Photo Talk: నటరత్న యన్టీఆర్ నిండు హృదయం
ABN, Publish Date - Jun 17 , 2025 | 07:37 PM
ఇక్కడ ఫొటోలో నటరత్న యన్టీఆర్ (NTR)తో పాటు కనిపిస్తున్నది నటభూషణ శోభన్ బాబు (Sobhan Babu), ఆయన పక్కన చంద్రకళ (Chandrakala), ఆమె చెంతన వాణిశ్రీ (Vanisri), యన్టీఆర్ పక్కన నించున్నది చలం(Chalam).
ఇక్కడ ఫొటోలో నటరత్న యన్టీఆర్ (NTR)తో పాటు కనిపిస్తున్నది నటభూషణ శోభన్ బాబు (Sobhan Babu), ఆయన పక్కన చంద్రకళ (Chandrakala), ఆమె చెంతన వాణిశ్రీ (Vanisri), యన్టీఆర్ పక్కన నించున్నది చలం(Chalam). కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన 'నిండుహృదయాలు' చిత్రంలోనిది ఈ ఛాయాచిత్రం. సినిమాలో చలం, చంద్రకళకు గుడిలో పెళ్ళిచేసే సన్నివేశంలోని దృశ్యమిది. ఫొటోలో ఉన్నవారందరూ యన్టీఆర్ తో ఎంతో అనుబంధం ఉన్నవారు కావడం విశేషం!
ముందుగా చలం గురించి చెప్పుకోవాలి. యన్టీఆర్ హీరోగా రూపొందిన 'దాసి' (1952) చిత్రంతోనే చలం సినిమా రంగానికి పరిచయం అయ్యారు. అందులో యన్టీఆర్ కొడుకు పాత్రలో నటించారు చలం. ఆ తరువాత తమ సొంత చిత్రం 'తోడుదొంగలు' (1954)లోనూ చలంను నటింప చేశారు యన్టీఆర్. శోభన్ బాబు విషయానికి వస్తే ఆయన కూడా యన్టీఆర్ 'దైవబలం' (1959)తోనే తెరకు పరిచయం అయ్యారు. ఇక వాణిశ్రీ కూడా యన్టీఆర్ 'భీష్మ' (1962) ద్వారానే చిత్రసీమలో అడుగుపెట్టారు. మిగిలినది చంద్రకళ- ఆమె తొలి చిత్రం 'సతీసుకన్య' అయినా, యన్టీఆర్ హీరోగా రూపొందిన 'విశాల హృదయాలు'తోనే నటిగా గుర్తింపు సంపాదించుకున్నారు. తన సినిమాల ద్వారా చిత్రసీమకు పరిచయమైన వారు ఉన్నత స్థాయికి చేరుకోవాలని యన్టీఆర్ ఎప్పుడూ ఆశిస్తూ ఉండేవారు. అందువల్లే శోభన్ బాబులో ఓ గొప్ప కథానాయకుడు దాగున్నాడని భావించి, రామారావు ఎంతగానో ప్రోత్సహించారు. యన్టీఆర్ హీరోగా రూపొందిన దాదాపు పాతిక చిత్రాలలో శోభన్ బాబు కీలక పాత్రలు ధరించారు. యన్టీఆర్ హీరోగా రూపొందిన అనేక చిత్రాలలో చలం కూడా ముఖ్యపాత్రల్లో అలరించారు. పౌరాణిక చిత్రం 'బభ్రువాహన'లో టైటిల్ రోల్ లో చలం ను నటింప చేశారు యన్టీఆర్. అలాగే 'వీరాభిమన్యు'లో శోభన్ బాబుతో టైటిల్ రోల్ ధరింప చేశారు. ఇలా అవకాశం ఉన్న ప్రతీచోట వారికి తగిన వేషాలు ఇప్పించారు రామారావు.
వాణిశ్రీ విషయానికి వస్తే యన్టీఆర్ హీరోగా రూపొందిన అనేక చిత్రాలలో ఆమె బిట్ రోల్స్ లోనూ, చెల్లెలిగానూ, హాస్యనటిగానూ అలరించారు. తరువాతి రోజుల్లో వాణిశ్రీ హీరోయిన్ గా విజయకేతనం ఎగురవేస్తున్న తరుణంలో 'నిండు హృదయాలు'లోనే తొలిసారి ఆమె యన్టీఆర్ కు జోడీగా నటించడం విశేషం! చంద్రకళను కూడా పలు చిత్రాలలో నటింప చేశారు. తన స్వీయ దర్శకత్వంలో 'తల్లా పెళ్ళామా'లో నాయికగా ఎంచుకున్నారు. అలాగే 'పవిత్ర హృదయాలు'లోనూ చంద్రకళకు జోడీగా నటించారు రామారావు. 'ఆడపడచు'లో చెల్లెలిగా, 'మాతృదేవత'లో కూతురుగానూ యన్టీఆర్ తో కలసి చంద్రకళ అభినయించారు. ఇలా ఈ ఫొటోలోని వారందరూ యన్టీఆర్ కు ఆత్మీయులు. తరువాతి రోజుల్లో వారు రామారావును ఎలా అనుకున్నారో కానీ, ఆయన మాత్రం తన సినిమాల ద్వారా వెలుగు చూసిన వారిని ఆత్మీయులుగానే భావించేవారు.
ఇక 'నిండు హృదయాలు' చిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్ తోనూ యన్టీఆర్ కు ఎంతో అనుబంధం ఉంది. రామారావును సూపర్ స్టార్ గా నిలిపిన 'పాతాళభైరవి' చిత్రానికి అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్ గా పనిచేశారు విశ్వనాథ్. ఆ తరువాత యన్టీఆర్ నటించిన అనేక చిత్రాలకు సౌండ్ డిపార్ట్ మెంట్ లో పలు స్థాయుల్లో విశ్వనాథ్ సాగారు. అంతేకాదు కె.విశ్వనాథ్ తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం వాహినీ స్టూడియోస్ లో పనిచేసేటప్పుడు, విజయవాడ 'విజయా' పంపిణీసంస్థకు ఆయన కో ఆర్డినేటర్ గా ఉన్నప్పుడు ఆయనతో యన్టీఆర్ కు ఎంతో అనుబంధం ఉంది. అందువల్లే తమ సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి డైరెక్టర్ అయ్యారని తెలియగానే తనతో కూడా ఓ సినిమా చేయండి అంటూ విశ్వనాథ్ కు కబురు పెట్టారు రామారావు. అలా యన్టీఆర్ హీరోగా విశ్వనాథ్ తెరకెక్కించిన తొలి చిత్రం 'కలిసొచ్చిన అదృష్టం'. ఆ సినిమా తీసిన మిద్దే జగన్నాథరావు నిర్మాణంలోనే 'నిండు హృదయాలు' రూపొందింది. ఇక యన్టీఆర్-విశ్వనాథ్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం 'చిన్ననాటి స్నేహితులు'. దీనిని డి.వి.యస్.రాజు నిర్మించారు. యన్టీఆర్ తో విశ్వనాథ్ చివరి చిత్రం 'నిండుదంపతులు'ను మళ్ళీ జగన్నాథరావే నిర్మించడం విశేషం!
ఇలా ఈ ఒక్క ఫొటో ద్వారా యన్టీఆర్ బంధాలు- అనుబంధాలలోని కొన్నిటిని ముచ్చటించుకోగలిగాం.
Genelia: రోజుకు 10 గంటలు వివాదం.. దీపికాకు జెనీలియా కౌంటర్