Chiranjeevi: మరోసారి చేతులెత్తేసిన 'స్టాలిన్'
ABN, Publish Date - Aug 23 , 2025 | 02:18 PM
చిరంజీవి బర్త్ డే కానుకగా రీ-రిలీజ్ అయిన 'స్టాలిన్' తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందని అంతా భావించారు. కానీ అందుకు పూర్తి భిన్నమైన ఫలితం 'స్టాలిన్'కు దక్కింది.
స్టార్ హీరోల సినిమాలు రీ-రిలీజ్ కావడం ఇప్పుడు కొత్తేమీ కాదు. చిత్రం ఏమంటే చిన్న హీరోలు నటించిన కొన్ని ల్యాండ్ మార్క్ మూవీస్ కూడా ఇలా రీ-రిలీజ్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక హీరోల బర్త్ డే కానుకగా పాత సినిమాలు విడుదల కావడం కూడా ఇప్పుడు కామన్ అయిపోయింది. చిరంజీవి నటించిన 'భోళాశంకర్' విడుదలై చాలా కాలం కావడంతో... ఆయన బర్త్ డే కానుకగా రీ-రిలీజ్ అయిన 'స్టాలిన్' తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందని అంతా భావించారు. కానీ అందుకు పూర్తి భిన్నమైన ఫలితం 'స్టాలిన్'కు దక్కింది.
తమిళ దర్శకుడు మురుగదాస్ రూపొందించిన 'స్టాలిన్' 2006లో వచ్చింది. అందులో చిరంజీవి సరసన త్రిషా నాయికగా నటించింది. అప్పట్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. అయితే మురుగదాస్ ఎంచుకున్న పాయింట్ కాస్తంత భిన్నంగా ఉండటంతోనూ, పాటలు బాగుండటంతోనే అలా అలా ఆడింది. ఇప్పుడా సినిమాను రీ-రిలీజ్ చేస్తే జనాలకు ఎక్కుతుందని నిర్మాతలు అనుకున్నారు. దాంతో చిరంజీవి బర్త్ డే కానుకగా దీనిని విడుదల చేశారు. 4కెలో వచ్చిన 'స్టాలిన్' బుకింగ్స్ ను ఓపెన్ చేసినప్పుడే చాలా పేలవమైన స్పందన లభించింది. చాలా చోట్ల తగినంత మంది ప్రేక్షకులు లేక షోస్ కాన్సిల్ కూడా చేశారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
చిరంజీవి బర్త్ డే సందర్భంగా మరోసారి విడుదలైన 'స్టాలిన్' పరిస్థితే ఇలా ఉంటే... వచ్చే వారం నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 29న రాబోతున్న 'రగడ' పరిస్థితి ఎలా ఉంటుందో అని కొందరు ఇప్పటి నుండే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 'స్టాలిన్' మాదిరిగానే 'రగడ' కూడా మొదటిసారి విడుదలైనప్పుడు ఏమంత విజయాన్ని అందుకోలేదు. నిజానికి సీనియర్ స్టార్ హీరోల సినిమాలు రీ-రిలీజ్ సమయంలో ఎలాంటి ఆదరణకూ నోచుకోవడం లేదని బయ్యర్లు చెబుతున్నారు. బాలకృష్ణ 'భైరవ ద్వీపం' మూవీని భారీ ప్రచారంతో రీ-రిలీజ్ చేసినా... నష్టమే వచ్చిందని అంటున్నారు. మరి ఈ చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని స్టార్ హీరోలు రీ-రిలీజ్ సంప్రదాయానికి స్వస్తిపలుకుతారేమో చూడాలి.
Also Read: Little Hearts: అనుకున్న రోజుకంటే ముందే...
Also Read: Haiwaan: అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ 'హైవాన్' షురూ