Senior Stars: సీనియర్స్ రొమాన్స్ ఎబ్బెటగ్గా ఉంటోందా...
ABN, Publish Date - May 26 , 2025 | 01:36 PM
ఎన్టీఆర్ 'బడిపంతులు' సినిమాలో ఆయన మనవరాలిగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత ఏడేళ్ళ కే ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించిందనే విషయం ఎంతమందికి తెలుసు!?
వయసుతో పనేంటీ - మనసులోనే అంతా ఉందంటూ సాగుతుంటారు సినీజనం... దాంతో హీరోహీరోయిన్ల మధ్య వయసు తేడా ఎంత ఉన్నా పట్టించుకోరు... కానీ, సోషల్ మీడియాలో మాత్రం హీరో-హీరోయిన్ ఏజ్ విషయంలో రచ్చ సాగుతూనే ఉంది.
ఒకప్పుడంటే సినిమాతోనే వినోదం సాగేది. అందువల్ల అప్పట్లో హీరో (Hero), హీరోయిన్ (Heroine) మధ్య వయసు వ్యత్యాసం ఎంత ఉన్నా పట్టించుకొనేవారు కాదు. సినిమాలో కథ, కథనం, పాటలు, సంగీతం బాగున్నాయా లేదా అని మాత్రమే చూసేవారు. దాంతో మనవరాలి వయసున్న భామతోనూ తాత వయసున్న హీరోలు ఆడిపాడారు. విజయాలు సాధించారు. కానీ, నేడు సీన్ అలా లేదే! సోషల్ మీడియా రాజ్యమేలుతోంది... ఎంటర్ టైన్ మెంట్ కోసం అనేక దారులు అందుబాటులో ఉన్నాయి. అన్నిటినీ మించి చేతిలోని సెల్ ఫోన్ ఉండే రోజులివి... ఇష్టమైనవి చూడొచ్చు... సోషల్ మీడియాలో అకౌంట్ ఉంటే ఏమైనా రాయొచ్చు... కాబట్టి లెక్కలేనన్ని విమర్శలు వెల్లువెత్తుతాయి... ఇంతకూ విషయమేమిటంటే 'థగ్ లైఫ్' (Thug Life) ట్రైలర్ లో 70 ఏళ్ళ కమల్ హాసన్ (Kamal Hasan) 42 ఏళ్ళ అభిరామితో లిప్ లాక్ చేసేశారు... అదే ట్రైలర్ లో తనకంటే వయసులో 28 ఏళ్ళు చిన్నదైన త్రిష (Trisha) ను .. 'మేడమ్... ఐ యామ్ ఓన్లీ యువర్ ఆడమ్...' అని చెప్పడాన్నీ నెటిజన్స్ తప్పు పడుతున్నారు... అలాగే ఆ మధ్య చిరంజీవి (Chiranjeevi) 'భోళా శంకర్'లో తన కంటే 38 ఏళ్ళు చిన్నదైన శ్రీముఖి (Srimukhi) తో సరసాలు పోవడాన్నీ విడ్డూరంగా చూస్తున్నారు... ఇక 'డాకూ మహరాజ్'లో బాలకృష్ణ (Balakrishna) తనకంటే 34 ఏళ్ళు చిన్నదైన ఊర్వశీ రౌతేలాతో 'దబిడి దిబిడి' చేయడాన్నీ తప్పంటున్నారు...
కూతురు వయసున్న అమ్మాయిలతో ముసలి హీరోలు నటించడమే తప్పంటున్నారు జనం... సినిమా అంటేనే మాయ చేయడం... మరి పడచు అమ్మాయిల సరసన ముసలి హీరోలు కుర్రాళ్ళలాగా చిందులేయడంలో తప్పేముంది? అని కొందరు స్టార్స్ ఫ్యాన్స్ టేకిట్ ఈజీ అన్న చందాన చెబుతున్నారు... రవితేజ (Raviteja) తన కంటే 31 ఏళ్ళ చిన్నదైన భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) తో రొమాన్స్ చేయడాన్నీ లెక్కిస్తున్నారు... అంతెందుకు మొన్నటికి మొన్న 'సికందర్' ప్రమోషన్స్ లోనే సల్మాన్ ఖాన్ (Salman Khan), తనకంటే 31 ఏళ్ళు చిన్నదైన రశ్మిక మందన్న (Rashmika Mandanna)తో లిప్ టు లిప్ కిస్ లాగించేశాడు... నిజానికి రశ్మిక తండ్రి మదన్ మందన్న... సల్మాన్ కంటే రెండేళ్ళు చిన్నవాడట! ఆ రీతిన సల్మాన్ ట్రోల్ కు గురయ్యాడు...
వయసుతో పనేంటి !?
నేడంటే సోషల్ మీడియా ఉంది కదా అని ట్రోల్ చేస్తున్నారు కానీ, ఒకప్పుడు తెరపై కూతురుగా నటించిన వారితోనే తరువాత రొమాన్స్ చేసిన హీరోలున్నారు... అంతెందుకు 'బడిపంతులు'లో నటరత్న యన్టీఆర్ (NTR) కు శ్రీదేవి (Sridevi) మనవరాలిగా నటించింది... తరువాత ఏడేళ్ళకే ఆయన సరసన 'వేటగాడు'లో హీరోయిన్ గానూ వగలు ఒలకబోసింది... వారిద్దరి మధ్య 40 ఏళ్ళ వ్యత్యాసం ఉన్నా జనం యన్టీఆర్ - శ్రీదేవి జోడీకి బ్రహ్మరథం పట్టారు... కాబట్టి వయసుతో పనిలేదన్నదే సినిమా జనం మాట!...
నిజం చెప్పాలంటే ముసలి హీరోలతోనే పడచు భామలకు ఎంతో కంఫర్ట్ గా ఉంటుంది... అదలా ఉంచితే హీరో, హీరోయిన్ మధ్య కాంబినేషన్ కు క్రేజ్ క్రియేట్ చేసి తమ ప్రాడక్ట్ ను సేల్ చేసుకోవాలనే సినీజనం ఆశిస్తారు... అలాంటప్పుడు ఎవరు ఎవరితో నటిస్తే ఏంటి? అంటున్నారు సినీజీవులు... రాబోయే రోజుల్లో ఇలా ఎన్ని ట్రోల్స్ సాగినా, అవి కరిగిపోయే మేఘాల్లాంటివే అనీ కొట్టి పడేస్తున్నారు... మరి ట్రోల్స్ ఇంకా ఏ తీరున సాగుతాయో చూడాలి.
Also Read: Gamblers Teaser: సంగీత్ శోభన్.. గ్యాంబ్లర్స్ టీజర్...
Also Read: Dacoit: ఎట్టకేలకు.. అడవి శేష్ సినిమా వచ్చేస్తోంది... డెకాయిట్ రిలీజ్ డేట్ ఇదే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి