సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jamuna: అభినయ సత్యభామ... జమున

ABN, Publish Date - Aug 30 , 2025 | 06:36 PM

తెలుగు చిత్రసీమలో సత్యభామ పాత్ర అనగానే చప్పున గుర్తుకు వచ్చే నటీమణి జమున (Jamuna) అనే చెప్పాలి.

Jamuna

Jamuna: తెలుగు చిత్రసీమలో సత్యభామ పాత్ర అనగానే చప్పున గుర్తుకు వచ్చే నటీమణి జమున (Jamuna) అనే చెప్పాలి. జమునకు ముందు తరువాత ఎంతోమంది ప్రఖ్యాత నటీమణులు సత్యభామ పాత్రలో నటించినా, ఆమె స్థాయిలో నటించలేక పోయారనే చెప్పాలి. అంతలా సత్యభామ పాత్రలో ఒదిగిపోయిన జమున ఇతర పాత్రల్లోనూ అనితరసాధ్యమైన ప్రతిభను కనబరిచారు. ఆగస్టు 30న జమున జయంతి. ఈ సందర్భంగా అభిమానులు జమున అభినయవైభవాన్ని మననం చేసుకున్నారు.


'పుట్టిల్లు' (Puttillu - 1953) చిత్రంతో తెరకు పరిచయం కాకముందే నాటకరంగంలో రాణించారు జమున. విజయావారి 'మిస్సమ్మ' (Missamma)(1955) చిత్రంతో జమునకు నటిగా మంచి గుర్తింపు లభించింది. అందులో మరో మహానటి సావిత్రి(Savitri) టైటిల్ రోల్ అహో అనిపించినా, తనకు లభించిన పాత్రలో జమున సైతం మంచి మార్కులు సంపాదించారు. అంతేకాదు ఈ సినిమాను 'మిస్సియమ్మ'గా తమిళంలోనూ, 'మిస్ మేరీ'గా హిందీలోనూ తెరకెక్కించగా ఆ రెండు చిత్రాల్లోనూ తన పాత్రను తానే ధరించి మెప్పించారు జమున. ఆ పై వందలాది తెలుగు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ జమున తనదైన బాణీ పలికించారు.


తెలుగులో జమునకు హిట్ పెయిర్ అంటే యన్టీఆర్ (NTR) అనే చెప్పాలి. యన్టీఆర్ సరసన దాదాపు 20 చిత్రాలలో జమున నాయికగా నటించారు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాలలో రామారావుతో కలసి జమున సాగారు. అన్ని పాత్రల్లోనూ తనదైన ముద్రను వేశారు. ఏయన్నార్ (ANR)తోనూ జమున అనేక చిత్రాలలో నటించి మురిపించారు. ఆయనతోనూ జమున పలు అరుదైన విజయాలను నమోదు చేసుకున్నారు. 'పెళ్ళిరోజు' (1968) చిత్రంలో జమున "పెళ్ళివారమండి..." అంటూ సాగే పాటలో గాయనిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. అనేక విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించిన జమునకు ప్రభుత్వాల నుండి తగిన గౌరవం లభించలేదనే చెప్పాలి. ఆమెకు 'పద్మ' పురస్కారం లభించనే లేదు. అయితే 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్ఠాత్మకమైన యన్టీఆర్ జాతీయ అవార్డుతో జమునను గౌరవించారు.


రాజకీయాల్లోనూ జమున రాణించారు. యన్టీఆర్ 'తెలుగుదేశం' పార్టీ నెలకొల్పి ఘనవిజయం సాధించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ పలువురు నటీనటులను ఆకర్షించి తమ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దింపింది. అలా 1985లో కాంగ్రెస్ పార్టీ తరపున మంగళగిరిలో పోటీ చేసిన జమున పరాజయం పాలయ్యారు. 1989లో రాజమండ్రి నుండి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై ఎమ్.పి.గా గెలిచారు. ఆ తరువాత మధ్యంతర ఎన్నికల్లో 1991లో అదే నియోజకవర్గం నుండి ఓటమి చవిచూశారు జమున. కొన్నాళ్ళు బీజేపీతోనూ సాగారు. తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏది ఏమైనా నటిగా తనకంటూ ఓప్రత్యేకతను సాధించుకున్న జమున తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు.

Little Hearts Trailer: చదువురాని జంట మధ్య ప్రేమ.. ట్రైలర్ మొత్తం నవ్వులే

Akkineni Nagarjuna: నిరాశలో అక్కినేని ఫ్యాన్స్.. నాగ్ ఇలా చేస్తాడనుకోలేదు

Updated Date - Aug 30 , 2025 | 06:36 PM