Akhanda 2: బాలయ్య మీద అభిమానం.. అంత దూరం తీసుకెళ్ళింది...
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:29 PM
మచిలీపట్నంకు చెందిన గోల్డ్ ప్రిన్స్ సంస్థ మరో కొత్త విభాగంలోకి అడుగుపెట్టింది. 'అఖండ 2'లో నందమూరి బాలకృష్ణ పోషించిన అఘోర పాత్ర ప్రతిమను అందంగా, ఆకర్షణీయంగా తయారు చేసింది.
పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు, శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ను అభిమానించని వారు అరుదు. అందుకే మచిలీపట్నంకు చెందిన గోల్డ్ ప్రిన్స్ ఫ్యాషన్ జ్యువెలరీ కి అనుబంధం ఉన్న 'శిల్ప సంస్థ' సైతం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'అఖండ 2'లోని అఘోర ప్రతిమను తయారు చేసి, ఆ చిత్ర బృందానికి కానుకగా అందించింది. ఆ రకంగా సినీ రంగంలోనూ ఐకానిక్ క్యారెక్టర్స్ ను ఇమిటేషన్ గోల్డ్ తో పాటు ఇతర లోహాలతో తయారు చేయడానికి శిల్ప సంస్థ శ్రీకారం చుట్టింది.
'అఖండ' సినిమాలో బాలకృష్ణ పోషించిన అఘోర పాత్ర తెలుగు సినిమా రంగంలోనే ఓ మరపురాని, మరువలేని పాత్రగా నిలిచిపోయింది. దాంతో దర్శకుడు బోయపాటి శ్రీను 'అఖండ 2' రూపొందించాలనుకున్నప్పుడు, మరింత పవర్ ఫుల్ గానే కాకుండా దైవత్వాన్ని సైతం ఆ పాత్రకు ఆపాదించారు. 'అఘోర' పాత్రలోని దైవత్యాన్ని గుర్తించిన శిల్ప సంస్థ నిర్వాహకులు తోట సత్య కార్తిక్ దానిని విగ్రహంగా రూపొందించాలనుకున్నారు. అనుకోవడమే కాదు... 'అఖండ 2' సినిమా విడుదల సమయానికి మూడు రకాలతో, వివిధ సైజులలో తయారు చేయించారు. 'అఖండ 2' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఈ ప్రతిమలను నందమూరి బాలకృష్ణతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులకు శిల్ప సంస్థ అధినేత అందచేశారు. నందమూరి బాలకృష్ణ, దర్శకులు బోయపాటి శ్రీను ఆ ప్రతిమను తీర్చిదిద్దిన విధానానికి, దాని రూపకల్పన నైపుణ్యానికి అభినందనలు తెలిపారు.

దశాబ్దాల కాలంగా ఇమిటేషన్ గోల్డ్ రంగంలో మచిలీపట్నం అగ్రగామిగా నిలిచింది. అదే రంగంలోకి కార్మికుడిగా అడుగుపెట్టిన చలమలశెట్టి రాధాకృష్ణమూర్తి (Chalamalasetty Radha Krishna Murthy) అంకిత భావంతో, ఓర్పుతో పనిచేస్తూ దానిపై పట్టు సాధించారు. ఆయన కుమారుడు నరసింహారావు (Narasimharao) తండ్రి నుండి వారసత్వంగా అబ్బిన ధైర్యం, సహనంతో ముందుకు సాగారు. 1997లో గోల్డ్ ప్రిన్స్ ఫ్యాషన్ జ్యువెలరీ ప్రై.లి. (Gold Prince Fashion Jewellery Pvt. Ltd) ను ఏర్పాటు చేసి వ్యాపార రంగాన్ని విస్తరింపచేశారు. వ్యక్తుల అలంకరణలకు పరిమితం కాకుండా దేవీ దేవతా మూర్తులకు ఆభరణాలను రూపొందించడం మొదలు పెట్టారు. నరసింహారావు కుమారుడు శివ రామకృష్ణ (Siva Ramakrishna) సైతం తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యాపార విస్తరణలో కీలక పాత్రను పోషిస్తున్నారు.
తాజాగా చలమలశెట్టి నరసింహారావు అల్లుడు తోట సత్య కార్తీక్ (Thota Satya Karthik) మానస పుత్రికగా శిల్ప (Shilpa) సంస్థ ప్రారంభమైంది. గోల్డ్ ప్రిన్స్... మనుషులను అలంకరించే కళ అయితే... 'శిల్ప' స్థలాలను అలంకరించే కళ! విగ్రహాల తయారీ, గృహాలంకరణ రంగాల్లోకి ఇది అడుగు పెట్టబోతోంది. శాంతికి ప్రతిరూపమైన బుద్ధ విగ్రహం కావచ్చు, విఘ్నాలను తొలగించే గణనాధుని ప్రతిమ కావచ్చు ఇలాంటి వాటిని ఈ సంస్థ రూపొందిస్తుంది.

శిల్ప సంస్థ గురించి తోట సత్య కార్తీక్ చెబుతూ, 'నందమూరి బాలకృష్ణ గారి మీద అభిమానంతో 'అఖండ 2'లోని అఘోర గెటప్ ను విగ్రహంగా మలిచాం. దానికి మంచి గుర్తింపు వచ్చింది. అనేకమంది అభినందించారు. దాంతో మరిన్ని సినిమాల్లోని ఐకానిక్ క్యారెక్టర్స్ ను ప్రతిమలుగా చేయాలని ఉంది. అయితే మా ఆలోచనలు మరింత విస్తృతమైనవి. కేవలం సినిమా ఐడిల్స్ వే కాకుండా నవ భారత నిర్మాతల విగ్రహాలను, ఈ దేశంలో ఆధ్యాత్మిక పరిమణాలను వెదజల్లిన మహానుభావుల ప్రతిమలను సైతం చేయబోతున్నాం. ఈ రంగంలో గోల్డ్ ప్రిన్స్ ఫ్యాషన్ జ్యువెలరీకి అనుబంధమైన శిల్ప సంస్థను అగ్రగామిగా నిలపాలన్నది మా లక్ష్యం' అని అన్నారు.
Also Read: Megastar Chiranjeevi: జోరు పెంచిన చిరు.. ఏకంగా నాలుగు సినిమాలు
Also Read: 2016-2025 Tollywood: ఏ సంవత్సరం ఏది బ్లాక్ బస్టర్...