War 2: ఏసియన్ గ్రూప్ వర్సెస్ సితార ఎంటర్ టైన్ మెంట్స్...

ABN , Publish Date - Jul 01 , 2025 | 04:31 PM

రజనీకాంత్ కూలి సినిమా హక్కుల్ని ఏసియన్ గ్రూప్ దక్కించుకోవడంతో వార్ -2 హక్కుల కోసం సూర్యదేవర నాగవంశీ పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.

ఒక సినిమా రైట్స్ కోసం పెద్ద పెద్ద పొడ్యూసర్స్, పంపిణీ దారులు ఓ స్థాయిలో యుద్ధానికి దిగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కానీ ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో అదే జరుగుతోంది. రజనీకాంత్ (Rajinikanth) 'కూలీ' (Coolie) హక్కుల కోసం, హృతిక్ రోషన్ (Hrithik Roshan) 'వార్ -2' (War -2) డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ పోటీ పడ్డాయి. దానికి కారణం వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉండటమే. రజనీకాంత్ హీరోగా నటించిన గత చిత్రం 'జైలర్' (Jailer) సక్సెస్ కారణంగా ఆయన తాజా చిత్రం 'కూలీ'కీ క్రేజ్ ఏర్పడింది. పైగా దాన్ని ప్రామిసింగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రూపొందించడంతో అది రెట్టింపు అయ్యింది. అయితే ఈ సినిమా హక్కులు ఏసియన్ గ్రూప్ చేతికి చిక్కాయి. సునీల్ నారంగ్ భారీ మొత్తాన్ని ముట్టచెప్పి 'కూలి' రెండు తెలుగు రాష్ట్రాల హక్కుల్ని కైవసం చేసుకున్నారు. 'కూలి' చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషించడం కూడా ఈ క్రేజ్ కు ఓ కారణం. నాగార్జున కీ-రోల్ పోషించిన 'కుబేర' మూవీని ఏసియన్‌ ఫిలిమ్స్ సంస్థే నిర్మించింది.


ఇదిలా ఉంటే... హృతిక్ రోషన్ చిత్రాలకు తెలుగులో పెద్దంత మార్కెట్ లేదు. అతని సినిమాలు హిందీతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలైన దాఖలాలు లేవు. అయితే యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన 'వార్ -2'లో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర ను పోషించాడు. ఇందులో ఎన్టీఆర్ ది విలన్ లాంటి హీరో, హీరోలాంటి విలన్ పాత్ర అని అభిమానులు అనుకుంటున్నారు. దాంతో సహజంగానే 'వార్ -2' మూవీకీ ఊహించని క్రేజ్ ఏర్పడింది. అందువల్ల ఈ సినిమా హక్కుల కోసం కూడా అనేకమంది పోటీ పడుతున్నారు. 'కూలి' సినిమా హక్కులు ఎప్పుడైతే సునీల్ నారంగ్ కు చెందిన ఏసియన్ సంస్థకు దక్కాయో మిగిలిన వారి ఛాయిస్ 'వార్ -2' గా మారిపోయింది. దాంతో ఈ సినిమా హక్కులు ఎలాగైన పొందాలని నాగవంశీ పట్టుదలతో ఉన్నట్టు సమాచారం.

గతంలోనూ ఎన్టీఆర్ నటించిన 'దేవర' (Devara) సినిమాను సూర్యదేవర నాగవంశీనే రెండు తెలుగు రాష్ట్రాలలో పంపిణీ చేశారు. ఆ సినిమా మంచి లాభాలు అందించింది. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఏకంగా రూ. 80 కోట్ల ఆఫర్ ను యశ్ రాజ్ ఫిలిమ్స్ కు నాగవంశీ ఇచ్చినట్టు సమాచారం. అయితే నిర్మాత ఆదిత్య చోప్రా తెలుగు మార్కెట్ నుండి ఏకంగా వంద కోట్లను ఆశిస్తున్నారట. ఏకంగా చూసినా... ఈ డీల్ నాగవంశీకే దక్కుతుందని, అటూ ఇటూగా రూ. 90 కోట్ల వద్ద ఫిక్స్ కావచ్చునని సన్నిహితులు చెబుతున్నారు.


ఒకానొక సమయంలో 'వార్ 2' మూవీ విజయంపై నమ్మకం ఉన్న యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ సొంతగానే దీన్ని దేశ వ్యాప్తంగా విడుదల చేయాలని భావించిందట. కానీ ఇలాంటి సినిమాలను విడుదల చేయాలంటే... కేవలం ఆర్థిక బలం ఉంటే సరిపోదు. సరైన థియేటర్లను పొందగలిగే సామర్థ్యం కూడా ఉండాలి. 'కూలి' హక్కులు ఏషియన్ గ్రూప్ కు దక్కాయి కాబట్టి ఖచ్చితంగా దానికి మంచి థియేటర్లు లభిస్తారు. మరి ఆ రకంగా చూసినప్పుడు 'వార్ -2'ను బలమైన పంపిణీ దారుడి చేతిలో సినిమా పెడితే... వీలైనన్ని ఎక్కువ థియేటర్ల దక్కే ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా సూర్యదేవర నాగవంశీకి 'వార్ -2' సినిమా హక్కుల్ని ఇవ్వడమే సబబు అని సినిమా జనం అనుకుంటున్నారు.

Also Read: Pakeezah: నటి పాకీజాకు పవన్‌ కళ్యాణ్‌ ఆర్థిక సాయం

Also Read: Mahavatar Narsimha: గూస్ బంప్స్ తెప్పిస్తున్న హిరణ్యకశిపుడి ప్రోమో

Updated Date - Jul 01 , 2025 | 04:31 PM