Brahmanandam: నారాయణమూర్తి పులస చేప లాంటోడు...
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:04 PM
పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి తాజా చిత్రం 'యూనివర్సిటీ' మరోసారి జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీని చూసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు బ్రహ్మానందం... ఆర్. నారాయణమూర్తికి కితాబిచ్చారు.
పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి (R. Narayana Murthy) స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన 'యూనివర్సిటీ: పేపర్ లీక్' (University) ఆగస్ట్ 22న విడుదల కాబోతోంది. ఈ సినిమా లోగోను గతంలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు. ఇప్పుడీ సినిమా జనం ముందుకు రాబోతున్న సందర్భంగా ఆయనకు నారాయణమూర్తి సినిమాను చూపించారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ, 'తెలుగు సినిమా రంగంలో కస్తూరి శివరావు గారిది ఓ ఎరా, అలానే రమణారెడ్డి, రేలంగి గారికి ఒక ఎరా. అల్లు రామలింగయ్య (Allu Ramalingaih), పద్మనాభం (Padmanabham), రాజబాబు (Rajababu) గార్లది ఓ ఎరా. వాటిని చూసిన మనం ఇప్పుడు బ్రహ్మానందం ఎరా ను చూస్తున్నాం. ఆయన మహానటుడు, మహా జ్ఞాని. అన్నింటినీ మించిన మాస్టరు. అందుకే ఈ సినిమా ఆయనకు చూపించాను' అని అన్నారు. ఈ సినిమా ప్రేక్షకులు చూసి, మరిన్ని సినిమాలను తీసే శక్తిని ప్రదర్శించాలని ఆయన ప్రజలను కోరారు.
సినిమా చూసిన తర్వాత బ్రహ్మానందం (Brahmanandam) మాట్లాడుతూ, 'నారాయణమూర్తి తేనెటీగ లాంటి వాడు. తిరుగుతూ తిరుగుతూ ఉంటాడు. అన్ని చోట్ల తేనె పోగుచేసుకుని వచ్చి తలా ఒక చుక్క పంచిపెడుతుంటాడు. నా దృష్టిలో ఆయన అందమైన హీరో. ఒకసారి మదర్ థెరిస్సాను 'మీ దృష్టిలో అందమైన వ్యక్తి ఎవరు?' అని అడిగితే, 'ఎవరి మనసులో సేవాభావం ఉంటుందో, ఎవరి కళ్ళలో దయా గుణం ఉంటుందో... ఆ జీవి అందంగా కనిపిస్తుంది' అని చెప్పారు.
'నలభై యేళ్ళుగా నాకు నారాయణమూర్తి తెలుసు. నిరంతరం ప్రజలు, అందునా పేద ప్రజల పక్షాన నిలిచే వ్యక్తి ఆయన. ఈ సినిమా చూసిన తర్వాత నేను ఎంతో ఎమోషన్ కు గురయ్యాను. ఇవాళ మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో ఎంతో స్టడీ చేసి నారాయణమూర్తి ఈ సినిమా తీశాడు. ఇది వాస్తవానికి దూరంగా ఉన్న సినిమా కాదు. ఇది ఊహించుకున్నటువంటి ఒక సుందరాంగి సినిమా కాదు. హాయిగా తలరా స్నానంచేసి వచ్చి నేత చీర కట్టుకున్న స్రీ లా ఉన్న సినిమా ఇది. ఇందులో నిజాలుంటాయి, వెతుక్కోండి. ఇందులో బూతులు ఉండవు జీవితపు లోతులు వుంటాయి, వెతుక్కోండి. కొన్ని డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. డబ్బు కోసం కాకుండా నిజాయితీగా తను అనుకున్న దాని చెప్పాలని తీసిన 'యూనివర్సిటీ' సినిమా చూడండి. పేపర్ లీకేజీ సమస్యను చాలా చక్కగా ఇందులో వివరించారు. ఇలాంటి వారు వ్యక్తులు కాదు శక్తులు. గోదావరి భాషలో చెప్పాలి అంటే పులస చేపలాంటి వాళ్ళు. పులస చేప నదికి ఎదురు ఈదుతుంది. నారాయణమూర్తి కూడా అంతే. ఇలాంటి అద్భుతమైన సినిమాలు నారాయణమూర్తి మరిన్ని తీసి ప్రజల ఆశీర్వాదాలతో చిరస్థాయిగా ఉండాలి అని కోరుకుంటున్నాను' అన్నారు.
'యూనివర్సిటీ' సినిమాలో ఆర్. నారాయణ మూర్తి, వైఎస్ కృష్ణేశ్వర్ రావు, తిరుపతి నాయుడు, విజయ్ కుమార్ తో పాటు పలువురు నూతన నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
Also Read: Kiara Advani: వరుసగా పరాజయాలే...
Also Read: Thammareddy Bharadwaja: షూటింగ్‌లు ఆపడం అన్యాయం..