Pan India Movie: సీనియర్స్ కు జాతీయ స్థాయిలో చుక్కెదురు..
ABN , Publish Date - Sep 07 , 2025 | 02:01 PM
మన టాప్ స్టార్స్ పాన్ ఇండియా మూవీస్ లో యంగ్ హీరోస్ దే పైచేయి అని చెప్పొచ్చు. సీనియర్ స్టార్స్ కు ఎందువల్లో చుక్కెదురవుతోంది. మరి రాబోయే సీనియర్ స్టార్స్ - పాన్ ఇండియా మూవీస్ ఏం చేస్తాయో!?
తెలుగునాట పాన్ ఇండియా మూవీస్ కు క్రేజ్ 'బాహుబలి' (Baahubali) సిరీస్ తోనే మొదలయింది. ఆ పై పలువురు స్టార్ హీరోస్ తమ చిత్రాలను ఆల్ ఇండియాలో రిలీజ్ చేయడానికి ఉత్సాహంతో ఉరకలు వేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ రూపొందించి రిలీజ్ చేసేవారు. కొందరు తెలుగు, తమిళ, హిందీతో పాటు కన్నడ, మళయాళ భాషల్లోనూ తమ సినిమాలను అనువదించి రిలీజ్ చేసి సక్సెస్ సాధించారు. ఇప్పటి దాకా తెలుగువారి పాన్ ఇండియా మూవీస్ లో యంగ్ స్టార్స్ మాత్రమే విజయాన్ని చవిచూశారు. సీనియర్ స్టార్స్ పాన్ ఇండియా మూవీస్ లెక్కలు చూస్తే పగలే చుక్కలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో రాబోయే సీనియర్ స్టార్స్ పాన్ ఇండియా మూవీస్ 'అఖండ-2' (Akhanda -2), 'ఓజీ' (OG) పైనే పలువురి చూపు సాగుతోంది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) ను పాన్ ఇండియా మూవీ అన్నారు.. కానీ, తెలుగుతో పాటే ఒకే రోజున హిందీలో రిలీజ్ కాలేకపోయిందీ చిత్రం. మరి రాబోయే పవన్ మూవీ 'ఓజీ' అయినా ప్రకటించిన భాషల్లో ఒకే రోజున వస్తుందా అన్న అనుమానాలు పొడసూపుతున్నాయి.
అంతకు ముందు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ వంటి సీనియర్ స్టార్స్ నేరుగా హిందీ సినిమాల్లోనే నటించి ఆకట్టుకున్నారు. సదరు చిత్రాలు ఆల్ ఇండియాలో రిలీజైనా, ఇప్పుడు తెలుగుతో పాటు హిందీలోనూ వెలుగు చూసినప్పుడే పాన్ ఇండియా మూవీస్ అంటున్నారు. ఆ తీరున చిరంజీవి తొలి పాన్ ఇండియా మూవీగా 'సైరా... నరసింహారెడ్డి' వచ్చింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది. తరువాత వెంకటేశ్ హీరోగా 'సైంధవ్'ను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ సినిమాను ఎందుకనో ఆల్ ఇండియాలో ఒకే సారి రిలీజ్ చేయలేకపోయారు. ఆ చిత్రం కూడా పరాజయం పాలయింది. నాగార్జున తొలి పాన్ ఇండియా మూవీ 'కుబేర' అనే చెప్పాలి. ఈ సినిమా కూడా సో సో అనిపించుకుందే తప్ప హిట్ కాదు. ఇప్పుడు సీనియర్ స్టార్స్ లో బాలకృష్ణ తొలి పాన్ ఇండియా మూవీగా 'అఖండ-2' సిద్ధమవుతోంది.
'హరిహర వీరమల్లు'ను పాన్ ఇండియా మూవీగానే బరిలోకి దింపాలనుకున్నా, ఒకే రోజున హిందీలో రిలీజ్ చేయలేక పోయారు మేకర్స్. సినిమా ఫలితం కూడా చేదు రుచి చూపించింది. అందువల్ల 'ఓజీ' పైనే పవన్ ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. ఇక సీనియర్ స్టార్స్ లో పాన్ ఇండియా మూవీవైపు బాలయ్య తొలిసారి 'అఖండ-2'తో చూపు సారిస్తున్నారు. 'అఖండ' ఘనవిజయంతో ఈ రెండో భాగంపై ఆశలు పెంచుకున్నారు అభిమానులు. ఈ యేడాది ఈ రెండు సినిమాలపైనే టాలీవుడ్ జనం కూడా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి దాకా సీనియర్ స్టార్స్ కు అంతగా అచ్చిరాని పాన్ ఇండియా మూవీస్ మరి బాలయ్య, పవన్ కు అదృష్టం తెచ్చిపెడతాయేమో చూడాలి.
Also Read: Bhumi Pednekkar: యంగ్ గ్లోబల్ లీడర్స్ సమ్మిట్‌లో...
Also Read: Vijay Antony: ఏమి రా బాలరాజు దీనివల్ల ఉపయోగం...