Srikantha Addala: కిరణ్ అబ్బవరం మూవీ డైరెక్టర్ మారిపోయాడా...
ABN, Publish Date - Oct 07 , 2025 | 03:39 PM
ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం 'కూచిపూడి వారి వీధి' పేరుతో ఓ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. దీనిని కిరణ్ అబ్బవరంతో ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారని తెలిసింది. అయితే శ్రీకాంత్ అడ్డాల రెమ్యూనరేషన్ భరించలేక తన ప్రయత్నాన్ని ధీరజ్ విరమించుకున్నారన్నది తాజా సమాచారం.
తొలి చిత్రం 'కొత్త బంగారు లోకం' (Kotta Bangaru Lokam) తో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala). మలి చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' (Seethamma Vaakitlo Siri Malle Chettu) తో స్టార్ హీరోలను సైతం అతను హ్యాండిల్ చేయగలడనిపించుకున్నాడు. ఇక అతను దర్శకత్వం వహించిన 'ముకుంద' (Mukunda) తోనే వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన 'బ్రహ్మోత్సవం' పరాజయంతో శ్రీకాంత్ అడ్డాల ఫేట్ తిరగబడింది. ఆ తర్వాత మూవీ చేయడానికి ఏకంగా ఐదేళ్ళు పట్టింది. వెంకటేశ్ తో శ్రీకాంత్ అడ్డాల రీ-మేక్ చేసిన 'అసురన్' మూవీ 'నారప్ప'గా ఓటీటీలో వచ్చింది. ఆపైన రెండేళ్ళకు 'పెద్ద కాపు 1' సినిమాను తీశాడు శ్రీకాంత్ అడ్డాల. చిత్రం ఏమంటే... ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు సినిమాను సెట్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది.
శ్రీకాంత్ అడ్డాల భారీ స్థాయిలో రూపొందించిన 'పెద్ద కాపు -1' మూవీని ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఆయన బావమరిది విరాట్ కర్ణ ఈ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. కుల రాజకీయాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇక దీని రెండో భాగం అనే ఊసే లేకుండా పోయింది. అయితే... శ్రీకాంత్ అడ్డాల మాత్రం ఖాళీగా ఉండకుండా 'కూచిపూడి వారి వీధి' పేరుతో ఓ కథను రెడీ చేసుకున్నాడు. తనదైన మార్క్ సెంటిమెంట్ కు ఇందులో పెద్ద పీట వేశాడట. స్క్రిప్ట్ బాగుండటంతో ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ఈ సినిమా తీయడానికి ముందుకొచ్చారని సమాచారం. శ్రీకాంత్ అడ్డాలకు వెంకటేశ్ (Venkatesh) తో ఉన్న అనుబంధం కారణంగా ఈ కథను తీయడానికి రానా (Rana) కూడా ఆసక్తి చూపిస్తున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా ఈ మూవీ చేయడానికి యువ నిర్మాత ధీరజ్ మొగలినేని ముందుకు వచ్చాడని సమాచారం. హీరో, ప్రొడ్యూసర్ దొరికేయడంతో శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను సైతం వేగవంతం చేశారట. అయితే ఇక్కడో ఒక చిక్కొచ్చిపడిందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం శ్రీకాంత్ అడ్డాల పాతిక కోట్ల బడ్జెట్ ను కోరుతున్నాడట. అంత పెట్టడానికి నిర్మాత రెడీగా ఉన్నా... వేరే కారణంతో అతను వెనుకడుగు వేశాడని అంటున్నారు. శ్రీకాంత్ అడ్డాల తనకు ఐదు కోట్ల పారితోషికం ఇవ్వాలని అన్నాడని, 'పెద్ద కాపు'కు కూడా అంతే తీసుకున్నానని చెప్పాడని నిర్మాత సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే నిర్మాతగా నిలదొక్కుకుంటున్న ధీరజ్ మొగిలినేని... శ్రీకాంత్ అడ్డాలకు అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేక చేతులెత్తేశాడట. పైగా ఒకసారి సినిమా మొదలైన తర్వాత అది పాతిక కోట్ల దగ్గర ఆగుతుందనే గ్యారంటీ కూడా లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నే ధీరజ్ పక్కన పెట్టేశాడని తెలుస్తోంది. అయితే... కిరణ్ అబ్బవరంతో మాత్రం ధీరజ్ కు గుడ్ రిలేషనే ఉందని, వేరే దర్శకుడితో, వేరే కథను చేద్దామని వీరిద్దరూ అనుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఏ మాత్రం మార్కెట్ లేని శ్రీకాంత్ అడ్డాల... కాస్తంత పట్టూ విడుపులతో ముందుకు సాగాలి కానీ రెమ్యూనరేషన్ విషయంలో అలా పట్టుపట్టడం కరెక్ట్ కాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి కిరణ్ అబ్బవరం, ధీరజ్ మొగలినేని ప్రాజెక్ట్ ఎవరి చేతుల్లోకి వెళుతుందో చూడాలి.
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నటించిన 'కె-ర్యాంప్' సినిమా ఈ నెల 31న దీపావళి కానుకగా రాబోతోంది. అలానే 'చెన్నయ్ లవ్ స్టోరీ' మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. మరి కిరణ్ అబ్బవరం, ధీరజ్ మొగిలినేని సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.
Also Read: Tollywood: పూజా హెగ్డే డిమాండ్ కు తలొగ్గిన నిర్మాత...
Also Read: Jr NTR: ఆగిన దాదా సాహేబ్ ఫాల్కే బయోపిక్...