Tollywood Directors: ఒకే యేడాది.. ఇద్దరు దర్శకుల అకాల మరణం! తమ సినిమాల.. విడుదలకు ముందే తుదిశ్వాస
ABN, Publish Date - Dec 17 , 2025 | 08:56 PM
గడిచిన ఆరు నెలల్లో తెలుగు దర్శకులు రాంబాబు, కిరణ్ కుమార్ తమ చిత్రాలు విడుదల కాకముందే హఠాన్మరణానికి గురయ్యారు. 'బ్రహ్మాండ' సినిమా విడుదలకు ముందు రాంబాబు, 'కె.జె.క్యూ' మూవీ రిలీజ్ కాకుండా కిరణ్ చనిపోయారు. తుదిశ్వాస
గడిచిన ఆరు నెలల్లో ఇద్దరు దర్శకులు తమ చిత్రాలు విడుదల కాకముందే హఠాన్మరణం చెందడం టాలీవుడ్ (Tollywood) ను ఓ కుదుపు కుదిపేసిందనే చెప్పాలి. ఆమని (Aamani) ప్రధాన పాత్రను పోషించిన 'బ్రహ్మండ' (Brahmanda) సినిమా ద్వారా సీనియర్ కో-డైరెక్టర్ రాంబాబు (సండ్రు నగేశ్) దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తెలంగాణ ఒగ్గు కళాకారుల జీవిత నేపథ్యంలో ఈ సినిమాను దాసరి సురేశ్, మమత నిర్మించారు. మరో కొద్ది వారాలలో సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో జూలై 8వ తేదీ ప్రివ్యూ వేసుకుని ప్రసాద్ లాబ్స్ లో చూస్తూ రాంబాబు హఠాత్తుగా సీటులో ఒరిగిపోయాడు. హుటాహుటిన అతన్ని హాస్పిటల్ కు తరలించగా బ్రెయిన్ స్ట్రోక్ తో అతను మరణించాడు. ఆ తర్వాత 'బ్రహ్మాండ' మూవీ కాస్తంత వాయిదా పడి ఆగస్ట్ 29న జనం ముందుకు వచ్చింది. తొలిసారి తాను దర్శకత్వం వహించిన సినిమాను రాంబాబు పబ్లిక్ తో కలిసి థియేటర్ లో చూసుకోలేకపోయాడు.
ఇది జరిగిన ఆరు నెలలకే ఇప్పుడు మరో దర్శకుడు కిరణ్ కుమార్ (Kiran Kumar) చాలా యేళ్ళ తర్వాత తాను దర్శకత్వం వహించిన సినిమాను థియేటర్ లో చూసుకోకుండానే బ్రెయిన్ డెడ్ అవడంతో కన్నుమూశాడు. 2010లో నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన 'కె.డి.' (KD) తో దర్శకుడైన కిరణ్ కుమార్... ఆ సినిమా పరాజయం పాలు కావడంతో మళ్ళీ అవకాశాలు పొందలేకపోయాడు. ఎట్టకేలకు ఇటీవల ఓ ప్రాజెక్ట్ ను సెట్ చేసుకున్నాడు. 'కె.జె.క్యూ.' (King Jackie Queen) పేరుతో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మించారు. ఇందులో కింగ్ పాత్రనరు దీక్షిత్ శెట్టి (Deekshith Shetty) పోషించగా, జాకీ గా శశి ఓదెల, క్వీన్ గా యుక్తి తరేజా (Yukthi Thareja) నటించారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేశారు. సినిమా విడుదలలో తీవ్ర జాప్యమే జరిగింది. కారణం ఏమిటో తెలియదు కానీ కిరణ్ కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. దానికి సంబంధించిన ఆపరేషన్ జరిగిందని, అది ఫెయిల్ కావడంతో బ్రెయిన్ డెట్ అయ్యిందని సన్నిహితులు తెలిపిన సమాచారం. పదిహేనేళ్ళ తర్వాత తాను దర్శకత్వం వహించిన 'కె.జె.క్యూ' చిత్రాన్ని థియేటర్లలో చూడకుండానే... రాంబాబు తరహాలో కిరణ్ సైతం కన్నుమూయడం తెలుగు సినిమా రంగాన్ని ఓ రకంగా షాక్ కు గురిచేసింది. అనుకున్న సమయంలో సినిమాలు పూర్తి కాకపోవడం, పూర్తి అయిన సినిమాలను థియేటర్లలో విడుదల కాకపోవడం... ఒకవేళ విడుదలైనా.... ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోకపోవడం కారణంగా దర్శకులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారని తెలుగు దర్శకుల సంఘం సభ్యులొకరు ఆవేదన వెలిబుచ్చారు.
Also Read: The Raja Saab: సహనా.. సహానా వీడియో సాంగ్.. డార్లింగ్ డ్యాన్స్ తేడా కొడుతుందే
Also Read: Akhanda 2: బాలయ్య మీద అభిమానం.. అంత దూరం తీసుకెళ్ళింది...