Nagarjuna: నిరాశపర్చిన రీ-రిలీజ్...
ABN , Publish Date - Aug 29 , 2025 | 06:44 PM
కింగ్ నాగార్జున బర్త్ డే కానుకగా రీ-రిలీజ్ అయిన 'రగడ' చిత్రానికి పెద్దంత స్పందన ప్రేక్షకుల నుండి రాలేదు. ప్రధాన నగరాల్లో కూడా ఈ సినిమాకు పేలవమైన ఓపెనింగ్సే వచ్చాయి.
కింగ్ నాగార్జున (Nagarajuna) బర్త్ డే కానుకగా ఆగస్ట్ 29న 'రగడ' (Ragada) చిత్రాన్ని 4కె లో రీ-రిలీజ్ చేశారు. పదిహేళ్ళ క్రితం ఈ సినిమా విడుదలైనప్పుడు ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యింది. దాంతో నాగ్ ఫాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. కొందరైతే అసలు ఫ్లాప్ అయిన సినిమాను ఇప్పుడు రీ-రిలీజ్ చేయడం ఏమిటీ? అని వాపోతున్నారు. 'రగడ' సినిమాలో నాగార్జున సరసన అనుష్క (Anushka), ప్రియమణి (Priyamani) హీరోయిన్లుగా నటించారు. కామాక్షి స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున స్నేహితుడు స్వర్గీయ డి. శివప్రసాద్ రెడ్డి దీనిని నిర్మించాడు. వీరు పోట్ల (Veeru Potla) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతం అందించారు. వినోదానికి పెద్దపీట వేసిన ఈ సినిమాలో నాగార్జున తన తల్లిని చంపిన హంతకులపై ప్రతీకారం తీర్చుకుంటాడు. ఈ రొటీన్ రివేంజ్ డ్రామాను ఈ రోజుల్లో తిరిగి మళ్ళీ ఎవరు చూస్తారనే వాదన లేకపోలేదు. అయితే... ఆ మధ్య వచ్చిన చిరంజీవి 'స్టాలిన్' కూడా రీ-రిలీజ్ లో అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇప్పుడు అదే బాటలో 'రగడ' సాగింది.
నిజానికి 'రగడ' మూవీ బుకింగ్స్ ఓపెన్ అయినప్పుడు కూడా ఏమంత గొప్ప స్పందన ఆడియెన్స్ నుండి రాలేదు. విశాఖపట్నంలో సంగం, శరత్ థియేటర్లలో కేవలం 25 శాతం టిక్కెట్సే బుక్ అయ్యాయి. అంతేకాదు... శుక్రవారం కూడా ఈ సినిమాకు థియేటర్లలో ఏమంత రెస్పాన్స్ రాలేదు. శుక్రవారం నాగార్జున బర్త్ డే కూడా కావడంతో అభిమానులు మొదటి ఆటకు థియేటర్లలో కొంత హంగామా సృష్టించారు. ఆ తర్వాత షోస్ అన్నీ చప్పబడిపోయాయి. ఈ మధ్య కాలంలో నాగార్జున హీరోగా నటించిన సినిమా ఏదీ రాకపోవడం, ఆ మధ్య వచ్చిన 'కుబేర' (Kubera), ఇటీవల విడుదలైన 'కూలీ' (Coolie) లో నాగార్జున క్యారెక్టర్స్ చేయడంతో... 'రగడ' సినిమా కొంతలో కొంత బెటర్ ఓపెనింగ్స్ సాధిస్తుందని మేకర్స్ భావించారు. కానీ వారి అంచనాలు తప్పాయి. ఇదిలా ఉంటే... సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు. ఈ సందర్భంగా పవన్ నటించిన 'తమ్ముడు' (Thammudu) సినిమాను ఆగస్ట్ 30న విడుదల చేయబోతున్నారు. మరి 'తమ్ముడు'కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఒకవేళ అది కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోతే... ఇక రీ-రిలీజ్ హడావుడి క్రమంగా తగ్గిపోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Janhvi Kapoor: నాకు పెళ్లయ్యింది.. అతడే నా భర్త.. షాక్ ఇచ్చిన జాన్వీ
Also Read: Mayukham: పూజా కార్యక్రమాలతో 'మయూఖం'