సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Telugu Film Chamber: అదే కార్యవర్గం... మరోసారి...

ABN, Publish Date - Jul 03 , 2025 | 06:02 PM

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఈ నెలలో జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న సమస్యలను పరిష్కరించే బాధ్యతలను ప్రస్తుతం కార్యవర్గం భుజస్కందాలపైనే ఉంచుతూ ఇటీవల ఓ తీర్మానం చేశారని తెలుస్తోంది.

ఇవాళ తెలుగు సినిమా (Telugu Cinema) రంగం పీకల లోతు సమస్యల్లో ఇరుక్కుపోయి ఉంది. నిర్మాతలకు, స్టార్ హీరోస్ (Star Heroes) కు మధ్య కనిపించని వైరం కొనసాగుతోంది. హీరోలు భారీ రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారే కోపం నిర్మాతలలో ఉన్నా వారు బయటకు గట్టిగా చెప్పుకోలేని పరిస్థితి. అయితే దీన్ని ఎగ్జిబిటర్స్ ఏ మాత్రం దాచి పెట్టడం లేదు. కోట్ల రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్న హీరోల సినిమాలకు ఆ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం లేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతున్నారు. అలానే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కు మధ్య రోజు రోజుకూ గ్యాప్ పెరిగిపోతోంది. డిజిటల్ ప్రొవైడర్స్ ధరలను అదుపులోకి తీసుకు రావాలనే డిమాండ్ కొన్నేళ్ళుగా అలానే ఉండిపోయింది. ఇంతలో ప్రభుత్వాలకు... సినిమా రంగానికి మధ్య కూడా కనిపించని వార్ నడుస్తోంది. ఈ సమస్యలన్నీ కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber) ప్రస్తుత కార్యవర్గానికి ఉపకరించబోతున్నాయి.


ఈ నెలలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గానికి ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న కార్యవర్గాన్నే కొనసాగమని అందులోని నాలుగు సెక్టార్లకు చెందిన సభ్యులు కోరుతున్నారని తెలుస్తోంది. ఇప్పుడున్న సమస్యలను పరిష్కరించాలంటే... ఇప్పటికిప్పుడు కొత్త బాడీని ఎంపిక చేసుకోవడం కంటే... అనుభవం ఉన్న వీరే మరో టర్మ్ కొనసాగితే మంచిదనే అభిప్రాయానికి మెజారిటీ సభ్యులు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఛాంబర్ ప్రెసిడెంట్ గా భరత్ భూషణ్, వైస్ ప్రెసిడెంట్ గా అశోక్ కుమార్, జనరల్ సెక్రటరీగా కె.ఎల్. దామోదర ప్రసాద్, ట్రెజరర్ గా తుమ్మల ప్రసన్న కుమార్ వ్యవహరిస్తున్నారు.

ఇటీవల ఛాంబర్ మెంబర్స్ మీటింగ్ లో 34 మంది సభ్యులు ఇదే కార్యవర్గం కొనసాగాలని కోరుకోగా, నలుగురు మాత్రం అభ్యంతరం వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మొత్తం 48 మంది సభ్యులు ఉండగా, ఆ రోజున 38 మంది హాజరయ్యారు. ఈ సమావేశంలో మెజారిటీ సభ్యుల నిర్ణయాన్ని అమలు చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. దాంతో ప్రస్తుతం ఇదే కమిటీ కొనసాగబోతోందని తెలుస్తోంది. సినిమా రంగంలోని వివిధ శాఖల మధ్య సమస్వయం కల్పించడంతో పాటు ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ లీజ్ గడువు కూడా పూర్తి కావొస్తోంది. కాబట్టి ఇన్ని సమస్యల మధ్య ఎన్నికలు జరిగి... ఈ సమస్యల ముళ్ల కిరీటాన్ని వేరొకరి నెత్తిన పెట్టే కంటే... సమస్యల మూలాలను గుర్తెరిగి వాటిని తామే పరిష్కరించాలనే ప్రస్తుత కార్యవర్గం కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

Also Read: Narivetta OTT: ఓటీటీకి వ‌చ్చేస్తోన్న‌.. టొవినో థామ‌స్ తొడేలు వేట‌! ఎప్ప‌టి నుంచంటే

Also Read: Icon Title: ఇండస్ట్రీలో.. ఐకాన్ లొల్లి

Updated Date - Jul 03 , 2025 | 06:04 PM