Mega Heros: ఘనవిజయం కోసం మెగా కాంపౌండ్ హీరోల ఎదురుచూపులు
ABN, Publish Date - Aug 15 , 2025 | 08:39 PM
మెగా కాంపౌండ్ హీరోస్ అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్, వైష్ణవ్ తేజ్ అని అందరికీ తెలుసు. వీరిలో ఒక్క అల్లు అర్జున్ మినహాయిస్తే మిగిలిన వారందరూ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నవారే కావడం గమనార్హం
మెగా కాంపౌండ్ రూపశిల్పులు చిరంజీవి, అల్లు అరవింద్ (Allu Aravind) అనే చెప్పాలి. ఆ కాంపౌండ్ నుండి వచ్చిన ప్రతి హీరో సక్సెస్ వెనుక ఈ ఇద్దరూ ఉన్నారు. అంతలా అల్లుకు పోయిన ఆ బంధం ఈ మధ్య చెరిగిపోయిందని వినిపిస్తున్నా, చిరంజీవి, అల్లు అరవింద్ అనుబంధాన్ని మాత్రం ఎవరూ చెరిపేయలేరని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కు 'పుష్ప' సిరీస్ తో రెండు బంపర్ హిట్స్ సొంతమయ్యాయి. పైగా 'పుష్ప' మొదటి భాగంతో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. తెలుగులో జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలచిన తొలి హీరోగా అల్లు అర్జున్ చరిత్రలో నిలచిపోయారు. అంతకు ముందే 'ట్రిపుల్ ఆర్'తో రామ్ చరణ్ 'గ్లోబల్ స్టార్' అయిపోయారని మెగాస్టార్ ఫ్యాన్స్ ఆనందిస్తూన్నారు. ఆ సమయంలోనే బన్నీ అవార్డు పట్టేశారు. ఆ తరువాత నుంచీ రామ్ చరణ్ కు సరైన సక్సెస్ పడలేదు. అలాగే చిరంజీవికి కూడా 'వాల్తేరు వీరయ్య' తరువాత ఆ స్థాయి సక్సెస్ దక్కలేదు.
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 2013లో వచ్చిన 'అత్తారింటికి దారేది' తరువాత ఆ రేంజ్ లో ఆయనకు విజయం లభించలేదు. ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ సో సో గానే సాగాయి. ఈ మధ్యే విడుదలైన 'హరిహర వీరమల్లు' సైతం పరాజయం పాలయింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన రాబోయే చిత్రం 'ఓజీ'పైనే ఆశలు పెట్టుకున్నారు. రామ్ చరణ్ కు 'ట్రిపుల్ ఆర్' తరువాత వచ్చిన సినిమాలేవీ ఆనందం పంచలేక పోయాయి. తండ్రి చిరంజీవితో కలసి నటించిన 'ఆచార్య' అంతే సంగతులు అనిపించుకుంది. ఇక శంకర్ దర్శకత్వంలో భారీగా రూపొందిన 'గేమ్ చేంజర్' కూడా నిరాశ పరచింది. అందువల్ల చెర్రీ ఫ్యాన్స్ ఆయన కొత్త చిత్రం 'పెద్ది'పై బోలెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు.
వరుణ్ తేజ్ 'ఫిదా, తొలిప్రేమ' చిత్రాలతో సోలో హీరోగా బంపర్ హిట్స్ చూశారు. ఆ తరువాత 'ఎఫ్-2, ఎఫ్-3'తోనే విజయాలు అందుకున్నా, వాటిలో వెంకటేశ్ కూడా ఉండడంతో అతనికీ సోలో హీరోగా సరైన సక్సెస్ లేక చాలా ఏళ్ళయిందనే చెప్పాలి. ప్రస్తుతం అతని ఆశలన్నీ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటిస్తోన్నతాజా చిత్రంపైనే ఉన్నాయి. సాయి దుర్గాతేజ్ గా మారిన సాయిధరమ్ తేజ్ ఇప్పటి దాకా 15 చిత్రాలకు పైగా నటించారు. అందులో 'విరూపాక్ష' బిగ్ హిట్ గా నిలచింది. ఆ స్థాయి సక్సెస్ అంతకు ముందు, ఆ తరువాత కూడా సాయి దుర్గాతేజ్ కు దక్కలేదు. రాబోయే 'సంబరాల ఏటిగట్టు'పైనే సాయి దుర్గాతేజ్ ఆశలు సాగుతున్నాయి. ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ వచ్చీ రాగానే 'ఉప్పెన'తో బంపర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఆ తరువాత వైష్ణవ్ తేజ్ నటించిన సినిమాలేవీ అంతగా మురిపించలేక పోయాయి. 'ఆదికేశవ' చిత్రం తరువాత వైష్ణవ్ తేజ్ ఎందుకనో ఏ సినిమానూ అంగీకరించలేదు. అతను కూడా ఆచితూచి అడుగేస్తూ ఓ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా మెగా కాంపౌండ్ హీరోస్ అందరూ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు మెగా కాంపౌండ్ హీరోస్ అందరికీ గ్రాండ్ సక్సెస్ లభించింది. దాంతో ఆ హీరోలలో ఒక్కరితో కలసి పనిచేస్తే ఇతరులతోనూ ఛాన్స్ కొట్టేయవచ్చు అని ఎంతోమంది హీరోయిన్స్ ఆశించారు. అలాగే కొందరు టెక్నీషియన్స్ సైతం మెగా హీరోల వెంటే పయనించారు. మెగా కాంపౌండ్ కు పునాది వేసిన చిరంజీవి 'విశ్వంభర'ను పూర్తి చేశారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ మూవీలో నటిస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా 2026 సంక్రాంతికి వస్తుందని తెలుస్తోంది. ఈ లోగా ఆయన 'విశ్వంభర' ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాగే సెప్టెంబర్ 25న 'ఓజీ'తో రావాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. అదే సమయంలో అటు ఇటుగా సాయి దుర్గాతేజ్ 'సంబరాల ఏటిగట్టు' రానుంది. వీరందరి తరువాత రామ్ చరణ్ 'పెద్ది' వచ్చే యేడాది మార్చిలో విడుదల కానుంది. మరి వీరిలో ఎవరు ముందుగా బిగ్ హిట్ ను అందుకుంటారో చూడాలని మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు సినీజనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: Rajnikanth: రజనీ తొలి సినిమా 'అపూర్వ రాగంగళ్'కు 50 ఏళ్ళు...
Kasthuri Shankar: బీజేపీలో చేరిన కాంట్రవర్సీ క్వీన్
Rashmika: రశ్మిక మూవీలో నోరా, మలైకా
Sir Madam - ott: 'సార్ మేడమ్’.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే!