Tollywood: దర్శకులదే పైచేయిగా....
ABN, Publish Date - Nov 19 , 2025 | 05:32 PM
మన దేశంలో దర్శకుల తీరు చూస్తే - ఇంతకు ముందో లెక్క- ఇప్పుడో లెక్క అన్నట్టుగా ఉంది. ఒకప్పుడు 'డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్' అన్న ట్యాగ్ ఉన్నా - స్టార్ హీరోస్ దే పైచేయిగా సాగేది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయిందంటున్నారు. ఆ ముచ్చటేంటో చూద్దాం...
ప్రస్తుతం మన దేశంలో టాప్ స్టార్స్ కంటే మిన్నగా డైరెక్టర్స్ వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు ఓ సినిమా తీస్తే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే, సదరు చిత్రంలో నటించే స్టార్ హీరో కంటే తక్కువ పారితోషికాన్నే పుచ్చుకొనేవారు. కానీ, ఇప్పుడు ఆ లెక్కలు మారాయి. హీరోతో సంబంధం లేకుండా తమకు పారితోషికం ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు కొందరు దర్శకులు. మరికొందరు సినిమా ప్రాఫిట్స్ లో వాటా కూడా తీసుకుంటున్నారు. ఇంకొందరు తాము దర్శకత్వం వహించే ప్రాజెక్ట్స్ లో నిర్మాణభాగస్వాములుగానూ మారుతున్నారు. ఇలా ఎటు చూసినా, వారి చిత్రాల్లో నటించిన స్టార్స్ కన్నా మిన్నగా దర్శకులు సంపాదిస్తూ ఉండడం విశేషంగా మారింది. త్రివిక్రమ్ (Trivikram) నిర్మాణభాగస్వామిగా మారి 'హారికా అండ్ హాసిని' బ్యానర్ పై రూపొందే సినిమాలకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సుకుమార్ (Sukumar) తాను దర్శకత్వం వహించే చిత్రాల్లో పార్ట్ నర్ గా చేరుతున్నారు. 'పుష్ప' సిరీస్ లో సుక్కు ప్రధాన భాగస్వామి కావడం విశేషం. అలా సదరు చిత్రంలో హీరోగా నటించిన అల్లు అర్జున్ స్థాయిలో సుకుమార్ కూడా సంపాదించారని విశేషంగా వినిపిస్తోంది. ఆ తీరున ఎంత లేదన్నా త్రివిక్రమ్ కు ఓ 80 కోట్లు, సుకుమార్ కు ఓ వంద కోట్లు వచ్చి ఉంటాయని అంటున్నారు.
'జవాన్' సినిమాతో ఆల్ ఇండియాలో సూపర్ హిట్ పట్టేసిన అట్లీ (Atlee) కుమార్ కూడా వంద కోట్లు పుచ్చుకున్నారని తెలుస్తోంది. 'కేజీఎఫ్' సిరీస్ తో తనదైన బాణీ పలికించిన ప్రశాంత్ నీల్ (Prasanth Neel) 'సలార్'కు, ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న 'డ్రాగన్'కు ఒక్కోదానికి వంద కోట్లు అందుకున్నారని సమాచారం. 'కల్కి 2898 ఏడి' సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన నాగ్ అశ్విన్ కూడా ఆ మూవీతో నూరు కోట్లు సంపాదించినట్టు వినికిడి. ఎటూ ఆ సినిమాకు ఆయన మామ సి.అశ్వనీదత్ నిర్మాత కావడం వల్ల నాగ్ అశ్విన్ కు కూడా భారీ మొత్తం అందిందని టాక్! ఇలా మన సౌత్ డైరెక్టర్స్ అందరూ వంద కోట్లకు పైగానే పుచ్చుకుంటున్నారు. కానీ, హిందీ సినిమా రంగంలో ఎవరూ వంద అందుకోవడం లేదని తెలుస్తోంది. అక్కడ అందరికంటే మిన్నగా రాజ్ కుమార్ హిరాణీ 80 కోట్లు, సంజయ్ లీలా భన్సాలీ 65 కోట్లు, సిద్ధార్థ్ ఆనంద్ 45 కోట్లు అందుకుంటున్నారట.. అంటే రెమ్యూనరేషన్స్ పరంగా మన సౌత్ డైరెక్టర్స్ దే హవా అని చెప్పవచ్చు.
'యానిమల్'తో ఆల్ ఇండియా మూవీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న సందీప్ రెడ్డి వంగా కూడా ఆ సినిమాతో 150 కోట్లు పోగేసినట్టు సమాచారం. ఆ మూవీ ప్రాఫిట్స్ లో సందీప్ రెడ్డి వంగా షేర్ తీసుకున్నారట. అందువల్లే అంత మొత్తం అందిందని టాక్. ప్రస్తుతం ప్రభాస్ తో సందీప్ తీసే 'స్పిరిట్', రణబీర్ తో రూపొందించబోయే 'యానిమల్ పార్క్' సినిమాలకు సైతం 150కి తక్కువ కాకుండా అందుకుంటున్నారని సమాచారం. ఇక ఇండియాలో అత్యధిక పారితోషికం పుచ్చుకొనే డైరెక్టర్ గా తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి నిలిచారు. పాన్ ఇండియా మూవీస్ రూపొందించే నాటి నుంచీ రాజమౌళి ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తోన్న 'వారణాసి'కి 200 కోట్లకు పైగానే ఆయన అందుకుంటున్నారని అంటున్నారు. సినిమాలు పూర్తి చేసిన తరువాత కొందరు దర్శకులు తమ చిత్రాలకు సంబంధించిన కొన్ని ఏరియాల రైట్స్ రాయించుకుంటున్నారు. మరికొందరు తమ పారితోషికం కింద శాటిలైట్, ఓటీటీ రైట్స్ వాటా తీసేసుకుంటున్నారు. ఇంకొందరు సినిమా లాభాల్లోనే వాటలు పుచ్చుకుంటున్నారు. ఇలా పలు విధాలా ఈ దర్శకులు సాగుతున్నారు. అందువల్ల హీరోల కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్స్ సంపాదిస్తూ 'దటీజ్ ద కెపాసిటీ ఆఫ్ ద డైరెక్టర్' అని నిరూపిస్తున్నారు. మరి మునుముందు వీరి బాటలో ఇంకెంతమంది సాగుతారో చూడాలి.
Also Read: Divyabharathi: హద్దులు దాటాడు.. ఆ డైరెక్టర్ పై సుడిగాలి సుధీర్ హీరోయిన్ ఫైర్
Also Read: Tollywood: హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది ఎవరో తెలుసా...