Mirai: శ్రియాకు అచ్చివచ్చిన సెప్టెంబర్...
ABN , Publish Date - Sep 08 , 2025 | 06:19 PM
ఈ నెల 12న రాబోతున్న 'మిరాయ్' సినిమాలో శ్రియా శరణ్... హీరో తేజ సజ్జా తల్లి పాత్రను పోషిస్తోంది. గతంలో ఆమె నటించగా సెప్టెంబర్ మాసంలో విడుదలై సినిమాలు ఘన విజయం సాధించిన నేపథ్యంలో అదే సెంటిమెంట్ ఈ సినిమాకూ వర్తిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
వివాహం విద్య నాశాయ అని గతంలో చెప్పుకునే వాళ్ళు. అలానే హీరోయిన్ల విషయంలోనూ పెళ్ళికి కెరీర్ కు లింక్ చేస్తుంటారు మనవాళ్ళు. చిత్రం ఏమంటే... చాలామంది హీరోయిన్లు పెళ్ళి అయిన తర్వాత కూడా హాయిగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే గతంలో మాదిరి కొందరు గ్లామర్ ట్రీట్ మాత్రం చేయడం లేదు. పద్థతి గల పాత్రలను ఎంపిక చేసుకుని సినిమాలలో నటిస్తున్నారు. నటి శ్రియా శరణ్ కూడా ఆ కోవకే చెందింది. 2018లో వివాహం చేసుకున్న శ్రియా ఇప్పుడు ఓ చిన్నారికి తల్లి కూడా. పిల్ల ఆలనాపాలనా చూసుకుంటూనే... శ్రియా తనకొచ్చిన ఆఫర్స్ ను ఆచితూచి అంగీకరిస్తోంది. ఆ మధ్య 'ట్రిపుల్ ఆర్'లో అజయ్ దేవ్ గన్ సరసన నటించిందామె. ఆ తర్వాత రెండేళ్ళ క్రితం కన్నడ చిత్రం 'కబ్జా'తో పాటు, తెలుగు సినిమా 'మ్యూజిక్ స్కూల్'లో యాక్ట్ చేసింది. అయితే ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఆడలేదు. ఇప్పుడు శ్రియా శరణ్ నటించి మరో తెలుగు సినిమా 'మిరాయ్' ఈ నెల 12న రాబోతోంది.
'మిరాయ్' సినిమాలో శ్రియా హీరో తేజ సజ్జా తల్లిగా నటించింది. అప్పట్లో శ్రియా నటించిన 'బాలు' సినిమాలోనూ, 'ఠాగూర్'లోనూ, 'ఛత్రపతి' మూవీలోనూ తేజ సజ్జా బాలనటుడిగా చేశాడు. ఇప్పుడు అతను హీరో అయిన తర్వాత ఆమె అతనికి తల్లిగా నటించడం విశేషమే. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు 'మిరాయ్'లో శ్రియాది చాలా కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. ఆ మధ్య జరిగిన మీడియా సమావేశంలోనూ శ్రియా పాల్గొని, తాను పోషించిన పాత్ర గురించి, సినిమా గురించి చాలా గొప్పగా చెప్పింది. ఆ రకంగా చూసినప్పుడు ఈ సినిమా విడుదల తర్వాత శ్రియాకు మరికొన్ని ఆఫర్స్ వస్తాయని అనిపిస్తోంది. ఇంకో విశేషం ఏమంటే... శ్రియాకు సెప్టెంబర్ మాసం మొదటి నుండి బాగా కలిసొచ్చింది. ఆమె నటించిన 'చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, ఛత్రపతి' సినిమాలు సెప్టెంబర్ నెలలోనే జనం ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. సో... పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న 'మిరాయ్' కూడా ఆమెకు గ్రాండ్ సక్సెస్ ను ఇస్తుందేమో చూద్దాం.
Also Read: Teja Sajja: అన్నీ కష్టాలే.. ఓ పెద్ద వ్యక్తే నమ్మించి మోసం చేశాడు..
Also Read: Manchu Family: అప్పుడు అక్క... ఇప్పుడు తమ్ముడు...