Nagarjuna Akkineni: భక్తిరసం కురిపించిన నాగార్జున
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:47 PM
వైవిధ్యం కోసం తపించే కింగ్ నాగార్జున ఈ మధ్య విలన్ గానూ నటించారు. రాబోయే రోజుల్లోనూ విలక్షణమైన పాత్రలు ధరించాలని ఆశిస్తున్న నాగార్జున ఆగస్టు 29న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నాగార్జున బాణీని గుర్తు చేసుకుందాం...
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) నటవారసునిగా అడుగు పెట్టిన నాగార్జున (Nagarjuna) - యువసమ్రాట్ గా జనం మదిలో నిలిచారు. ఆ పై అనేక అరుదైన విజయాలను సొంతం చేసుకున్నారు. నటనలోనే కాకుండా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, వ్యాపారవేత్తగా నాగార్జున తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. ఈ యేడాది విడుదలైన 'కుబేరా' (Kubera), 'కూలీ' (Coolie) రెండు చిత్రాల్లోనూ నాగార్జున విలక్షణమైన పాత్రల్లో నటించి అలరించారు. రాబోయే రోజుల్లోనూ వైవిధ్యానికే పెద్ద పీట వేస్తూ సాగే ప్రయత్నంలో ఉన్నారు నాగ్. 'కింగ్'గా అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించిన నాగార్జున వంద చిత్రాల మైలురాయికి చేరువలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన నూరవ సినిమాను ఓ మెమరబుల్ మూవీగా అభిమానులకు అందించే దిశగా అడుగులు వేస్తున్నారు నాగ్.
'విక్రమ్' (Vikram) సినిమాతో హీరోగా అడుగు పెట్టిన నాగార్జున 'శివ' (Shiva) చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టినీ తనవైపు మరలేలా చేసుకున్నారు. 'శివ' ఇమేజ్ వల్ల వరుస ఫ్లాపులు చూసినా 'ప్రెసిడెంట్ గారి పెళ్ళాం'తో మళ్ళీ ఊపందుకున్న నాగార్జున ఆ పై 'హలో బ్రదర్, నిన్నే పెళ్ళాడతా, అన్నమయ్య, నువ్వు వస్తావని, మన్మథుడు, శివమణి, నేనున్నాను, మాస్, శ్రీరామదాసు' వంటి చిత్రాలతో అభిమానులను విశేషంగా అలరించారు. తన తరం హీరోల్లో భక్తుల పాత్రల్లో నటించి ఆకట్టుకున్న ఘనతను సొంతం చేసుకున్నారు నాగ్. 'అన్నమయ్య' (Annamayya) సినిమా నాగార్జునకు నటునిగా ఎనలేని పేరు సంపాదించి పెట్టిన సంగతి తెలిసిందే.
నాగార్జున స్టార్ గా సాగే నాటికే ఆయన తండ్రి నాగేశ్వరరావు కేరెక్టర్ రోల్స్ లోకి మళ్ళారు. అయితే నాగార్జున మాత్రం తన ఇద్దరు తనయులు హీరోలుగా రాణిస్తున్నా, ఇప్పటికీ స్టార్ గా జేజేలు అందుకుంటూ ఉండడం విశేషం. నాగార్జున తన చిత్రాల ద్వారా ఎందరో ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించారు. అన్నపూర్ణ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ ద్వారా టాలెంట్ ఉన్నవారికి ఛాన్స్ ఇవ్వనున్నారు. యంగ్ జనరేషన్ తో కలసి పనిచేస్తూ హుషారుగా ఉన్న నాగార్జున రాబోయే రోజుల్లో ఎలా మురిపిస్తారో చూడాలి. శుక్రవారం నాగార్జున బర్త్ డే సందర్భంగా పలు నిర్మాణ సంస్థలు ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపాయి. అలానే అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఆయన నటించిన సినిమాతో విడుదల చేసిన మాషప్ వీడియోకు మంచి స్పందన లభిస్తోంది.
Also Read: Tribanadhari Barbarik Review: 'త్రిబాణధారి బార్బరిక్' సినిమా మెప్పించిందా...
Also Read: Ram Pothineni: ఏ తెలుగు హీరో కొట్టని రికార్డ్‌ని కొట్టిన రామ్.. ఎలానో తెలుసా