Star Kids: వారసత్వం వద్దు.. సొంత టాలెంట్ ముద్దు
ABN , Publish Date - Nov 01 , 2025 | 09:01 PM
తాము అభిమానించే స్టార్స్ కు వారసులు పుట్టగానే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. తరువాతి రోజుల్లో ఆ వారసులే తమను అలరిస్తారని వారి నమ్మకం. అయితే ఈ తరం స్టార్స్ తనయులు మాత్రం వేరే తీరున సాగుతున్నారు.
Star Kids: తాము అభిమానించే స్టార్స్ కు వారసులు పుట్టగానే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. తరువాతి రోజుల్లో ఆ వారసులే తమను అలరిస్తారని వారి నమ్మకం. అయితే ఈ తరం స్టార్స్ తనయులు మాత్రం వేరే తీరున సాగుతున్నారు. తండ్రులు చూపిన అభినయపర్వంలో కాకుండా తమకు నచ్చిన వేరే అధ్యాయాలను వారు వెదుక్కుంటూ ఉండడం విశేషంగా మారింది. అలా సాగుతున్న వారిలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనయుడు అకీరా నందన్ (Akira Nandan) ను ముందుగా చెప్పుకోవాలి. తండ్రి టాలీవుడ్ లో టాప్ స్టార్ - ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం.. అంతటి స్టార్ డమ్ ఉన్న పవన్ వారసుడు ఎప్పడెప్పుడు ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెడతాడా అని ఎదురు చూస్తుంటే అకీరా నందన్ మాత్రం తనకు ఇష్టమైన సంగీతాన్ని ఎంచుకొని కంపోజర్ గా మారాడట. కార్తిక్ యార్లగడ్డ రూపొందించిన 'రైటర్స్ బ్లాక్' అనే షార్ట్ ఫిలిమ్ కు అకీరా నందన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. తమకు భిన్నంగా వ్యవహరిస్తున్న అకీరా అభిరుచిని కన్నవారు సైతం అభినందించి ప్రోత్సహించడం విశేషమనే చెప్పాలి.
పవన్ తనయుడు అకీరా ఒక్కరే సంగీతాన్ని ఎంచుకున్నాడు. కానీ, షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, విజయ్ కొడుకు జాసన్ సంజయ్, రవితేజ అబ్బాయి మహాధన్ భూపతిరాజు మాత్రం దర్శకత్వ శాఖపై ఆసక్తి చూపించడం విశేషం. షారుఖ్ తనయుడు ఆర్యన్ ఇప్పటికే 'ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'అనే కామెడీ సెటైరికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కించాడు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లో ఉన్న ఈ సీరీస్ తొలి సీజన్ లో ఏడు ఎపిసోడ్స్ ఉన్నాయి. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సీరీస్ సెకండ్ సీజన్ కోసం అందరూ ఎదరు చూస్తున్నారు.
తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ కూడా డైరెక్షన్ పైనే మక్కువ పెంచుకున్నాడు. తన తండ్రి నటించిన కొన్ని సినిమా షూటింగ్స్ ప్రత్యక్షంగా చూసి, మూవీ ఆర్ట్ ను అభ్యసించిన జాసన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో మన తెలుగు హీరో సందీప్ కిషన్ కథానాయకుడు కావడం విశేషం. ఇక పలు మాస్ మసాలా మూవీస్ తో జనాన్ని అలరించిన రవితేజ తనయుడు మహాధన్ కూడా తండ్రిలా నటనలో అడుగు పెట్టకుండా దర్శకత్వంపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఒకప్పుడు రవితేజ కూడా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన విషయం తెలిసిందే! ఇక ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా రూపొందించనున్న 'స్పిరిట్' మూవీకి మహాధన్ డైరెక్షన్ విభాగంలో పనిచేస్తూ ఉండడం విశేషం. మరి టాప్ స్టార్స్ గా సాగుతోన్న తండ్రుల బాటను వీడి మా రూటే సపరేటూ అంటూ వేరేమార్గం ఎంచుకున్న ఈ స్టార్ కిడ్స్ తమ అభిరుచితో ఏ తీరున అలరిస్తారో చూడాలి.
Lokesh Kanagaraj: హీరోగా మారిన కూలీ డైరెక్టర్.. టైటిల్ ఏంటో తెలుసా
Sudigali Sudheer: ఆగిన గోట్.. మళ్లీ మొదలైంది