జిటిక్ స్పెప్పులు యూత్ లో ఊపు తెప్పినప్పటికి సాహిత్యపరంగా ఇది విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే ఈ విమర్శలపై సినిమా టీమ్ ఇంకా స్పందించలేదు. భాను భోగవరపు దర్శకత్వంలో, శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న 'మాస్ జాతర' సినిమా వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇది రవితేజ కు 75వ చిత్రం కావడం విశేషం. మరి ఈ వివాదం నిదానంగా చల్లబడిపోతుందా... లేకపోతే మరింత పెరిగిపోయి... మేకర్స్ ను ఇబ్బంది పెడుతుందా? అనేది చూడాలి!