Gautam Krishna: సోలో బాయ్ వచ్చేది ఎప్పుడంటే...
ABN, Publish Date - Jun 06 , 2025 | 04:44 PM
బిగ్ బాస్ 7 ఫేమ్ గౌతమ్ కృష్ణ తాజా చిత్రం 'సోలో బాయ్'. పేరుకు 'సోలో బాయ్' అయినా... జూలై 4న బాక్సాఫీస్ బరిలో పలు చిత్రాలతో ఇది పోటీ పడబోతోంది.
బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతమ్ కృష్ణ (Gautam Krishna) ఇప్పటికే పలు సీరియల్స్ లోనూ, సినిమాల్లోనూ కీలక పాత్రలను పోషిస్తున్నాడు. ప్రస్తుతం అతను 'సోలో బాయ్' (Solo Boy) పేరుతో ఓ సినిమాలో నటిస్తున్నాడు. శ్వేతా అవాస్తి (Shweta Awasthi), రమ్య పసుపులేటి (Ramya Pasupuleti) ఇందులో లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను సెవెన్ హిల్స్ సతీశ్ నిర్మిస్తున్నారు. పి. నవీన్ కుమార్ దీనికి దర్శకుడు. ఆట ఫేమ్ సందీప్ (Aata Sandeep) ఈ మూవీకి కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.
'సోలో బాయ్' మూవీ నిర్మాత సతీశ్ మాట్లాడుతూ, 'కొవిడ్ టైంలో నేను 'బట్టల రామస్వామి బయోపిక్' (Battala Ramaswamy biopic) అనే సినిమా తీశాను. అప్పుడున్న పరిస్థితుల్లో దానిని ఓటిటి ద్వారా ప్రజలకు చేరవేశాం. తర్వాత ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్న టైం లో ఈ కథ నచ్చి మీ ముందుకు తీసుకుని వచ్చాం. ఈ జెనరేషన్ ఆడియెన్స్ చూడాల్సిన సినిమా ఇది. మా హీరో గౌతమ్ కృష్ణ 'సోలో బాయ్'గా మీ ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీని జూలై 4న విడుదల చేస్తున్నాం. ఈ సినిమా చూసి బయటకు వచ్చేప్పుడు కనీసం పది నిమిషాలు దీని గురించి తప్పకుండా ఆలోచిస్తారు' అని అన్నారు.
హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ, 'గతంలో 'ఆకాశవీధిలో' సినిమాలో నటించినప్పుడు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మరి కొన్ని చిత్రాలలో నటించాను. ఇప్పుడీ 'సోలో బాయ్'తో నాకు సక్సెస్ కూడా దక్కుతుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు. పోసాని కృష్ణమురళి, అనిత చౌదరి, షఫీ, ఆర్ కే మామ, భద్రం, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
అయితే జూలై 4వ తేదీని ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల కావడానికి సిద్థంగా ఉన్నాయి. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న 'కింగ్ డమ్' (kingdom) మూవీ జూలై 4నే వస్తోంది. అలానే నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న 'తమ్ముడు' (Thammudu) మూవీనీ మే జూలై 4న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. అలానే సిద్థార్థ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం '3 బి.హిచ్.కె.' (3 BHK) సైతం అదే తారీఖున విడుదల కానుంది. సో... సినిమా పేరుకు 'సోలో బాయ్' అయినా... గట్టి కాంపిటీషన్ మధ్యే గౌతమ్ కృష్ణ సినిమా రాబోతోంది.
Also Read: Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు వాయిదా.. అధికారికంగా ప్రకటించిన టీమ్
Also Read: NTR to Jr Ntr : డాన్ పాత్రలతో అలరించిన నందమూరి కుటుంబం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి