NTR to Jr Ntr : డాన్ పాత్రలతో అలరించిన నందమూరి కుటుంబం

ABN , Publish Date - Jun 06 , 2025 | 02:21 PM

హీరోల సెంటిమెంట్స్ ఎలా ఉంటాయో కానీ, అభిమానుల మనోభావాలు భలేగా సాగుతుంటాయి. యంగ్ టైగర్ యన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ మూవీ చుట్టూ ఓ సెంటిమెంట్ చక్కర్లు కొడుతోంది. ఆ ముచ్చటేంటో చూద్దాం.

యన్టీఆర్ (NTR) హీరోగా ప్రశాంత్ నీల్ (Prasanth Neel) డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న చిత్రానికి 'డ్రాగన్' (Dragon) అన్న టైటిల్ వినిపిస్తోంది. కానీ, దీన్ని అధికారికంగా యూనిట్ మెంబర్స్ ఎవరూ ధ్రువీకరించలేదు. జూనియర్ యన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో యంగ్ టైగర్ పోషించే పాత్రకు చైనీస్ గ్యాంగ్ స్టర్ జావో వెయ్ కథ ఆధారమని తెలుస్తోంది. అలా యన్టీఆర్ ఇందులో డాన్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇంతకు ముందు 'బాద్ షా', (Baadshah) 'జై లవకుశ' (Jai Lava Kusa) చిత్రాల్లో యంగ్ టైగర్ డాన్ గా కనిపించి అలరించారు. అయితే ఆ రెండు సినిమాలు వసూళ్ళు చూశాయే కానీ, అభిమానులకు అంతగా ఆనందం పంచలేదు. తరువాత డాన్ ను పోలిన పాత్రలోనే 'జనతా గ్యారేజ్' (Janatha Garage) లో కనిపించి ఆకట్టుకున్నారు జూనియర్. దీంతో రాబోయే 'డ్రాగన్' ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.


నందమూరి నటవంశంలో 'డాన్' (Don) పాత్రలు అచ్చివస్తాయనీ ఫ్యాన్స్ గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నటరత్న యన్టీఆర్ డాన్ గా కనిపించిన 'భలే తమ్ముడు' (Bhale Tammudu) మ్యూజికల్ హిట్ గా నిలవడమే కాదు - అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. తరువాత ఆయన డాన్ రోల్ లో నటించిన 'మగాడు' (Magadu) అంతగా అలరించలేకపోయింది. తరువాత ఆయన డాన్ గా నటించిన 'యుగంధర్' (Yugandhar) వసూళ్ళ వర్షం కురిపించింది. ఇక రామారావు డాన్ గా 'గజదొంగ' (Gajadonga) లోనూ అభినయించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. అదే తీరున యంగ్ టైగర్ మూవీ 'డ్రాగన్' కూడా గత చిత్రాలకన్నా మిన్నగా మురిపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

నందమూరి నటవంశంలో నటరత్న యన్టీఆరే కాదు, ఆయన నటవారసుడు బాలకృష్ణ సైతం కొన్ని చిత్రాలలో డాన్ పాత్రల్లో కనిపించి మురిపించారు. బాలయ్య అలా తొలిసారి 'యువరత్న రాణా' (Yuvarath Rana) లో డాన్ లా అలరించారు. కంటిచూపుతో శాసించే డాన్ గా 'లెజెండ్' (Legend) లోనూ బాలయ్య నటించి మెప్పించారు. ఈ సినిమా వెయ్యిరోజులకు పైగా ప్రదర్శితమై చెరిగిపోని రికార్డ్ నెలకొల్పింది. అందువల్ల జూనియర్ యన్టీఆర్ నటిస్తోన్న 'డ్రాగన్' సైతం డాన్ పాత్రతో అలరిస్తుందనే అభిమానులు బల్లగుద్ది చెబుతున్నారు. 2026 జనవరిలో విడుదల కానున్న యన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.

Also Read: Priyamani: బన్నీ సినిమాలో ప్రియమణి.. 

Also Read: Vishal: మ‌ళ్లీ మూడేళ్లు మేమే ఉంటాం.. లేకుంటే ఆ ప‌నులు జ‌రుగవు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 06 , 2025 | 03:05 PM