Telusu Kada Review: తెలుసు కదా.. మూవీ రివ్యూ

ABN , Publish Date - Oct 17 , 2025 | 02:11 PM

సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన 'తెలుసు కదా' చిత్రం శుక్రవారం దీపావళి కానుకగా విడుదలైంది. ఈ చిత్రంతో నీరజ కోన దర్శకురాలిగా పరిచయమైంది.

Telusu Kada movie reivew

'డీజే టిల్లు, టిల్లు స్క్వేర్' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డను 'జాక్' సినిమా రిజల్డ్ నిరాశ పర్చింది. దాంతో కాస్తంత జాగ్రత్త పడుతూ 'తెలుసు కదా' మూవీని చేశాడు. స్టైలిస్ట్ నీరజ కోన ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ, ఈ మూవీని టీజీ విశ్వప్రసాద్, ఆయన కూతురు కృతి నిర్మించారు. 'మిరాయ్' లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుండి వచ్చిన 'తెలుసు కదా' ఎలా ఉందో తెలుసుకుందాం.

వరుణ్‌ (సిద్ధు జొన్నలగడ్డ) ఓ అనాధ. అతని స్నేహితుడు అభి (వైవా హర్ష). ఇద్దరూ చిన్నప్పుటి నుంచి కలిసే పెరుగుతారు. మొదటి నుండి తనకంటూ ఓ సొంత కుటుంబం ఉండాలని కలలుకంటూ ఉంటాడు సిద్ధు. తన ప్రమేయం లేకుండానే జరిగిన ఓ బ్రేకప్ తర్వాత బుద్థిగా అంజలి (రాశీఖన్నా)ని పెళ్లి చేసుకుంటాడు వరుణ్. పెళ్ళి అయిన కొన్ని నెలలకే అంజలికి పిల్లలు పుట్టరనే విషయం తెలుస్తుంది. దాంతో సరోగసీ ద్వారా పిల్లలను కనాలని అనుకుంటారు. అందుకోసం రాగ కుమార్ (శ్రీనిధి శెట్టి) అనే డాక్టర్ ముందు కొస్తుంది. వరుణ్, అంజలికి తాను సరోగసీ ద్వారా బిడ్డ కంటానని చెబుతుంది. అందుకు వరుణ్ అంగీకరించాడా? వరుణ్ కూ రాగాకు ముందే పరిచయం ఉందా? ఆ పరిచయాన్ని ఎందుకు వీళ్ళిద్దరూ అంజలి దగ్గర దాచి పెట్టారు? దాని పర్యవసానం ఏమిటీ? అనేది మిగతా కథ.


ముక్కోణ ప్రేమకథా చిత్రాలకు కొదవలేదు. ప్రతి యేడాది ఎన్నో అలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇది అదే తరహా రోమ్ కామ్ మూవీ అయినా... ఇందులో విషయం కాస్తంత భిన్నమైంది. ముక్కోణ ప్రేమకథ కంటే కూడా పెళ్ళైన తర్వాత ఓ యువకుడి జీవితంలో జరిగిన విచిత్రమైన సంఘటనలను బేస్ చేసుకుని సాగే కథ ఇది. కొత్తగా పెళ్ళైన ఓ జంట మధ్యలోకి సరోగసీ మదర్ గా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే అంశంతో నీరజ కోన ఈ కథను రాసుకున్నారు.

ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగినా... సెకండ్ హాఫ్ లో వరుణ్ నిజాన్ని బయటపెట్టిన తర్వాత మూవీ స్పీడ్ తగ్గిపోయింది. అక్కడ నుండి క్లయిమాక్స్ వరకూ లవ్ అండ్ హేట్ రిలేషన్ లోనే కథంతా సాగింది. ఈ మూడు పాత్రల్లో ఎవరికి వారు... తాము తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనే భావనలో ఉన్నా... థియేటర్లోని ప్రేక్షకుడు మాత్రం ఎవరి పక్షానా నిలబడే పరిస్థితి ఉండదు. ఎవరి సైడు తీసుకోలేక దూరంగా ఉండిపోతాడు. దాంతో ఏ పాత్రనూ ఓన్ చేసుకునే పరిస్థితి కనిపించదు. నాలుగు పాత్రల చుట్టూనే సినిమా అంతా సాగడం బోర్ కొట్టిస్తుంది. ద్వితీయార్థంలో డ్రామాను పక్కన పెట్టేసి, డైలాగ్స్ మీద మూవీని నడిపే ప్రయత్నం చేసింది నీరజా కోన. తీవ్రమైన భావోద్వేగాలను పండించాల్సి చోట పై పై సన్నివేశాలతో సినిమా సాగిపోయింది.


నటీనటుల విషయానికి వస్తే... సిద్ధు జొన్నలగడ్డ మెచ్యూర్డ్ పాత్ర చేశాడు. కానీ ఆ మెచ్యూరిటీని ప్రదర్శించే క్రమంలో అక్కడక్కడా తడబడ్డాడు. అతని పాత్రను మరింత బాగా రాసుకుని ఉండాల్సింది. లైఫ్ లో చిల్ అవ్వాలనుకునే కేర్ ఫ్రీ గర్ల్ గా శ్రీనిధి శెట్టి బాగానే చేసింది. రాశీ ఖన్నా పాత్ర హుందాగానే సాగినా సెకండ్ హాఫ్ లోని ట్వస్ట్స్ అండ్ టర్న్ ను ఎక్స్ ప్రెస్ చేయడంలో లోటు కనిపించింది. హీరో స్నేహితుడిగా వైవా హర్ష బాగా చేశాడు. అతని పాత్రే సినిమాలో కొంత రిలీఫ్ ను ఇచ్చింది. మిగిలిన మూడు, నాలుగు పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవే... ఏ పాత్రకూ ప్రాధాన్యం లేదు.

ఎస్. థమన్ స్వరపర్చిన 'మల్లిక గంథ' సాంగ్ బాగుంది. నేపథ్య సంగీతం గురించి పెద్దంత చెప్పుకోవాల్సిందేమీ లేదు. జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ కూల్ గా ఉంది. ఓ సాధారణమైన కథను తన స్క్రీన్ ప్లేతో కొత్తగా చూపించడానికి నీరజ కోన ప్రయత్నం చేసింది. కానీ అది కన్ ఫ్యూజన్ కు గురిచేసింది. కథకు తగ్గట్టుగా నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. 'తెలుసు కదా' అని హీరో ఎంత చెప్పినా... ఏదో తెలియని భావనే ఆడియెన్ కు కలుగుతుంది.

రేటింగ్ : 2.5/5

ట్యాగ్ లైన్: తెలిసిన కథ!

Updated Date - Oct 17 , 2025 | 05:41 PM

Telusu Kada Movie: బ్యూటిఫుల్‌ మెలోడీ

Telusu Kada Second Single: తెలుసు కదా.. లిప్ లాక్ తో సిద్దు రెచ్చిపోయాడుగా

Telusu Kada Trailer: ఆడదానికి ఆ కంట్రోల్ ఇవ్వకూడదు.. అదిరిపోయిన తెలుసు కదా ట్రైలర్

Telusu Kada: 'మల్లికా గంధ' సాంగ్ వచ్చేసింది

Telusu Kada: డీజే టిల్లును.. మించి ఉందిగా! తెలుసుక‌దా టీజ‌ర్‌