Salman Khan: తెలుగు జవాన్.. బయోపిక్‌లో సల్మాన్ ఖాన్!
ABN , Publish Date - May 20 , 2025 | 06:08 PM
వరుస డిజాస్టర్ల తర్వాత సల్మాన్ ఖాన్ తాజాగా ఓ ఆసక్తికరమైన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు యావత్ దేశంలో హాట్ టాపిక్ అయింది.
వరుస డిజాస్టర్ల తర్వాత సల్మాన్ ఖాన్ (Salman Khan) కెరీరర్ తిరోగమనంలో పడింది. షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, కుర్ర హీరోలు వరుస హిట్లతో దూసుకుపోతుండడంతో తన ఉనికిని చాటుకోవడానికి భారీ విజయం అత్యవసరం అయింది. ఈక్రమంలో సల్మాన్ ఓ ఆసక్తికరమైన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు యావత్ దేశంలో హాట్ టాపిక్ అయింది. ఈ పనేదే ముందు నుంచి చేస్తే ఇన్ని పరాజయాలు వచ్చి ఉండేవి కాదు కదా అంటూ అంటున్నారు. ఇంతకు ఆ ప్రాజెక్టు ఏంటంటే 2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనిక ఘర్షణలో వీరమరణం సాధించిన తెలంగాణ సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు (Colonel Bikkumalla Santosh Babu) బయోపిక్‌లో నటించేందుకు సిద్దమయ్యాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అపూర్వ లఖియా (Apoorva Lakhia) దర్శకత్వం వహిస్తోండగా జులై నుంచి ముంబై, లడఖ్‌లలో షూటింగ్ జరుగనుంది.
అయితే.. కల్నల్ సంతోష్ బాబు ధైర్యం మరియు త్యాగం సల్మాన్ ఖాన్ ఎంతగానో ఆకర్షించాయని, ఈ పాత్ర కోసం ఆయన ఇప్పటికే శారీరక శిక్షణ మరియు సైనిక తయారీని ప్రారంభించారని సమాచారం. శివ అరూర్, రాహుల్ సింగ్‌లు రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ 3” అనే పుస్తకంలోని ఒక అధ్యాయం ఆధారంగా ఈ చిత్రాన్ని యాక్షన్ డ్రామా, దేశభక్తి మరియు భావోద్వేగాల సమ్మేళనంగా ఇటీవల వచ్చిన అమరన్ సినిమా తరహాలో తెరకెక్కించనున్నారు. సురేష్ నాయర్, చింతన్ గాంధీ, మరియు చింతన్ షా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే మరియు సంభాషణలు అందిస్తుండగా. సల్మాన్ ఖాన్‌తో పాటు ముగ్గురు యువ నటులు కీలక పాత్రల్లో నటించనున్నారు. 70 రోజుల షూటింగ్ షెడ్యూల్‌తో, ఈ చిత్రం గల్వాన్ లోయ యుద్ధాన్ని యథాతథంగా చిత్రీకరించడంతో పాటు, కల్నల్ సంతోష్ బాబు జీవితంలోని కీలక విశేషాలను సైతం పొందుపర్చనున్నారు. ఈ చిత్రం 2026లో విడుదల అయ్యే అవకాశం ఉంది.
కల్నల్ సంతోష్ బాబు కథ ఇది..
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో 1983 ఫిబ్రవరి 13న జన్మించిన సంతోష్ బాబు (Colonel Bikkumalla Santosh Babu) కు బాల్యం నుంచే ఎలాగైనా మిలటరీలో చేరాలనే కాంక్ష బలంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కొరుకొండ సైనిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసిన ఆయన, ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), ఇండియన్ మిలటరీ అకాడమీ (IMA)లో శిక్షణ పొందారు. 2004లో 16 బీహార్ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్‌గా కమిషన్ పొందిన ఆయన, తన 16 ఏళ్ల సైనిక జీవితంలో అనేక ఆపరేషన్లలో పాల్గొన్నారు. 2020 జూన్‌లో, గల్వాన్ లోయలో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు 16 బీహార్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించారు.
చైనా సైనికులు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వద్ద అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించేందుకు ప్రయత్నించినప్పుడు, సంతోష్ బాబు ధైర్యంగా ముందుండి నడిపించారు. సంఖ్యా పరంగా వారు అక్కడతక్కువగా ఉన్నప్పటికీ, ఆయన నాయకత్వంలో భారత సైనికులు భారీ సంఖ్యలో ఉన్న శత్రువులను ఎదుర్కొన్నారు. ఈ ఘర్షణలో తీవ్ర గాయాల పాలైనప్పటికీ, ఆయన చివరి శ్వాస వరకు పోరాడి, దేశం కోసం తన ప్రాణాలను అర్పించారు. ఆయన ధైర్యానికి గుర్తుగా, భారత ప్రభుత్వం ఆయనకు మహావీర చక్ర అవార్డును సైతం ప్రదానం చేసింది. ఇప్పుడు కల్నల్ సంతోష్ బాబు కథను సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ సూపర్‌స్టార్ తెరపై చూపించడం తెలుగు ప్రజలకు గర్వకారణమే కాక. ఈ చిత్రం ద్వారా ఆయన ధైర్యం మరియు దేశభక్తి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.