HariHara Veeramallu: హరిహర వీరమల్లు వాయిదా.. అధికారికంగా ప్రకటించిన టీమ్
ABN , Publish Date - Jun 06 , 2025 | 03:22 PM
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ ఎదురైంది. హరిహర వీరమల్లు(HariHara Veeramallu) ఈసారి కూడా వాయిదా పడిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
HariHara Veeramallu: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ ఎదురైంది. హరిహర వీరమల్లు(HariHara Veeramallu) ఈసారి కూడా వాయిదా పడిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గత ఐదేళ్లుగా ఈ సినిమా రిలీజ్ కు నోచుకోవడం లేదు. ఎప్పుడు రిలీజ్ డేట్ అనుకున్నా.. ఆ సమయం వచ్చేసరికి ఏదో ఒక కారణం వలన వాయిదా పడుతూనే వస్తుంది. చివరిసారి మే నుంచి వాయిదా పడి జూన్ 12 కి వచ్చింది. నిర్మాత ఏఎం రత్నం ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాడు. కానీ, చివరి నిమిషంలో హరిహర వీరమల్లు వాయిదా పడినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై నిర్మాతలు క్లారిటీ ఇస్తూ ప్రకటన విడుదల చేశారు.
" అచంచలమైన ఓపిక మరియు నమ్మకంతో 'హరి హర వీరమల్లు' సినిమాకు తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు సినీ ప్రేమికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. గతంలో ప్రకటించిన జూన్ 12వ తేదీకి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నాము. అయినప్పటికీ ఆ తేదీకి చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని తెలియజేస్తున్నాము.
కష్టమైనయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలనేదే మా ప్రయత్నం. ప్రతి ఫ్రేమ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాము. అందుకే మేము మరి కొంత సమయం తీసుకుంటున్నాము. మీ ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాము.
మరోవైపు, సామాజిక మాధ్యమాల్లో 'హరి హర వీరమల్లు' చిత్రం గురించి తప్పుడు వార్తలు ప్రచారమవ్వడం మేము గమనించాము. చాలామంది తమకు తోచినది రాసేస్తున్నారు. ధృవీకరించని వార్తలను నమ్మవద్దని, వాటిని వ్యాప్తి చేయవద్దని మేము ప్రతి ఒక్కరినీ కోరుతున్నాము. దయచేసి మా అధికారిక హ్యాండిల్స్ ద్వారా మాత్రమే సినిమాకి సంబంధించిన అప్డేట్ల కోసం వేచి ఉండండి. అప్పటి వరకు, ఎటువంటి ప్రచారాలను నిజమని భావించకండి" అని చెప్పుకొచ్చింది.
త్వరలోనే హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ చేస్తామని, దాంతో పాటు కొత్త రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తామని తెలిపారు. జూన్ 12 న వీరమల్లు రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.