Nagarjuna : విలన్‌గా చేస్తానంటే చెబుతా.. లేదా టీ తాగి వెళ్లిపోతానన్నాడు..
ABN , Publish Date - Aug 04 , 2025 | 05:39 PM
సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ‘కూలీ’ చిత్రంలో నాగార్జున్ సైమన్ అనే విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమా గురించి అయన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
'నిన్నేపెళ్లాడతా’ తర్వాత ‘అన్నమయ్య’ చేస్తుంటే.. 'ఇప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ ఎందుకు’ అని చాలామంది వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. సెట్‌కు వెళ్లాక బోర్ కొట్టకూడదంటే, అప్పుడప్పుడు వైవిధ్యమైన పాత్రలు పడాలి. నేను చాలా ప్రయోగాలు చేశా. చాలా దెబ్బలు తిన్నా. మళ్లీ లేచి నిలబడ్డా’ అని నాగార్జున (Nagarjuna) అన్నారు. రజనీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కూలీ’. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రంలో నాగార్జున్ సైమన్ అనే విలన్ పాత్ర పోషించారు. ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రధారులు. ఈ నెల 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాగార్జున ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
విలన్‌గా చేయడం సులభమా? కష్టమా?
నాగార్జున: విలన్‌గా చేయడమే చాలా ఈజీ. ఎందుకంటే మనం ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు కదా..
అంటూ ఆయన నటించిన చిత్రాల్లో కూలీలో ఎవరెవరికి ఏయే పాత్రలు సరిపోతాయో చెప్పారు నాగార్జున.
కిల్లర్ - సైమన్, సూపర్ -లోకేశ్, డాన్ -రజనీకాంత్, క్రిమినల్ - సత్యరాజ్, గీతాంజలి - శ్రుతిహాసన్ అని సమాధానమిచ్చారు నాగ్.
తొలిసారి కథ రికార్డ్ చేసుకున్నా: నాగార్జున
‘సినిమా సెట్స్‌కు వెళ్లాక బోర్ కొట్టకుండా ఉండాలంటే, ఎప్పటికప్పుడు ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలి. ఒకరోజు లోకేశ్ నన్ను కలిసి ‘మీరు విలన్‌గా చేస్తానంటే ఓ కథ చెబుతా. లేదంటే కొన్ని సినిమా కబుర్లు చెప్పి టీ తాగి వెళ్లిపోతా’ అన్నాడు. ‘ఖైదీ’ చూసి ఎప్పటికైనా అతనితో సినిమా చేయాలనుకున్నా. ఆ కోరిక కూలీతో తీరింది. ఆ కథ చాలా ఆసక్తిగా అనిపించింది. ‘రజనీ సర్ ఈ కథ ఒప్పుకొన్నారా’ అని అడిగా. ఎందుకంటే ఈ కథలో ‘సైమన్’ పాత్ర నిజంగా హీరోలాంటిది. ఇన్నేళ్ల నా జర్నీలో తొలిసారి కథ చెబుతుంటే రికార్డు చేసుకున్నా. ఇంటికి వెళ్లాక మళ్లీ మళ్లీ విన్నా. నాకు అనిపించిన కొన్ని మార్పులు చెప్పాను. మరొకరైతే లైట్‌గా తీసుకుంటారు. లేదా సినిమా నుంచి నన్ను తప్పించేవారు. కానీ, నేను చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ‘సైమన్’ పాత్రను లోకేశ్ డెవలప్ చేసిన విధానం నాకు ఎంతో నచ్చింది.
నెగటివ్ పాత్ర చేసినా.. అనుభూతి పాజిటివ్‌గానే..
రజనీ సర్ చెప్పినట్లు ఎప్పుడూ మంచి వాళ్లగానే సినిమాలో నటిస్తే బాగుండదు కదా. వైజాగ్‌లో మా ఫస్ట్ షూట్ జరిగింది. రెండో రోజు షూటింగ్ సందర్భంగా రికార్డు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది చూసి ‘మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా?’ అనిపించింది. సెట్‌లో లోకేశ్ చాలా కూల్‌గా ఉంటారు. అందరితో ఓపికగా వ్యవహరిస్తారు. అదే ఆయనలో ఉన్న మంచి లక్షణం.. అందుకే లోకేశ్‌తో సినిమా చేేసందుకు అందరూ క్యూ కడుతున్నారు. సన్ పిక్చర్స్ ఖర్చులో వెనకాడలేదు. కానీ వాళ్లు ఇచ్చిన బడ్జెట్‌లో రూ.5కోట్లు మిగిల్చి మరీ లోకేశ్ సినిమా పూర్తి చేశాడు. షూట్ సమయంలో ఆరు కెమెరాలతో పనిచేస్తాడు. మాక్జిమమ్ సింగిల్ టేక్‌లో ఫినిష్ చేస్తాడు. డబ్బింగ్ చెబుతుంటే ఇంత బాగా నటించామా? అనిపించింది. నాకు మూవీలో నెగెటివ్ రోల్ ఇచ్చినా ఈ పాత్ర చేసిన అనుభూతి పాజిటివ్‌గా ఉంది.
అంత మంచి మనసు ఆయనది..
షూటింగ్ సమయంలో రజనీగారు స్వయంగా వచ్చి నన్ను కలిసి మాట్లాడారు. అది ఆయన గొప్పదనం. నన్ను కలిసినప్పుడు కొద్దిసేపు అలాగే చూస్తూ ఉండిపోయారు. ‘మీరు ఇలా ఫిట్‌గా ఉన్నారని తెలిస్తే మన సినిమాలో నాగార్జున వద్దని లోకేశ్‌కు చెప్పేవాడిని’ అని నవ్వుతూ అన్నారు. ఆయనతో కూర్చొని మాట్లాడటం ఓ అద్భుతం. ఇన్ని సినిమాలు చేసినా పక్కకు వెళ్లి డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తారాయన. అంతే కాదు కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తారు. థాయ్‌లాండ్‌లో 17 రోజుల పాటు రాత్రి పూట యాక్షన్ సీక్వెన్స్ తీశాం. 350మందికి పైగా చాలా కష్టపడ్డాం. చివరి రోజు మొత్తం అందరినీ రజనీ సర్ పిలిచి తలో ఒక ప్యాకెట్ ఇచ్చి ‘ఇంటికి వెళ్లేటప్పుడు పిల్లలకు ఏమైనా తీసుకెళ్లండి’ అన్నారు. అంత మంచి హృదయం ఉన్న వ్యక్తి ఆయన’ అని నాగార్జున అన్నారు.