Balakrishna - Vijaya Shanthi: 32 ఏళ్ళ తర్వాత మరొక్కసారి... సూపర్ హిట్ జోడీ...
ABN , Publish Date - May 21 , 2025 | 08:26 PM
పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన బాలకృష్ణ, విజయశాంతి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న బాలకృష్ణ 'అఖండ-2' చిత్రంలో విజయశాంతికి కీలక పాత్ర పోషించబోతున్నారట!
నటసింహ నందమూరి బాలకృష్ణ, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జోడీ అప్పట్లో విశేషాదరణ చూరగొంది. వారిద్దరూ నటించిన అనేక చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అలాంటి జోడీ మళ్ళీ ఇన్నాళ్ళకు కలసి నటించబోతున్నారన్న వార్త విశేషంగా వినిపిస్తోంది. దాంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. ఎందుకంటే బాలయ్య, విజయశాంతి దాదాపు 32 ఏళ్ళ క్రితం 'నిప్పురవ్వ'లో చివరిసారిగా కలసి కనిపించారు.
ఇద్దరి జోడీ... ఓ స్పెషల్!
బాలకృష్ణ ఎంతమంది హీరోయిన్స్ తో నటించినా, విజయశాంతి ఎందరు హీరోలతో జోడీ కట్టినా, వారిద్దరి జంటనే ఓ ప్రత్యేకం అని చెప్పాలి. బాలయ్య సరసన అత్యధిక విజయాలు చూసిన నాయికగా విజయశాంతి నిలిచారు. అలాగే విజయశాంతికి రెండు గోల్డెన్ జూబ్లీస్ అందించిన హీరోగా బాలయ్య జైత్రయాత్ర చేశారు. వారిద్దరి తొలి చిత్రం 'కథానాయకుడు' సిల్వర్ జూబ్లీ చూసింది. ఇక వారిద్దరి జోడీతో రూపొందిన 'ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మావయ్య' సినిమాలు గోల్డెన్ జూబ్లీ జరుపుకున్నాయి. బాలయ్య తొలిసారి డ్యుయల్ రోల్ లో కనిపించిన 'అపూర్వ సహోదరులు'లోనూ విజయశాంతి ఓ నాయిక. బాలకృష్ణ తొలి పొంగల్ మూవీ 'భార్గవరాముడు'లోనూ విజయశాంతియే హీరోయిన్. ఇలా చెప్పుకుంటూ పోతే డజన్ కు పైగా హిట్ మూవీస్ లో బాలయ్య, విజయశాంతి అలరించారని చెప్పాలి. 1984లో వచ్చిన 'కథానాయకుడు' మొదలు 1993లో వెలుగు చూసిన 'నిప్పురవ్వ' దాకా బాలయ్య, విజయశాంతి కలసి 16 చిత్రాలలో నటించారు. వారిద్దరి కాంబోలో వచ్చిన "కథానాయకుడు, పట్టాభిషేకం, ముద్దుల క్రిష్ణయ్య, దేశోద్ధారకుడు, అపూర్వ సహోదరులు, భార్గవరాముడు, మువ్వగోపాలుడు, భానుమతిగారి మొగుడు ఇన్ స్పెక్టర్ ప్రతాప్, భలేదొంగ, ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్, తల్లిదండ్రులు, రౌడీ ఇన్ స్పెక్టర్" చిత్రాలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఇక "సాహస సామ్రాట్, ముద్దుల మేనల్లుడు" అంతగా అలరించలేక పోయాయి. అలా ఈ హిట్ పెయిర్ అభిమానులకు ఓ స్పెషల్! అలాంటి జోడీ మళ్ళీ కలసి ఓ సినిమాలో కనిపించనుందంటే ఫ్యాన్స్ కు పండగే!
'అఖండ-2'లోనే బాలయ్య - విజయశాంతి
ఇంతకూ బాలకృష్ణతో విజయశాంతి మరోమారు నటించబోయే సినిమా ఏదంటే ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న 'అఖండ-2'. అసలే బాలకృష్ణకు అచ్చివచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇప్పటికే బాలయ్యతో వరుస హిట్స్ తో హ్యాట్రిక్ చూశాడు బోయపాటి. సూపర్ హిట్ 'అఖండ'కు సీక్వెల్ గా రూపొందుతోన్న 'అఖండ-2'లో ఓ కీలక పాత్రలో విజయశాంతి కనిపించనున్నారని విశేషంగా వినిపిస్తోంది. అదే నిజమైతే ఫ్యాన్స్ కు లభించే కిక్కే వేరని చెప్పక తప్పదు.
పొలిటికల్ కలర్...
బాలయ్య కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా 'అఖండ-2' తెరకెక్కుతోంది. అలాగే ఇది డైరెక్టర్ బోయపాటికి తొలి సీక్వెల్ సినిమా. 'అఖండ' సాధించిన ఘనవిజయంతో ఈ రెండో భాగంపైనా భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటతో కలసి బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మిస్తున్నారు. ఇలా పలు విధాల క్రేజీ ప్రాజెక్ట్ గా వస్తోన్న 'అఖండ-2'లో విజయశాంతి నటిస్తే మరింత క్రేజ్ లభిస్తుందని అభిమానుల అభిలాష. ఇప్పటి దాకా అయితే మేకర్స్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు కానీ, 'అఖండ-2'లో విజయశాంతి నటిస్తోందని విశేషంగా వినిపిస్తోంది. బాలయ్య, విజయశాంతి ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. బాలయ్య తెలుగుదేశం ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి- కాబట్టి ఈ కాంబోకు పొలిటికల్ కలర్ తోనూ ఓ స్పెషల్ క్రేజ్ లభిస్తుంది. మరి 'అఖండ-2'లో బాలయ్య, విజయశాంతి కలసి కనిపిస్తారా? అదే ఫ్యాన్స్ లో తలెత్తిన మిలియన్ డాలర్స్ క్వశ్చన్!. బాలయ్య, విజయశాంతి జోడీని మళ్ళీ చూడాలనే అభిమానులు ఆశిస్తున్నారు. ఏమవుతుందో చూద్దాం.