Mega Star Chiranjeevi: పొంగల్ సీజన్.. చిరు సరికొత్త రికార్డ్
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:54 PM
ఇప్పటికే పొంగల్ సీజన్ లో డబుల్ హ్యాట్రిక్ ను అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీతో ముచ్చటగా మూడో హ్యాట్రిక్ కు చిరు గురిపెట్టినట్టు అయ్యింది.
మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీపై ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి రానుంది. పొంగల్ సీజన్ చిరంజీవికి బాగా కలసి వస్తుందని ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. అసలు చిరు కెరీర్ లో పొంగల్ మూవీస్ ఎలా సాగాయో చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్ లో ఇప్పటి దాకా 17 చిత్రాలు సంక్రాంతి (Sankranthi) కానుకలుగా జనం ముందు నిలిచాయి. వాటిలో ఓ మూడు సినిమాలు చిరంజీవి స్టార్ కాకముందు రిలీజైనవి. మిగిలిన 14 చిత్రాలు చిరంజీవి స్టార్ హీరో అయ్యాకే జనాన్ని పలకరించాయి. మధ్యలో ఓ పదేళ్ళ పాటు చిరంజీవి రాజకీయాల్లో అడుగుపెట్టడం ద్వారా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన సోలో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా 'ఖైదీ నంబర్ 150' (Khaidi No 150) పొంగల్ బరిలోనే దూకడం విశేషం. 2017 జనవరి 11న 'ఖైదీ నంబర్ 150' మూవీ రిలీజై బిగ్ హిట్ గా నిలచింది. ఆ సినిమాతోనే మళ్ళీ చిరంజీవి తన మెగాస్టార్ ఇమేజ్ ను కాపాడుకుంటూ సాగుతున్నారు. అందువల్లే ఈ సారి రాబోయే 'మన శంకరవరప్రసాద్ గారు' (Mana Sankara Vara Prasad garu) పైనా కూడా ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు.
చిరంజీవి వర్ధమాన నటునిగా సాగుతున్న రోజుల్లో ఆయన నటించిన మూడో సినిమా 'తాయారమ్మ-బంగారయ్య' 1979లో సంక్రాంతి సీజన్ లోనే రిలీజయింది. ఇదే ఆయన తొలి పొంగల్ మూవీ. ఇందులో చిరంజీవి నెగటివ్ టచ్ ఉన్న రోల్ లో కనిపించారు. ఆపై స్టార్ హీరో అయిన తరువాత 1985 పొంగల్ బరిలో 'చట్టంతో పోరాటం' అంటూ దూకారు. ఈ సినిమా పరవాలేదనిపించింది. 1986లో వచ్చిన 'కిరాతకుడు' (Kirathakudu) నిరాశ పరచినా, 1987లో 'దొంగమొగుడు' (Dongamogudu), 1988 'మంచిదొంగ' (Manchi Donga), 1989 'అత్తకు యముడు - అమ్మాయికి మొగుడు' చిత్రాలతో వరుసగా పొంగల్ బరిలో విజయాలు చూసి 'హ్యాట్రిక్' సాధించారు చిరంజీవి. ఆ పై 1996లో గ్యాప్ తీసుకొని 1997 పొంగల్ కే 'హిట్లర్' (Hitler) గా జనం ముందు నిలిచారు చిరంజీవి. 'హిట్లర్' సూపర్ హిట్ గా నిలచింది. తరువాత 1999 సంక్రాంతి సీజన్ లో 'స్నేహం కోసం' (Sneham Kosam) కూడా హిట్ మూవీ అనిపించుకుంది. ఆపై 2000 పొంగల్ బరిలో దూకిన చిరంజీవి 'అన్నయ్య' (Annayya) కూడా హిట్ గానే సాగింది. అలా కూడా చిరంజీవి పొంగల్ సీజన్ లో మరో 'హ్యాట్రిక్' సాధించారు. అందువల్ల ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
చిరంజీవి మళ్ళీ హీరోగా కెమెరా ముందుకు వచ్చాక రెండే రెండు సినిమాలను పొంగల్ కానుకలుగా రిలీజ్ చేశారు. 2017లో 'ఖైదీ నంబర్ 150', 2023లో 'వాల్తేరు వీరయ్య' - రెండూ మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి రీ-ఎంట్రీ ఇచ్చాక కూడా పొంగల్ కు మరో 'హ్యాట్రిక్' కొట్టబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. 2026 సంక్రాంతి బరిలో దూకనున్న 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ తప్పకుండా అన్ని వర్గాలను అలరిస్తుందని ఫ్యాన్స్ అభిలాష. పైగా సక్సెస్ రూటులో సాగుతోన్న అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తనదైన రీతిలో వినోదం పంచుతూ తెరకెక్కిస్తున్నారు. కాబట్టి తప్పకుండా 'మన శంకర వరప్రసాద్ గారు' రాబోయే సంక్రాంతికి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు లెక్కలు వేస్తున్నారు. వారి లెక్క ప్రకారం 'మన శంకర వరప్రసాద్ గారు' విజయం సాధిస్తే చిరంజీవికి పొంగల్ బరిలో మరో హ్యాట్రిక్ సొంతం అవుతుంది. చూద్దాం - 'మన శంకరవరప్రసాద్ గారు' ఏ రేంజ్ లో అరిస్తుందో!
Also Read: Rishabh Shetty: టాప్ 1 పొజిషన్ కు చేరువలో...
Also Read: Telusu Kada : తెలుసు కదా మూవీ రివ్యూ